ఎగుమతికి మామిడేది..?
పంట లేక ఈ ఏడాది 30 శాతం తగ్గనున్న ఎగుమతులు
⇒ యూరోప్ నిషేధం ఎత్తేసినా దక్కని ప్రయోజనం
⇒ అంతర్జాతీయంగా తగ్గిన ధరలూ కారణమే
⇒ హుద్‌హుద్, అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన దిగుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈసారి యూరప్‌తో సహా పలు దేశాలు మామిడి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేసినా ఆ అవకాశాన్ని వినియోగించుకునే పరిస్థితులు కనిపించడం లేదు.
ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించక పంట దిగుబడి బాగా తగ్గిపోయిందని, దీంతో ఎగుమతి నాణ్యత ఉన్న కాయలు దొరకడం లేదని ఎగుమతిదారులు వాపోతున్నారు. ఈ నిషేధం ఎత్తివేయడం వల్ల ఎగుమతులు పెరగాల్సింది పోయి గతేడాదితో పోలిస్తే 30 శాతం తగ్గే అవకాశాలున్నాయంటున్నారు. గతేడాది సుమారుగా 42,000 టన్నుల మామిడి పళ్లను ఎగుమతి చేయగా ఈసారి ఈ లక్ష్యం అందుకోవడం కష్టమేనని అపెడా వర్గాలు పేర్కొంటున్నాయి. నాణ్యమైన పండు లభ్యత తక్కువగా ఉండటంతో పాటు, పెరిగిన ధరలు విదేశీ మార్కెట్లో పోటీని తట్టుకోలేకపోవడం కారణంగా పేర్కొంటున్నారు.
యూరోప్ నిషేధం తొలగించి నాలుగు నెలలు కావస్తున్నా.. ఆ దేశ ప్రమాణాలకు అనుగుణంగా మామిడి పండ్లను సరఫరా చేసే మౌలిక వసతులు లేకపోవడం పెద్ద గుదిబండగా ఉంది. అమెరికాకు రేడియేషన్ చేసి పంపాలని, అదే యూరప్‌కి అయితే వేడి నీటి ట్రీట్‌మెంట్ చేసి ప్యాకేజీ చేయాలని కానీ వీటికి తగిన సౌకర్యాలు లేకపోవడం ఇబ్బందిగా ఉందన్నారు. చివరి నిమిషంలో నిషేధం ఎత్తివేయడం వల్ల ఈ సీజన్‌లో అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయామని, ఈ నిర్ణయం వల్ల వచ్చే ఏడాది ఎగుమతులు 50 శాతం పెరుగుతాయన్న ఆశాభావాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ఇటీవల వ్యక్తంచేశారు.
స్థానికంగా అదే పరిస్థితి..
దేశీయ మామిడి ఉత్పత్తిలో 25 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది పంట దిగుబడి 50 శాతం క్షీణించినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హుద్‌హుద్ తుపాన్ వల్ల చెట్లు ధ్వంసంకావడంతో ఆంధ్రప్రదేశ్‌లో, అకాల వర్షాల వల్ల తెలంగాణలో మామిడి పంట దిగుబడి బాగా తగ్గిపోయింది. గత కొన్నేళ్లుగా దళారుల ప్రమేయం లేకుండా నేరుగా విదేశాలకు ఎగుమతులు చేయడం ద్వారా అధికాదాయం పొందే వాడినని, కానీ ఈసారి ఒక టన్ను కూడా పంపలేని పరిస్థితిలో ఉన్నట్లు రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు మురళి వాపోయారు.
అకాల వర్షాల వల్ల 15 ఎకరాల మామిడి తోటలో దిగుబడి 80% పడిపోవడంతో ఈసారి తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. దీనికితోడు ఈసారి సీజన్ ఇరవై రోజులు ఆలస్యంగా మొదలయ్యిందని, ఇప్పుడిప్పుడే ఎగుమతి నాణ్యత ఉన్న కాయలు రావడం మొదలైనట్లు ఎగుమతిదారులు చెపుతున్నారు. జూన్ నెలాఖరు వరకు ఎగుమతులు జరుగుతాయని, ఈ నెలరోజుల్లోనైనా మార్కెట్ మెరుగుపడుతుందన్న ఆశాభావాన్ని ఎస్‌డీ ఫ్రూట్ మర్చెంట్ ప్రతినిధి పేర్కొన్నారు.
గతేడాది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 1,000 టన్నుల మామిడి కాయలను ఎగుమతి చేశామని, ఈ ఏడాది కూడా ఈ లక్ష్యాన్ని చేరుకోగలమన్న ధీమాను అపెడా హైదరాబాద్ డిప్యూటీ జనరల్ మేనేజర్ టి. సుధాకర్ తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు బంగినపల్లి మామిడి పండ్లు ఎగుమతి చేయడానికి అనుమతి మంజూరు చేయగా, యూరోప్‌కు రెండు రాష్ట్రాల నుంచి రెండు సంస్థలకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు.
పెరిగిన ధరలు..
మన దేశం నుంచి మామిడి పండ్లు ప్రధానంగా యూఏఈ, సౌదీ అరేబియా, అమెరికా, బ్రిటన్ దేశాలకు ఎగుమతి అవుతాయి. అరబ్ దేశాల్లో ఆంక్షలు తక్కు వగా ఉండటంతో ఎగుమతుల్లో 80% ఈ దేశాలకే జరుగుతున్నాయి. కానీ ఈ ఏడాది దిగుబడి తగ్గి నాణ్యమైన కాయ లభించక ధర పెరిగింది. గతేడాది 12 మామిడి కాయలు రూ. 250కి లభిస్తే ఈ ఏడాది రూ. 350-450 వరకు పెరిగినట్లు ఎగుమతిదారులు పేర్కొంటున్నారు. దీనికి తోడు ప్యాకేజింగ్, రవాణా వ్యయాలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఈ ధర మరింత పెరుగుతోంది. దీంతో పాకిస్తాన్ వంటి దేశాల నుంచి పోటీ తట్టుకోవడం కష్టంగా ఉందని హైదరాబాద్‌కు చెందిన ఎగుమతిదారుడు వాపోయాడు.