ప్రకృతి సేద్య ప్రసాదం! | Offering natural farming! | Sakshi
Sakshi News home page

ప్రకృతి సేద్య ప్రసాదం!

Published Tue, Nov 8 2016 12:20 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

ప్రకృతి సేద్య ప్రసాదం! - Sakshi

ప్రకృతి సేద్య ప్రసాదం!

- 21 ఎకరాల్లో పాలేకర్ పద్ధతుల్లో మామిడి, వరి, కూరగాయల సాగు
- కృష్ణా జిల్లాలో సాగు.. హైదరాబాద్‌లో అమ్మకం
- నేరుగా వినియోగదారులకు విక్రయంతో పెరిగిన నికరాదాయం
- వరిలో ఎకరాకు రూ. లక్ష నికరాదాయం
- మామిడిలో కూరగాయల సాగుతో ఎకరాకు రూ. 75 వేల నికరాదాయం
 
 హైదరాబాద్‌లో సొంత వ్యాపారంలో స్థిరపడిన శేషసాయి వరప్రసాద్ జీవితాన్ని పాలేకర్ శిక్షణ మలుపుతిప్పింది. ఆ ప్రేరణతో నడి వయసులో పొలం బాట పట్టారు.  రసాయనిక అవశేషాల్లేని కూరగాయలు, పండ్లు, వరిని పండిస్తూ.. నేరుగా వినియోగదారులకు అమ్ముతూ అధిక నికరాదాయం గడిస్తున్నారు. వందల కి.మీ. దూరంలో ఉన్న తన పొలానికి వారాంతాల్లో వెళ్లి వస్తూ ప్రకృతి సేద్యాన్ని విజయవంతంగా కొనసాగిస్తుండడం విశేషం.
 
 సొంత గ్రామానికి దూరంగా నివసిస్తున్నా ప్రకృతి సేద్యం చేస్తూ సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు హైదరాబాద్‌కి చెందిన శేషసాయి వరప్రసాద్. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం బూరుగుగూడెం ఆయన స్వగ్రామం. 1985లో డిగ్రీ పూర్తి చేశాక హైదరాబాద్ వచ్చి పదేళ్లపాటు క్యాటరింగ్ సంస్థలో పనిచేశారు. ఆ తర్వాత నాగోలులో సొంతంగా క్యాటరింగ్ సంస్థను ఏర్పాటు చేసుకొని స్థిరపడ్డారు. గ్రామంలో ఉన్న 21 ఎకరాల మామిడి తోటను కౌలుకు ఇచ్చేవారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ దినపత్రిక ద్వారా పెట్టుబడి లేని ప్రకృతి సేద్యం గురించి చదివి 2008లో శిక్షణా శిబిరానికి హాజరయ్యారు. ఆ విధంగా ప్రసాద్ మనసు ప్రకృతి సేద్యం వైపు మళ్లింది. 2009 నుంచి తన తోటను కౌలుకు ఇవ్వటం మానేసి.. సొంతంగా తానే ప్రకృతి సేద్యం చేస్తున్నారు.

 వ్యాపారస్తులకు మామిడి పంటను అమ్మితే వారు దిగుబడి కోసం విచ్చలవిడిగా పూత, పురుగు నివారణ కోసం మందులు పిచికారీ చేసేవారు. దీంతో తోటలు దెబ్బతిని.. రైతులు మామిడి తోటలను తొలగించారు. ప్రసాద్ కూడా ఆరెకరాల్లో చెట్లను తొలగించి.. మూడెకరాల్లో కూరగాయలు, మూడెకరాల్లో వరిని ప్రకృతి సేద్య పద్ధతిలో సాగు చేపట్టారు. ప్రకృతి వ్యవసాయంలో ఒక వ్యక్తికి తానే శిక్షణ ఇచ్చి పొలంలో సూపర్‌వైజర్‌గా నియమించుకున్నారు. హైదరాబాద్ నుంచి వారాంతాల్లో వెళ్లి వస్తూ ప్రకృతి వ్యవసాయం కొనసాగిస్తున్నారు. ఎర్రనేల, బోర్లపైనే వ్యవసాయం. తొలి దశలో దిగుబడులు తగ్గినా తదనంతరం మంచి దిగుబడులు వస్తున్నాయి.  

