
మోదీకి పాక్ ప్రధాని ప్రత్యేక కానుక
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈద్ కానుకగా మామిడి పళ్ల బుట్టను భారత ప్రధాని నరేంద్ర మోదీకి పంపారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా ఇటీవల సరిహద్దు వద్ద భారత జవాన్లు ఈద్ కానుకగా ఇచ్చిన మిఠాయిలు తీసుకునేందుకు పాకిస్థాన్ బలగాలు నిరాకరించిన సంగతి తెలిసిందే.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ కాల్పులకు దిగడం, సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాక్ ప్రధాని మామిడి పండ్ల దౌత్యం నడిపారు. ఇదిలావుండగా, గతేడాది కూడా విదేశీ కార్యదర్శుల స్థాయి చర్చల నుంచి భారత్ వైదొలిగాక నవాజ్ షరీఫ్ మామిడి పండ్లను మోదీకి, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలకు పంపారు.