పరువే కాదు.. మామిడి కాయలు కూడా! | Brother murdered his own Brother for Mangoes | Sakshi
Sakshi News home page

పరువే కాదు.. మామిడి కాయలు కూడా!

Published Tue, May 16 2017 10:19 AM | Last Updated on Tue, Oct 9 2018 4:55 PM

పరువే కాదు.. మామిడి కాయలు కూడా! - Sakshi

పరువే కాదు.. మామిడి కాయలు కూడా!

► తమ్ముడిని చంపిన అన్న
►జగిత్యాల జిల్లాలో ఘోరం
 
జగిత్యాల రూరల్‌: ఆస్థి కోసం, పరువుకోసం హత్యలు  చేయడం చూశాము. మరీ ఏకంగా మామిడి కాయల కోసం తమ్ముడి చంపిన ఘటన సోమవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలీవి.. మండలానికి చెందిన నాంపెల్లి హన్మండ్లు, నాంపెల్లి శ్రీను, నాంపల్లి లక్ష్మణ్‌లు ముగ్గురు అన్నదమ్ములు. తండ్రి వారసత్వం నుంచి వచ్చిన భూమిలో రెండు మామిడి చెట్లు ఉండగా ఒక మామిడిచెట్టు కాయలు నాంపెల్లి లక్ష్మణ్‌ (41) సోమవారం సాయంత్రం కోస్తుండగా రెండో అన్న నాంపెల్లి శ్రీను అక్కడకు చేరుకొని గొడవకు దిగాడు.

ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. ఈ క్రమంలో ఆవేశానికి గురైన శ్రీను ఇంటికి వెళ్లి కత్తి తీసుకొచ్చి మామిడి కాయలు తెంపుతున్న లక్ష్మణ్‌పై విచక్షణ రహితంగా దాడిచేశాడు. ఆందోళనకు గురైన లక్ష్మణ్‌ కేకలు వేశాడు. సమీపంలో ఉన్న మరో అన్న హన్మండ్లు వచ్చాడు. గమనించిన శ్రీను ఆయనపైనా దాడికి యత్నించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర కత్తిపోట్లకు గురైన లక్ష్మణ్‌ అక్కడిక్కడే మృతిచెందాడు. అయితే స్థానికులు కొందరు 108కు సమాచారం ఇచ్చి రక్తంమడుగులో పడిఉన్న లక్ష్మణ్‌ను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.

అయితే లక్ష్మణ్‌ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు దుబాయ్‌లో బస్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. ఇంట్లో మామిడి పచ్చడి పెట్టుకునేందుకు చెట్టు కాయలు తెచ్చుకునేందుకు వెళ్లి హత్యకు గురికావడం విషాదం నింపింది. మల్యాల సీఐ కృపాకర్, ఎస్సై కిరణ్‌కుమార్‌ జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య రమ, కొడుకులు అజయ్, అభి, కుమార్తె అఖిల ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement