మహారాజ ఫలం వచ్చేసింది
సాక్షి, ముంబై: మామిడి పండ్లలో అత్యంత ప్రీతిపాత్రమైన ‘హాపూస్’రకం పండ్లు రత్నగిరి మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. అయితే ధరలు మాత్రం సామాన్యులకు అందన్నంత ఎత్తులో ఉన్నాయి. ప్రస్తుతం రత్నగిరి మార్కెట్‌లో డజను పండ్లు రూ. 1,500 పలుకుతున్నాయి. దీంతో ఇతర ప్రాంతాల్లో ఈ మామిడి పండ్ల ధరలు మరింత అధికంగా ఉండే అవకాశాలున్నాయి. హాపూస్ రకం పండ్లు అత్యధికంగా కొంకణ్ ప్రాంతంలో అధికంగా ఉత్పత్తి అవుతాయి. దీంతో కొంకణ్‌లో ధరలను బట్టి ఇతర మార్కెట్‌లలో ఈ పండ్ల ధరలు ఎంత ఉండవచ్చో అంచనా వేస్తారు.
ప్రస్తుతం కొంకణ్‌లో మార్కెట్‌లలోనే డజను హాపూస్ పండ్లు రూ. 1,500 పలుకుతున్నాయి. దేశంలోనే అత్యంత పెద్ద పండ్ల మార్కెట్‌గా ప్రసిద్ధి గాంచిన ఏపీఎంసీలోకి ఇటీవల నాలుగు పెట్టెల మామిడి పండ్లు వచ్చినప్పుడు వ్యాపారులు వాటికి పూజలు చేసి స్వాగతించారు. ప్రస్తుతం మామిడి పండ్ల విక్రయాలు కొంకణ్‌లో ప్రారంభమయ్యాయని, త్వరలోనే నగర మార్కెట్లకు చేరవచ్చని ఇక్కడి వ్యాపారులు చెప్పారు.
ప్రారంభంలో సరుకు కొరత కారణంగా పండ్ల ధరలు ఆకాశాన్ని అంటినట్టు కన్పించినా ఆ తరువాత నిల్వలు పెరిగినకొద్దీ ధరలు దిగివస్తాయని పేర్కొంటున్నారు. ఏపీఎంసీ మార్కెట్‌లో వచ్చేవారం నుంచి పుష్కలంగా మామిడి పండ్ల దిగుమతి ప్రారంభం కాగలదని వ్యాపారులు అంటున్నారు. మే ఆఖరు వరకు వీటి సీజన్ ఉంటుందని వారన్నారు.