ఈ వారం వ్యవసాయ సూచనలు
మామిడి కోత మెలకువలు: కాయ తొడిమ ఇరువైపులా పసుపు పచ్చరంగు రావడం, కాయ పైన నూనె గ్రంధులు ఏర్పడినప్పుడు కోయాలి. బంగిన పల్లిలో తొమ్మిది, దశేరిలో 8.5 టి.ఎస్. ఎస్. ఉన్నప్పుడు మాత్రమే కోసుకోవాలి. ఐ.ఐ.హెచ్.ఆర్., ఐ.ఏ.ఆర్.ఐ., డాఫోలి వేర్వేరుగా రూపొందించిన ఆధునిక కోత పరికరాలతో కోయడం ద్వారా కాయకు దెబ్బతగలకుండా నాణ్యతను పెంచుకోవచ్చు.
కాయలో ఉన్న జీడి సొన పూర్తిగా కారిపోయే వరకు బోర్లించి ఉంచడం ద్వారా కాయకు జీడి అంటకుండా చూసుకోవాలి. జీడి పూర్తిగా కారిపోయిన తర్వాత గడ్డిలో పేర్చి మాగబెట్టుకోవాలి. కాయలను కోసి కార్బైడ్ ద్వారా మగ్గబెట్టడం చట్టరీత్యా నేరం. కూరగాయలు: వేసవి కూరగాయల నాణ్యత, దిగుబడి దెబ్బతినకుండా కొన్ని మెలకువలు పాటించాలి.
నీటి తడులు పలుచగా, తక్కువ వ్యవధి వ్యత్యాసంతో ఇచ్చుకోవాలి. ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కన్నా ఎక్కువ ఉన్నప్పు డు, సాయంకాలం సమయంలో నీటిని పిచికారీ చేయడం ద్వారా మొక్కలను, కాయలు వేడి వల్ల కమిలిపోకుండా కాపాడుకోవచ్చు.డ్రిప్ లేదా స్ప్రింక్లర్ల ద్వారా నీటి తడులు ఇవ్వడం శ్రేయస్కరం. భూమిలో తేమ ఆవిరి కాకుండా ప్లాస్టిక్, గడ్డితో మల్చింగ్ చేసుకోవాలి.ఎరువులను తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు వేసుకోవాలి. డ్రిప్ సౌకర్యం ఉన్న చోట డ్రిప్ ద్వారానే ఎరువులను అందించాలి.ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కూరగాయల పంటల్లో రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఉన్నందువలన 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 2 మి.లీ. ఫిప్రోనిల్ లేదా 0.4 గ్రాముల ధయోమిధాక్సామ్ లేదా 0.3 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ మందును లీటరు నీటిలో కలిపి మార్చి మార్చి 7-10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి.
- డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు,
ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్