మామిడిపండ్లు,పులిబొంగరాల కోసం ఎదురుచూపులు...
జ్ఞాపకం
వేసవి... పిల్లల హుషారుకు కొత్త రెక్కలు తొడుగుతుంది. వారిని ఊహల గుర్రం ఎక్కిస్తుంది. పెద్దవారినైనా మళ్లీ బాల్యంలోకి తీసుకెళుతుంది. జ్ఞాపకాల కొమ్మల్లో దాగిన మిఠాయి పొట్లాన్ని విప్పి తియ్యని కబుర్లెన్నో చెబుతుంది. సంగీత దర్శకుడు, గాయకుడు అయిన రమణ గోగుల వేసవి జ్ఞాపకాలలో దాగున్న తియ్యటి బాల్యంలోకి ఇలా ప్రయాణించారు.
‘‘ఇప్పటి పిల్లలకు వేసవి ఎలా ఉంటుందో కానీ ఎండాకాలం వస్తోందంటే చాలు నేటికీ చిన్నతనంలో నేను వెళ్లిన ఊరు, అక్కడ చేసిన అల్లరి, ఇంట్లోవారికి తెలియకుండా కొనుక్కున్న పులిబొంగరాలు, ఆడిన కోతికొమ్మచ్చి, క్రికెట్ ... అన్నీ ఒకదాని వెంట ఒకటి పోటీపడి గుర్తుకొచ్చేస్తాయి. మాది విశాఖపట్టణం. నాన్నకు అక్కడే ఉద్యోగం. మా బాబాయి వాళ్లది నెల్లూరు జిల్లాలోని కావలి. పరీక్షలు అయిపోగానే ప్రతి వేసవికి కావలి వెళ్లిపోయేవాళ్లం.
మా కోసం చిన్నమ్మ బోలెడు పిండివంటలు చేసి ఉంచేది. కొత్తబట్టలు కుట్టించి ఉంచేవారు. రోజూ మామిడిపండ్లు.. ఎంత తిన్నా ఇంకా తినాలపించే తియ్యటి రుచి వాటిది. సాయంత్రం ఐస్‌క్రీమ్ బండి దగ్గర ఐస్‌ప్రూట్ కొనాల్సిందే! కాసేపు ఆటలు. ఆ తర్వాత సోంపాపిడి. అటూ ఇటూ చూస్తే ఒక చిన్నగల్లీలో ఓ ముసలావిడ పులిబొంగరాలు చేసేది. వాటి రుచి ఇప్పుడు తలుచుకున్నా నోట్లో నీళ్లూరాల్సిందే! నోటికి ఖాళీ, కాళ్లకు అలసట ఉండేదే కాదు. అంత సంబరం వేసవి అంటే!!
సినిమాకు వెళ్లేటప్పుడైతే పెద్ద పండగే! అప్పుడన్నీ సైకిల్ రిక్షాలు. రెండు, మూడు సైకిల్ రిక్షాల మీద అంతా కలిసి సినిమాకు వెళ్లేవాళ్లం. సెలవులు అయిపోయాక మళ్లీ వేసవి కోసం ఎదురుచూస్తూ విశాఖపట్టణం చేరేవాళ్లం.
అప్పుడప్పుడు వేసవికి మా చిన్నమ్మ వాళ్ల కుటుంబం వచ్చేది. వస్తూ వస్తూ చిన్నమ్మ సున్నుండలు తెచ్చేది. రోజూ సాయంత్రం అందరం కలిసి బీచ్‌కి వెళ్లేవాళ్లం. మా ఇల్లు ఆంధ్రా యూనివర్శిటీకి దగ్గరి కాలనీలో ఉండేది. కాలనీలోనే పార్క్.. అందులో పేద్ద మామిడిచెట్టు. మా స్నేహితులతో కలిసి అక్కడే కోతికొమ్మచ్చి ఆటలు ఆడేవాళ్లం. మామిడికాయలు కోసి ఉప్పు-కారం పెట్టి తినేవాళ్లం. అక్కడ ఏర్పాటుచేసిన రేడియో నుంచి క్రికెట్ కామెంట్రీ వింటూ మేమూ క్రికెట్ ఆడేవాళ్లం.
రాత్రి పూట మేడపైన కూర్చొని ఆకాశంలోకి చూస్తూ నక్షత్రాలు లెక్కపెట్టేవాళ్లం. బోలెడన్ని కథ లు చెప్పుకునేవాళ్లం. అప్పుడు ఎక్కువగా విషయాలు వినడం వల్ల ఎక్కువగా ఊహించుకోవడం ఉండేది. అదే నేను సృజనాత్మక రంగంలోకి అడుగుపెట్టడానికి దోహదపడింది. జీవితకాలంలో చిన్నప్పటి వేసవి సెలవుల ఆనందాన్ని లెక్కేస్తే అత్యంత స్వల్పం. కానీ అదే జీవితాంతం వెంట వచ్చే ఓ తీపి జ్ఞాపకం. సృజనకు అతి పెద్ద వేదిక వేసవి.’’