న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. తేలికపాటి చలి మొదలైంది. అక్టోబర్ చివరి వారంలో చలి తీవ్రత పెరగనున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బెంగళూరులో భారీ వర్షాల కారణంగా అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేశారు.
దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రల్లో నేడు (సోమవారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో పాటు అండమాన్ నికోబార్ దీవులకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. బెంగళూరులో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన డోనా తుపాను ప్రభావంతో బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం అల్పపీడన ప్రాంతం ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకుని నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కి.మీ వరకు విస్తరించి నైరుతి దిశగా వంగి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా డోనా తుపాను ఏర్పడింది. దీని ప్రభావంతో వివిధ చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కన్నడ, ఉడిపి, బెలగావి, ధార్వాడ్, హవేరి, గడగ్, శివమొగ్గ, దావణగెరె, బళ్లారి, తుమకూరు, చిత్రదుర్గ, చిక్కబళ్లాపూర్, కోలార్‌తో సహా పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: 23న పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో తుపాను
Comments
Please login to add a commentAdd a comment