
శాంబాజీ బిదే (ఫైల్ ఫొటో)
ముంబై : తన తోటలోని మామిడి పళ్లు తింటే కొడుకులు పుడతారని వివాదస్పద హిందుత్వ నేత శాంబాజీ బిదే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయ్‌గఢ్‌లో మరాఠాల యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ బంగారు సింహాసనాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ నాసిక్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శాంబాజీ మాట్లాడుతూ.. మామిడి పళ్లలో మంచి పోషకాలుంటాయని, తమ తోట మామిడి పళ్లు తిన్న జంటలకు మగ పిల్లలే పుట్టారన్నారు.
‘ఇప్పటి వరకు ఈ విషయాన్ని నా తల్లితో మినహా ఎవరికి చెప్పలేదు. నాతోటలో ఈ రకమైన మామిడి చెట్లను పెంచాను. ఇప్పటి వరకు నాతోటలోని మామిడి పండ్లు తిన్న 150 జంటలకు 180 మంది మగపిల్లలు జన్మించారు. ఎవరికైనా మగపిల్లలు కావాలనిపిస్తే ఈ మామిడి పండ్లు తినండి. సంతానలేమి సమస్యతో బాధపడే దంపతులకు కూడా ఈ మామిడి పండు ఉపయోగపడుతోంది.’ అని శాంబాజీ చెప్పుకొచ్చారు.
శాంబాజీ వ్యాఖ్యలపై సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. శాంబాజీ పిచ్చోడిలా మాట్లాడుతున్నాడని, అతని వ్యాఖ్యలు నవ్వుతెప్పిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్న అతనిపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది, సామాజిక వేత్త అబా సింగ్ డిమాండ్ చేశారు. మాజీ ఆరెస్సెస్ కార్యకర్త అయిన శాంబాజీ బిదే జనవరిలో బీమా-కొరిగన్ కులాల మధ్య చేలరిగిన హింసలో నిందితుడు.