భూదాన్ పోచంపల్లి (నల్లగొండ): మామిడి కాయల కోసం చెట్టెక్కిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి గాయాలపాలై మృతి చెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది. భూదాన్ పోచంపల్లి సీతావానిగూడెం గ్రామానికి చెందిన చెర్కు మల్లేష్ గౌడ్(42) బుధవారం తన వ్యవసాయ బావి వద్ద ఉన్న మామిడి చెట్టు ఎక్కాడు. కాయలు తెంపబోతూ కొమ్మ విరిగి కిందపడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లాడు.
కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మల్లేష్ మృతి చెందాడు. మల్లేష్‌కు భార్య, పదో తరగతి చదువుతున్న కుమారుడు, ఎనిమిదో తరగతి చదివే కుమార్తె ఉన్నారు. మల్లేష్ మరణంతో అతడి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.