♦ ఈ సారి కాపు 40 శాతం లోపే..!
♦ రాలిపోతున్న పూత, కాత
♦ కాసిన కొద్దిపాటి కాయలపై ఎండ ప్రభావం
♦ ఆందోళనలో రైతన్న
వర్షాభావ పరిస్థితుల ప్రభావం మామిడి పంటపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. వర్షాలు కురవక తోటల్లో కాపు బాగా తగ్గిపోయింది. ఇటీవలి కాలంలో నాటిన మామిడి మొక్కలు నీరులేక ఎండిపోతున్నాయి. కాసిన కొద్దిపాటి కాయలు సైతం ఎండల ప్రభావానికి వాడి నేల రాలుతున్నాయి. ఈ సారి కూడా మామిడి పంట నిరాశాజనకమేనని చెప్పవచ్చు. గతేడాదితో పోలిస్తే ఈ సారి కనీసం 40 శాతం పంట కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరికొన్నిచోట్ల అయితే 20 శాతం పడిపోయినా ఆశ్చర్యపోనక్కరలేదు. - పరిగి
నియోజకవర్గంలో 3,000 ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. ఒక్క పూడూరు మండలంలోనే అత్యధికంగా 2,200 పైచిలుకు ఎకరాల్లో మామిడి తోటల పెంపకం చేపడుతున్నారు. జిల్లాలోనే పెద్ద మామిడి పళ్ల మార్కెట్‌గా పూడూరు మండలం మన్నేగూడకు పేరుంది. ప్రతి ఏడాది.. హైదరాబాద్, కర్ణాటక తదితర ప్రదేశాలకు టన్నుల కొలది మామిడి పళ్లను, కాయలను ఇ క్కడి నుంచే ఎగుమతి చేస్తారు. కేవలం మన్నేగూడ ప్రాంతంలోనే ప్రతి ఏడాది రూ.2 కోట్ల నుంచి రూ. మూ డు కోట్ల వ్యాపారం జరుగుతుంది. అ యితే ఇప్పుడిప్పుడే మామిడి తోటల సాగుపై దృష్టి సారించిన రైతులు పలువురు.. ప్రస్తుత పరిస్థితిని చూసి మునుముందు వెనక్కి తగ్గుతారేమోనని హార్టికల్చర్ అధికారులు ఆందోళనలో ఉన్నా రు. కాగా.. వచ్చిన కొద్దిపాటి కాపైనా చే తికి వచ్చే వరకు చెట్టుపై నిలుస్తుందో లేదోనని రైతులు అయోమయానికి గురవుతున్నారు.
గణనీయంగా తగ్గనున్న మామిడి..
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా మామిడి దిగుబడి గణనీయంగా తగ్గనుంది. ఈ పరిస్థితుల్లో రైతులతో పాటు మామిడికాయలు, మామిడి పళ్ల వ్యాపారం పైనే ఆధారపడి బతికే వ్యాపారులు సైతం ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఎ కరంలో సాగైన మామిడి తోటకు వ్యాపారులు రూ. 50 నుంచి రూ. 80 వేల వరకు గుత్తగా చెల్లించేవారు. ఈ ఏడాది ఎకరానికి రూ. 20 వెచ్చించినా గిట్టుబాటు కష్టమని వ్యాపారులు అంటున్నారు. రూ. లక్షలు వ్యాపారంలో కుమ్మరించి తరువాత చేతులు కాల్చుకునే క న్నా.. ఈ ఏడాది వ్యాపారానికి దూరం గా ఉంటే బాగుంటుందని పలువురు మిన్నకుండిపోయారు.
ధరలు ఆకాశన్నంటనున్నాయి..
ఈసారి మామిడి కాపు గణనీయంగా పడిపోవడంతో మామిడికాయలతో పాటు మామిడి పళ్ల ధరలు ఆకాశన్నం టనున్నాయని ఇప్పటి నుంచే ప్రచారం జరుగుతోంది. మామిడి పళ్ల ప్రియులకు కొనే స్తోమత తగ్గి.. తియ్యని పళ్లు చేదెక్కనున్నాయి. గతేడాది మామిడి పళ్లు పుష్కలంగా ఉండడంతో కిలో రూ. 25 నుంచి రూ. 80 చొప్పున విక్రయించగా ఈఏడాది కాస్త కిలో ధర రూ. 100 లోపు దొరకడం కష్టమేనని అంటున్నారు. ఈ ఏడాది పేదలు మామిడి పళ్లు తినడం కష్టమేనని ఉద్యానవన శాఖ అధికారులు సైతం చెబుతుండడం గమనార్హం.