పేరుకే మార్కెట్ రోడ్డుపైనే బీట్ | beats are arranged on road due to not open the market | Sakshi

పేరుకే మార్కెట్ రోడ్డుపైనే బీట్

May 18 2014 11:50 PM | Updated on Oct 9 2018 4:55 PM

జహీరాబాద్ పట్టణంలో నిర్మించిన పండ్ల మార్కెట్ ప్రారంభోత్సవంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

జహీరాబాద్ టౌన్, న్యూస్‌లైన్: జహీరాబాద్ పట్టణంలో నిర్మించిన పండ్ల మార్కెట్ ప్రారంభోత్సవంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. నిర్మాణం పనులు పూర్తయి నాలుగు సంవత్సరాలవుతున్నా దుకాణాలు వినియోగంలోకి రావడంలేదు. లక్షలు ఖర్చుచేసి నిర్మించిన దుకాణాల షెటర్లు దెబ్బతింటున్నాయి. పండ్ల మార్కెట్ ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడంతో వ్యాపారం రోడ్లపైనే సాగుతోంది. దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 మామిడి పండ్ల సీజన్ కావడంతో రహదారిపైనే బీట్లు జరుగుతున్నాయి. జహీరాబాద్ పట్టణంలోని పశువుల సంత ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో 2009లో పండ్ల మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు రూ.28 లక్షలు మంజూరు కాగా అప్పటి మార్కెట్ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గీతారెడ్డి శంకుస్థాపన చేశారు. వ్యాపారుల కోసం 23 దుకాణాలను నిర్మించారు. సిమెంట్ రోడ్డు వేసి విద్యుత్ దీపాలు అమర్చారు. పండ్ల మార్కెట్ యార్డుకు గేటు నిర్మించారు. పనులు పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా దుకాణాలను వ్యాపారులకు కేటాయించడం లేదు.

 పశువుల పంత పక్కనే పండ్ల మార్కెట్ సముదాయం ఉండడంతో పశువులపాకగా మారిం ది. వ్యాపారులు కొనుగోలు చేసిన పశువులను ఇక్కడే కట్టేస్తున్నారు.దీంతో చెత్తాచెదారం,పశువుల పేడ పేరుకపోయి ఆధ్వానంగా మారింది. పశువుల వ్యాపారులు,రైతులు దుకాణాల్లో ఉంటున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు దుకాణాల షెటర్లను ధ్వంసం చేస్తున్నారు. చుట్టూ ప్రహరీ కూడా దెబ్బతిం టోంది. ఇప్పుటికైనా సంబంధిత శాఖ అధికారులు చొరవ తీసుకొని పండ్ల మార్కెట్‌ను ప్రారంభించి వినియోగంలోనికి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

 రోడ్డుపైనే మామిడి పండ్ల బీట్లు
 ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ నడుస్తోంది. జహీరాబాద్ ప్రాంతంలో పండిన మామిడి పండ్ల బీట్లు జరుగుతున్నాయి. పండ్ల మార్కెట్ ప్రారంభోత్సవంలో జాప్యం కారణంగా రోడ్లపై అమ్మకాలు చేపడుతున్నారు. తెల్లవారుజాము నుంచి పెద్ద మొత్తంలో పట్టణానికి పండ్లురావడం..అక్కడే బీట్లు జరగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement