
మామిడికాయల కోసం దారుణ హత్య
తమ్ముడిని చంపిన అన్న
జగిత్యాల రూరల్: మామిడి కాయల కోసం ఓ అన్న తమ్ముడిని చంపిన ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో సోమవారం జరిగింది. మండలానికి చెందిన నాంపెల్లి హన్మండ్లు, నాంపెల్లి శ్రీను, నాంపల్లి లక్ష్మణ్ అన్నదమ్ములు. తండ్రి వారసత్వం నుంచి వచ్చిన భూమిలో రెండు మామిడి చెట్లు ఉండగా, ఒక చెట్టు కాయలను నాంపెల్లి లక్ష్మణ్ (41) సోమవారం కోస్తుండగా రెండో సోదరుడు నాంపెల్లి శ్రీను వచ్చి గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది.
ఆవేశానికి గురైన శ్రీను ఇంటికి వెళ్లి కత్తి తీసుకొచ్చి లక్ష్మణ్‌పై విచక్షణ రహితంగా దాడిచేశాడు. లక్ష్మణ్ కేకలు వేయగా, సమీపంలోనే ఉన్న మరో సోదరుడు హన్మాండ్లు వచ్చాడు. దీంతో శ్రీను అతడిపైనా దాడికి ప్రయత్నించాడు. అనంతరం పరారయ్యాడు. తీవ్ర కత్తిపోట్లకు గురైన లక్ష్మణ్‌ను స్థానికులు 108లో జగిత్యాల ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు దుబాయ్‌లో బస్ డ్రైవర్ కాగా, వారం రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. ఇంట్లో మామిడి పచ్చడి పెట్టుకునేందుకు చెట్టు కాయలు తెచ్చుకునేందుకు వెళ్లి హత్యకు గురయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.