మంగోలియా రాజధాని ఉలాన్భతర్లో ప్రసిద్ధ గాంధన్ బౌద్ధారామంలో హంబా లామాకు బోధి మొక్కను బహుకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
మూడురోజుల చైనా పర్యటనను ముగించుకుని ఆదివారం ఉదయం మంగోలియాకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశంలో ఘనస్వాగతం లభించింది. రాజధాని ఉలాన్ భతర్ను సందర్శించిన మొట్టమొదటి భారత ప్రధాని మోదీయే కావడం విశేషం. స్వాగత కార్యక్రమాల అనంతరం మోదీ.. మంగోలియా ప్రధానమంత్రి చిమెద్ సాయికన్ బిలెగ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 14 దైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై ఇరుదేశాల అధికారులు సంతకాలు చేశారు.
మంగోలియా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తూ భారతదేశం అనుసరిస్తోన్న తూర్పు విధాన చట్టంలో మంగోలియా అంతర్భాగమని మోదీ పేర్కొన్నారు. ఆ దేశంలో మౌళిక వసతుల కల్పన కోసం బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఆథ్యాత్నిక ఉన్నతిగల మంగోలియాకు పొరుగుదేశంగా ఉండటాన్ని గర్వంగా భావిస్తున్నామని, భారత్కు ఇస్తోన్న గౌరవానికి తగ్గట్లుగానే మంగోలియా అభివృద్ధి బాధ్యతను పరిపూర్ణంగా నిర్వర్తిస్తామన్నారు.
ఆసియాలో శాంతి, సుస్థిరత కోసం కలిసిపనిచేద్దామని పిలుపునిచ్చారు. పరస్పర సహకారంతో ఇరుదేశాలూ అభివృద్ధి బాటలో పయనిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు ప్రసిద్ధ గాంధన్ బౌద్ధారామాన్ని సందర్శించిన ఆయన.. మఠం ప్రధాన గురువు హంబా లామాను కలుసుకుని ఆశీర్వచనాలు అందుకున్న అనంతరం ఒక బోధి మొక్కను లామాకు బహుమతిగా అందజేశారు. మోదీ కానుకపట్ల బౌధ్ద గురువులు ఆనందం వ్యక్తం చేశారు.