ప్రకృతి సేద్యంపై మే 9–10 తేదీల్లో బెంగళూరులో అంతర్జాతీయ సదస్సు
‘ప్రకృతి వ్యవసాయం – ప్రపంచ ప్రజలకు పౌష్టికాహారం, ఆహార భద్రత సాధనకు వినూత్న మార్గం’ అనే అంశంపై ఈ ఏడాది మే 9,10 తేదీల్లో అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సుకు బెంగళూరులోని రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమం వేదిక కానుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్యాత్మిక సంస్థ అయినప్పటికీ దేశీ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా రసాయన రహిత సహజాహారోత్పత్తిని ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ‘శ్రీశ్రీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ట్రస్టు’ (ఎస్.ఎస్.ఐ.ఎ.ఎస్.టి.) ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఎస్.ఎస్.ఐ.ఎ.ఎస్.టి. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రైతులకు శిక్షణ ఇస్తోంది. ఈ ట్రస్టు చైర్మన్‌గా హైదరాబాద్‌కు చెందిన పులిమామిడి రామకృష్ణారెడ్డి ఇటీవల బాధ్యతలు చేపట్టిన తర్వాత అంతర్జాతీయ సదస్సు నిర్వహించతలపెట్టారు.
చిన్న, సన్నకారు రైతుల స్థాయిలో దేశీ ఆవు పేడ, మూత్రం తదితరాలతో తయారు చేసిన ఉత్పాదకాలతోనే భూసారాన్ని గణనీయంగా, కచ్చితంగా పెంచుకునే వినూత్న పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. త్రికరణశుద్ధిగా చేస్తే ప్రకృతి వ్యవసాయంలో సులువుగా తొలి ఏడాదే అధిక దిగుబడి సాధించడం ముమ్మాటికీ సాధ్యమేనని రైతులతో పనిచేస్తున్న క్రమంలో గ్రహించామని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా విధాన నిర్ణేతలు, శాస్త్రవేత్తలు, వినియోగదారులు, రైతులకు భారతీయ ప్రకృతి వ్యవసాయం అద్భుత ఫలితాలను చాటిచెప్పడమే ఈ సదస్సు లక్ష్యమని ట్రస్టు చైర్మన్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘రుషి – కృషి’ పేరిట అనేక రాష్ట్రాల్లో తమ వద్ద ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ పొందిన రైతుల్లో కనీసం సగం మంది ఈ సాగుపద్ధతిని అనుసరిస్తున్నారని ఆయన వివరించారు. మే 9–10 తేదీల్లో జరిగే శిఖరాగ్ర సదస్సుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, శాస్త్రవేత్తలు, పలువురు దేశ విదేశీ నిపుణులు, ప్రముఖులు ఈ సదస్సులో ప్రసంగిస్తారని రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ సదస్సుకు హాజరుకాదలచిన వారు ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వివరాలకు agriconference.artofliving.org చూడండి.ఈ–మెయిల్: agriconference@artofliving.org, ఫోన్స్: 080–67612310, శ్రీమతి మరియమ్మ 098493 70809, శ్రీమతి సునీల 098490 00196
ప్రకృతి సేద్యంపై 7 నుంచి కొల్లాపూర్‌లో శిక్షణ
శ్రీశ్రీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ‘రుషి–కృషి’ పేరుతో ప్రకృతి వ్యవసాయ శిక్షణ నిర్వహించనున్నారు. ట్రస్టు అధినేత పులిమామిడి రామకృష్ణారెడ్డి, ఉమామహేశ్వరి రైతులకు శిక్షణ ఇస్తారు. కొల్లాపూర్‌లోని ఫంక్షన్‌హాలులో శిక్షణ ఉంటుంది. భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి ప్రకృతి సేద్యం చేపట్టిన సతీష్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆసక్తి గల రైతులు ఆయనను 95027 31861 నంబర్‌లో సంప్రదించి ముందుగా పేర్లు నమోదు చేయించుకోవచ్చు.
ఏప్రిల్ 9, 18 తేదీల్లో చెన్నమరాజుపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై గంగిరెడ్డి శిక్షణ
ప్రకృతి సేద్యంలో అనుభవజ్ఞుడు, వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన మన్నేటి గంగిరెడ్డి తన స్వగ్రామం పెండ్లిమర్రి మండలం చెన్నమరాజుపల్లి (కడప నుంచి 18 కి.మీ. దూరం)లో ఏప్రిల్ 9, 18వ తేదీల్లో రైతులకు శిక్షణ ఇస్తారు. గోమాత పంచామృత కషాయాల ఆశ్రమంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు శిక్షణ ఇస్తారు. తన వ్యవసాయ పనులు చూసుకుంటూనే నెలకు 10 రోజులు వివిధ గ్రామాలకూ వెళ్లి రైతులకు శిక్షణ ఇచ్చేందుకు సమయం కేటాయిస్తున్నానని గంగిరెడ్డి తెలిపారు. మహారాష్ట్రలో రైతులకు రెండేళ్ల పాటు శిక్షణ ఇచ్చిన అనుభవం ఆయనకు ఉంది. గంగిరెడ్డిని 95021 47401 నంబరులో సంప్రదించవచ్చు.
6న మిర్యాలగూడలో, 9న కొర్నెపాడులో శిక్షణ
పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వివిధ పంటల సాగుపై రైతునేస్తం ఫౌండేషన్ ఏప్రిల్ 6న మిర్యాలగూడలో రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రకృతి వ్యవసాయదారులు శ్రీమతి లావణ్యారెడ్డి, శ్రీమతి శశికళ, జి. సతీష్‌రెడ్డి, కొక్కు అశోక్‌కుమార్ రైతులకు శిక్షణ ఇస్తారు. ఏప్రిల్ 9న గుంటూరు జిల్లా కొర్నెపాడులో ప్రకృతి సేద్యం చేసే వరి, పత్తి, మిరప, ఉద్యాన తోటల రైతులకు వర్తించే పథకాలపై శిక్షణ ఇస్తారు. ఉద్యాన అధికారి రాజా కృష్ణారెడ్డి, రైతులు ధర్మారం బాజి, శ్రీమతి లావణ్యా రమణారెడ్డి శిక్షణ ఇస్తారు. వివరాలకు 83744 22599, 96767 97777 నంబర్లలో సంప్రదించవచ్చు.
విశాఖలో దేశీ విత్తనోద్యమకారుల సమ్మేళనం
భారత్ బీజ్ స్వరాజ్ మంచ్(బి.బి.ఎస్.ఎం.) ఆధ్వర్యంలో దేశీ విత్తనాలు సాగు చేస్తూ పరిరక్షిస్తున్న సేంద్రియ రైతులు, మేలైన వంగడాలను రూపొందించే రైతులు, దేశీ విత్తన పరిరక్షణోద్యమ కార్యకర్తల జాతీయ సమ్మేళనం ఏప్రిల్ 8 – 9 తేదీల్లో విశాఖపట్నంలో జరగనుంది. వివరాలకు.. కృష్ణప్రసాద్ – 098808 62058, దేవుళ్లు –98492 05469. prasadgk12@gmail.com