చాగల్లు: పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలం ఊనగట్ల గ్రామంలో మామిడి తాండ్ర తయారీ కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందింది. మామిడి పండ్ల గుజ్జు నుంచి తాండ్రను తయారు చేస్తారు. ఏటా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఈ గ్రామంలో మామిడి తాండ్ర తయారీ ముమ్మరంగా జరుగుతుంది. మామిడి పండ్లను గతంలో రోళ్లలో వేసి కుమ్మి గుజ్జు తీసేవారు. ఇప్పుడు అధునాతమైన యంత్రాలు సహాయంతో గుజ్జు తీస్తున్నారు. ఆ గుజ్జులో బెల్లం లేదా పంచదార కలిపి తాటాకు చాపలతో మామిడి గుజ్జును పూతగా పెడతారు. ఈ విధంగా ఎండాకాలంలో రోజుకు ఐదు నుంచి ఎనిమిది సార్లు చొప్పున వారం రోజులపాటు పూత పెడితే మామిడితాండ్ర తయారవుతుంది. చాపల మాదిరిగా ఉన్న తాండ్రను ఆరిన తరువాత వాటిని చిన్నసైజు ముక్కలుగా కోసి 50 కిలోలు చొప్పున పెట్టెల్లో ప్యాక్ చేసి భద్రపరుస్తారు.
మామిడి పళ్లకు పెరిగిన గిరాకీ
మామిడితాండ్రకు కలెక్టర్, రసాలు, బంగినపల్లి వంటి మామిడిపళ్ల రకాలను వినియోగిస్తారు. ఈ ఏడాది మామిడి పళ్లకు గిరాకీ ఎక్కవగా ఉండటంతో టన్ను రూ.13 వేల నుంచి రూ.15 వేల వరకు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు మామిడితాండ్ర తయారీదారులు చెబుతున్నారు. నిడదవోలు, కొవ్వూరు పాడు, ద్వారకాతిరుమల, తాడేపల్లిగూడెం, నూజివీడు మార్కెట్ల నుంచి మామిడికాయలను టన్నుల లెక్కన కొనుగోలు చేస్తారు. గత రెండేళ్లుగా వాతావరణం అనుకూలించక మామిడికాయల కాపు తగ్గి రేట్లు గణనీయంగా పెరిగాయని తయారీదారులు చెబుతున్నారు.
గ్రామంలో 450 మందికి ఉపాధి
మామిడి తాండ్ర తాయారీ కేంద్రాలు పెద్ద కేంద్రాల్లో 25 నుంచి 30 మంది, చిన్న కేంద్రాల్లో 15 నుంచి 20 మంది ఉపాధి పొందుతున్నారు. గ్రామంలో సుమారు 450 మందికి పైగా మహిళలు, పిల్లలు ఉపాధి పొందుతున్నారు. వ్యవసాయ పనులు లేని సమయంలో మామిడితాండ్ర తయారీ సమయం కావడంతో మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు ఆదాయ వనరుగా కూడా ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి దోహదం చేస్తుంది. రైతులకు మామిడికాయలకు గిట్టుబాటు ధర రావడానికి కూడా ఇంది ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ విధంగా ఈ ప్రాంత ప్రజలకు మామిడితాండ్ర తయారీ చక్కని ఉపాధి అవకాశాలను కలిగిస్తోంది.
మార్కెట్ లేక తగ్గిన తయారీ కేంద్రాలు
మామిడితాండ్ర తయారీ ద్వారా రోజుకు టన్ను మామిడికాయల వరకు దిగుమతి చేసుకుంటారు. మామిడితాండ్రను అందమైన ముక్కలు కోసి 50 కేజీలు చొప్పున పెట్టెలుగా పెట్టి 200 పెట్టెలను లారీకి ఎగుమతి చేస్తుంటారు. టోకున మామిడితాండ్ర ధర క్వింటాలు రూ.7 వేలు నుంచి రూ.8 వేల వరకు ధర ఉంటుంది. ఆ వంతున రూ.50 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. ముంబై, చెన్నై తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి తాండ్ర ఎగుమతి అధికంగా జరిగేది. అయితే గతంలో వ్యాపారస్తులు మామిడితాండ్ర తయారీదారులను మోసగించి డబ్బులు సక్రమంగా చెల్లించకపోవడం వల్ల చాలావరకు ఎగుమతులు తగ్గిపోయాయి. మార్కెటింగ్ లేక ఇబ్బందులు పడుతున్నామని వీరు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం మామిడితాండ్ర తయారీ కేంద్రాలు గత రెండేళ్ల క్రితం 50 వరకు ఉండగా ప్రస్తుతం 10 కేంద్రాలకు పరిమితమయ్యాయి. మామిడితాండ్రను స్థానికంగా అమ్మడానికే తయారీదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తయారీదారులే కాకుండా మామిడితాండ్రను సైకిళ్లపై విక్రయిస్తూ మరో వంద మంది వరకు ఉపాధి పొందుతున్నారు.
రుణ సౌకర్యం కల్పించాలి
ఎన్నో ఏళ్లుగా మామిడితాండ్ర తయారీ పరిశ్రమ నిర్వహిస్తున్నాం. బ్యాంకులు రుణ సౌకర్యం కల్పిస్తే ప్రైవేట్ వ్యక్తుల నుంచి అధిక వడ్డీకి రుణాలు తెచ్చుకునే అవకాశం ఉండదు. మామిడికాయల రేట్లు గత రెండేళ్లుగా బాగా పెరగడం, మార్కెటింగ్ సమస్య వల్ల తయారీదారులు తగ్గిపోయారు. రుణ సౌకర్యం కల్పించి ప్రోత్సహించాలి.
– కె.శ్రీనివాసరావు, మామిడితాండ్ర తయారీదారుడు, ఊనగట్ల
మహిళలకు ఉపాధి
మామిడితాండ్రను కుటీర పరిశ్రమగా వేసవికాలంలో మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. పనిని బట్టి రోజుకు రూ.150 నుంచి రూ.200 వరకు కూలి లభిస్తుంది. ఈ ప్రాంత మహిళలకు తాండ్ర పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రభుత్వం మామిడితాండ్ర పరిశ్రమను గుర్తించి పోత్స్రహించాలి.
– యాండ్ర మాణిక్యం, మామిడితాండ్ర తయారీ కూలీ, ఊనగట్ల
సీజన్‌లో పనికి వెళతా
నేను డిగ్రీ చదివాను. ఉపాధి అవకాశాలు లేకపోవడంతో వేసవిలో తాండ్ర తయారీ పనులకు వెళుతున్నాను. సీజన్‌లో ఈ పనులకు వెళ్లడం వల్ల కుటుంబానికి ఆర్థికంగా అసరాగా ఉపయోగపడుతున్నాను. సీజన్‌లోనే పని ఉంటుంది. ఆ సమయంలో ఎంతో కొంత సంపాదించుకుంటున్నాను. నాలాగే చాలా మంది దీనిపై ఆధారపడ్డాం.
– కోడి సతీష్, యువకుడు, ఊనగట్ల
Comments
Please login to add a commentAdd a comment