 కూరగాయల సాగులో అధిక నికరాదాయం
 తొలి రెండేళ్లు పసుపును ప్రకృతి సేద్యంలో సాగు చేశారు. ఆదాయం కోసం పది నెలలు వేచి చూడాల్సి రావడంతో.. కూరగాయల సాగును చేపట్టారు. మూడెకరాల్లో వంగ, బెండ, టమాటా, దొండ, కాకర, వంకాయ, మునగ, మిర్చి, పొట్ల, బీర, దోసతోపాటు గోంగూర, తోటకూరలను సాగు చేస్తున్నారు. ఇదీ ఆయన సాగు పద్ధతి.. భూమిని పైపైన దున్ని ట్రక్కు మాగిన ఆవు పేడను వేస్తారు. ఎకరా పొలాన్ని ఐదు మడులుగా విభజించి, ఒక్కో మడిలో ఒక్కో రకం పంటను సాగు చేస్తున్నారు. దేశవాళీ వంగడాలతో పాటు కొన్ని సంకర రకాలను సాగు చేస్తున్నారు. బీజామృతంతో విత్తనశుద్ధి చేస్తారు. రెండు వారాలకోసారి ఎకరాకు 200 లీటర్ల జీవామృతాన్ని నీటి ద్వారా అందిస్తారు. చీడపీడల నివారణకు కషాయలు వాడుతున్నారు. పురుగును గుడ్డు దశలోనే నివారించేందుకు నీమాస్త్రం వాడతారు. అయినా పురుగు ఆశిస్తే అగ్ని అస్త్రం ద్రావణం పిచికారీ చేశారు. లద్దె పురుగు నివారణకు బ్రహ్మాస్త్రం వాడుతున్నారు. 20 లీ. కషాయాన్ని 200 లీ. నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేస్తున్నారు. వారానికి రెండు కోతలు తెగుతాయి. కిలో రూ. 20-30 చొప్పున విక్రయిస్తారు. నీటి కొరత వల్ల కూరగాయలు ఏడాదికి ఒకటే పంట వేస్తున్నారు. ఎకరాకు రూ. 5 వేలు ఖర్చవుతాయి. ఖర్చులు పోను రూ. 75 వేల నికరాదాయం లభిస్తున్నది.

 కూరగాయలు పండించిన చోట తర్వాత ఏడాది వరి పండిస్తారు. వరి పండించిన చోట తర్వాత ఏడాది కూరగాయలు పండిస్తారు. దీనివల్ల పంట దిగుబడులు బాగున్నాయని ప్రసాద్ తెలిపారు. ప్రకృతి సేద్యం చేసిన తొలి నాళ్లతో పోల్చితే దిగుబడి రెండింతలైంది. అప్పట్లో కూరగాయలు వారానికో కోత తెగేది.. ఇప్పుడు రెండు కోతలు తెగుతున్నాయి. బియ్యం, కూరగాయలు, పండ్లను హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు. కూరగాయలు రుచికరంగా ఉండటం, ఫ్రిజ్‌లో పెట్టకున్నా మూడు రోజులు తాజాగా ఉండటంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఫోన్ చేసి మరీ కొనుగోలు చేస్తున్నారు.  

 వరి.. ఎకరానికి రూ. లక్ష నికరాదాయం
 ప్రసాద్ తన పొలంలో బీపీటీ వరి రకాన్ని సాగు చేస్తున్నారు. బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తారు. దమ్ములో ఎకరాకు ట్రక్కు ఆవు పేడ వేస్తారు. ఎకరాకు 200 లీటర్ల జీవామృతాన్ని 15 రోజులకోసారి నీటి ద్వారా అందిస్తారు. రెండు వారాలకోసారి చీడపీడల నివారణకు బ్రహ్మస్త్రం,అగ్ని అస్త్రం వంటి కషాయాలు పిచికారీ చేస్తారు. ప్రకృతి సేద్యంలో తొలి ఏడాది 12 బస్తాల దిగుబడి వచ్చింది. దీంతో సాటి రైతులు అవహేళన చేశారు. అయినా.. ఆయన తన పని తాను కొనసాగించారు. గతేడాది ఎకరాకు 28 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రసాద్ ధాన్యాన్ని బియ్యంగా మార్చి విక్రయిస్తారు. బస్తా ధాన్యం మరపట్టిస్తే 55 కిలోల ముడి బియ్యం వస్తాయి. కిలో రూ. 80 చొప్పున అమ్ముతున్నారు. ఆయన దగ్గర బియ్యం కొనే వారిలో కనీసం 50 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉన్నారు. ఖర్చులు పోను ఎకరాకు రూ. లక్ష నికరాదాయం వస్తున్నదని ఆయన తెలిపారు.

 ఖర్చు రూ. 3 వేలు.. ఆదాయం రూ. 60 వేలు
 15 ఎకరాల మామిడి తోటలో 300 చెట్లున్నాయి. ఇవి 30 ఏళ్ల నాడు నాటినవి. రసాయనిక సేద్యంలో ఉన్న తోటను ప్రకృతి సేద్యంలోకి మార్చారు. చెట్ల మధ్య ఎటు చూసినా 48 అడుగుల స్థలం ఉంటుంది. గాలి, వెలుతురు పుష్కలంగా లభిస్తుంది. తొలకరిలో చెట్టుకు ఐదు లీటర్ల జీవామృతం పోస్తారు. 10 కిలోల ఆవుపేడ వేసి చెట్ల చుట్టూ ట్రాక్టరుతో దున్నుతారు. పూత దశలో బ్రహ్మస్త్రం, అగ్నాస్త్రం పిచికారీ చేస్తారు. ఫిబ్రవరిలో పిందె దశలో, పురుగు దశలో మరోసారి పిచికారీ చేస్తారు. రసాయనిక సేద్యంలో వచ్చే దిగుబడిలో గతేడాది సగం దిగుబడే వచ్చింది.

 రసాయనిక సేద్యంలో ఎరువులు, పురుగు మందులకు ఎకరాకు రూ. 20 వేల వరకు ఖర్చవుతుంది. ప్రకృతి సేద్యంలో రూ. 3 వేలకు మించి ఖర్చు కాదు. పండ్లకు మంచి ధర వస్తుంది. అయితే, చెట్లు బాగుంటే రసాయన సేద్యంలో కన్నా ప్రకృతి సేద్యంలో రెండు రెట్లు అధికంగా దిగుబడి తీయవచ్చు అంటారాయన. మామిడి పండ్లను అట్టపెట్టెల్లో ప్యాక్ చేసి, నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. ఒక్కో పెట్టెలో 30 కాయలుంటాయి. పెట్టె రూ. 400 చొప్పున విక్రయిస్తారు. గతేడాది ఎకరాకు 150 పెట్టెల దిగుబడి వచ్చింది. రూ. 60 వేల చొప్పున పదిహేనెకరాల్లో రూ. 9 లక్షల ఆదాయం వచ్చింది.

 మామిడి చెట్ల మధ్య ఖాళీగా ఉండే భూమిలో స్థంభాలను పాతించి.. గుమ్మడి, బూడిద గుమ్మడి, పొట్ల, బీర, ఆనప వంటి తీగజాతి కూరగాయలను అంతర పంటలుగా సాగు చేస్తూ ఎకరాకు రూ. 30 వేల ఆదాయం పొందుతున్నారు.

 ‘పంతులు హైదారబాద్ నుంచి వచ్చి పిచ్చి వ్యవసాయం చేస్తున్నాడ’ని సాటి రైతులు తొలినాళ్లలో ఎగతాళి చేసేవారని, ఇప్పుడు వారే ప్రకృతి సేద్యం చేసేందుకు ముందుకొస్తున్నారని ప్రసాద్ సంతృప్తిగా చెప్పారు. ఆయన తన తోటలో 26 నాటు ఆవులను పెంచుతున్నారు. ఆరుగురు రైతులకు ఆవుపేడ, మూత్రాన్ని ఉచితంగా ఇస్తూ.. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తుండడం విశేషం.
 కథనం : సాగుబడి డెస్క్ ఇన్‌పుట్స్ : కొమ్ము అర్జునరావు, సాక్షి, చాట్రాయి, కృష్ణా జిల్లా
 
 ఆరోగ్యం లేకపోతే సంపాదనకు అర్థం లేదు!
 హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు ‘హరిత విప్లవం’తో ఆర్థికాభివృద్ధి సాధించాయని చదివి స్ఫూర్తిపొందేవాళ్లం. వరిలో ఎకరాకు 50-60 బస్తాల దిగుబడి అంటే అబ్బురపడేవాళ్లం. కానీ.. ఇప్పుడక్కడ దిగుబడులూ తగ్గాయి. కేన్సర్ రోగుల కోసం ప్రత్యేక  రైళ్లు నడపాల్సి వస్తున్నది. కేవలం డబ్బుంటే సరిపోతుందా.. మనిషి బ్రతకటానికి..?  కుటుంబం ఆరోగ్యంగా లేకపోతే సంపాదించిన రూపాయికి అర్థం లేదు. ప్రతి రైతూ తన కుటుంబం కోసం ఎకరంలో విధిగా ప్రకృతి వ్యవసాయం చేయాలి. ఆరోగ్యంగా జీవించాలి.  ప్రకృతి సేద్యం ద్వారా ఐదారు రకాల కూరగాయలు పండించి, మంచి ధరకు అమ్ముకుంటే.. నెలకు ఎకరానికి రూ. 50 వేల వరకూ నికరాదాయం పొందవచ్చు. అంతేకాదు.. ప్రణాళికాబద్ధంగా పనులు చేసుకుంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల మాదిరిగా వ్యవసాయదారులు కూడా వారాంతపు సెలవులు తీసుకోవచ్చు.
  -  పెండ్యాల శేషసాయి వరప్రసాద్ (98480 23143), బూరుగుగూడెం, చాట్రాయి మండలం, కృష్ణా జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement