‘లక్ష’ణమైన చెట్టు!
ఒక్క చెట్టు మామిడికాయలకు రూ. లక్ష చెల్లింపు
న్యూస్‌లైన్, మలికిపురం, పూర్వం సారస్వత రసపిపాసులైన రాజులు.. మెచ్చిన కవనానికి ‘అక్షరానికో లక్ష’ ఇచ్చేవారని ప్రతీతి. చరిత్రలో అలాంటి ప్రతిఫలం పొందిన కవులున్నారో లేరో గానీ.. మధుర ఫలాలు పండించి ‘వృక్షానికో లక్ష’ పొందిన కర్షకులు ఈ కాలంలోనే ఉన్నారు సుమా! తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లికి చెందిన సుందర బ్రహ్మయ్యకు ఆ ఘనత దక్కింది. ఆయనకున్న మామిడితోటలోని ఓ ముదురు బంగినపల్లి మామిడి చెట్టు ఈ ఏడు విరగ కాసింది.
మామిడిపండ్ల ప్రియులకు బంగినపల్లి రకం అత్యంత ప్రీతిపాత్రమైంది. దాంతో ఒక వ్యాపారి ఆ చెట్టు ఒక్కదానికి కాసిన కాయలనే రూ.లక్షకు కొనుగోలు చేశారు. తుపానులకు చెట్లు విరిగి, పొగమంచు ధాటికి పూత రాలిపోయి ప్రస్తుత సీజన్‌లో మామిడి దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. అయితే.. బ్రహ్మయ్య పంట పండించిన ఈ చెట్టు మాత్రం పుష్కలంగా కాసింది. తన తోటలోని బంగినపల్లి చెట్లు ఏటా బాగా కాస్తాయని, అయితే ఎన్నడూ లేని రీతిలో ఒక్క చెట్టే లక్షకు అమ్ముడుపోవడం ఎంతో ఆనందంగా ఉందని బ్రహ్మయ్య చెప్పారు. ఏదేమైనా.. ‘డబ్బు చెట్లకు కాస్తుందా?’ అని వెటకరించే వారు ఈ బంగినపల్లి చెట్టును చూసి వెనక్కి తగ్గాల్సిందే!