ఆ ఒక్కచెట్టు.. తోట పెట్టు
ఒక్క చెట్టుకే 14 రకాల మామిడికాయలు
న్యూస్‌లైన్, గంగవరం, సాధారణంగా ఓ మామిడితోటలో ఎన్నిరకాల చెట్లుంటాయి? ‘బంగినపల్లి, చిన్న రసాలు, పెద్ద రసాలు, కలకటేరు, ఇమాం పసంద్, సువర్ణరేఖ, నీలం..’ ఇలా మహా అయితే ఓ పదిరకాలుంటాయి. కానీ.. ‘రాజు తలచుకుంటే కానిదేదీ లేదు’ అని నిరూపిస్తూ.. చోడరాజు రాజుబాబు ఒక చెట్టునే అరుదైన తోటగా అవతరింపజేశారు. ‘చెట్టేమిటి, తోట కావడమేమిటి?’ అంటారా.. రాజుబాబు కృషి 14 రకాలుగా ఫలించి, కళ్లెదుట సాక్షాత్కరిస్తోంది మరి!
తూర్పు గోదావరి జిల్లా గంగవరం మండలం మొల్లేరుకు చెందిన రాజుబాబు తన ఇంటి ఆవరణలోని ఓ కలకటేరు చెట్టుకు 2012 వర్షాకాలంలో క్లోనింగ్ పద్ధతిలో 13 రకాల మామిడిని అంట్లు కట్టారు. ఈ వసంత రుతువులో ఆ తరువు ‘14 జాతుల కొలువు’గా ఫలించింది. తన ప్రయోగం విజయవంతం కావడంతో ఇప్పుడా చెట్టుకు కలకటేరుతో పాటు చిన్నరసాలు, పెద్దరసాలు, బంగినపల్లి, సువర్ణరేఖ, పండూరు మామిడి, కొత్తపల్లి కొబ్బరి, హైదర్ సాహెబ్, నీలం, పంచదార కల్తీ, ఇమాం పసందు, చెరకురసం, పునాస, పాపారాయుడు గోవ జాతుల కాయలు కాశాయని రాజుబాబు చెప్పారు.