దిల్ ‘మ్యాంగో’ మోర్..!
⇒ మళ్లీ మామిడి ఎగుమతుల జోరు
⇒ ఈయూ నిషేధం ఎత్తివేత ఫలితం
⇒ మామిడికి ధరలు పెరిగే అవకాశం
⇒ రైతుల్లో చిగురించిన ఆశలు
సాక్షి, చిత్తూరు/మచిలీపట్నం: భారత్ మామిడి పండ్ల దిగుమతిపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో మామిడి ఎగుమతులు మళ్లీ జోరందుకోనున్నాయి. దీంతో మామిడికి ధరలు పెరిగే అవకాశం ఉండడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి.
భారత్ నుంచి దిగుమతి అవుతున్న మామిడి పండ్లలో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయంటూ గత ఏడాది మే ఒకటి నుంచి 2015 డిసెంబర్ వరకు యూరోపియన్ యూనియన్ మామిడి దిగుమతులపై తాత్కాలిక నిషేధం విధించింది. అయితే మామిడి పండ్ల ఎగుమతులు, నాణ్యతకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు భారత ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ మామిడి దిగుమతులపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. మామిడితోటల ఆరోగ్య పరిస్థితి, నిర్వహణ, సర్టిఫికేషన్ విధానంలో కీలకమైన మార్పులను తాజాగా చేపట్టడంతో ఈ ఏడాది మార్చి నుంచి ఇతర దేశాలకు మామిడి ఎగుమతులకు మార్గం సుగమమైంది.
యూరోపియన్ యూనియన్ నిషేధంతో 2014 మామిడి సీజన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, పశ్చిమగోదావరి, చిత్తూరు, కడప తదితర జిల్లాల నుంచి విదేశాలకు మామిడి ఎగుమతులు తగ్గాయి. పశ్చిమగోదావరి జిల్లాలో హోతా కంపెనీ గత ఏడాది అన్ని జాగ్రత్తలు తీసుకుని 200 టన్నుల మామిడి కాయలను మాత్రం ఎగుమతి చేయగలిగింది. కృష్ణాజిల్లా నుంచి విదేశాలకు దాదాపు ఎగుమతులు నిలిచిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేసే అంశంపై ఇంకా విధివిధానాలు వెలువడాల్సి ఉందని, ఎగుమతులపై నిషేధం తొలగిస్తే రైతులకు మేలు జరుగుతుందని ఉద్యానశాఖ కృష్ణాజిల్లా అధికారి సుజాత తెలిపారు.
రూ.60-80 వేలకు ధర...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 92,913 హెక్టార్లల్లో మామిడి సాగవుతోంది. ఇక్కడ పండించే రకాల్లో ఖాదర్, బంగినపల్లె, బేనిషా రకాలను యూరోపియన్ యూనియన్, గల్ఫ్ దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. మామిడి పండ్లతో పాటు మామిడి గుజ్జు (పల్ప్) ఎగుమతి అవుతోంది. జిల్లావ్యాప్తంగా ఏడాదికి ఆరు లక్షల టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి అవుతుండగా,. ఇందులో పల్ప్ లక్ష టన్నులు, మామిడి పండ్లు 50వేల టన్నుల వరకు ఎగుమతి అవుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
2011 నుంచి క్రమేపీ పెరుగుతూ వచ్చిన ఎగుమతి రకాల టన్ను ధర గతేడాది రూ. 20 వేలకు పడిపోయింది. క్రితం ఏడాది ఎగుమతులపై నిషేధం ఉండడంతో జాతీయ మార్కెట్‌లోనూ మామిడి ధరలు తగ్గిన విషయం విదితమే. ప్రస్తుతం అంతర్జాతీయ ఎగుమతులపై నిషేధం తొలగించడంతో మామిడి పండ్లకు మంచి ధర లభించే అవకాశమున్నట్లు రైతు, వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
స్థానికంగా గత సంవత్సరంలో టన్ను రూ.20 వేల వరకు ఉన్న ధర... అంతర్జాతీయ ఎగుమతుల నేపథ్యంలో ఈ ఏడాది టన్ను రూ.60 వేల నుంచి 80 వేల వరకు పెరిగే అవకాశముందని రైతులు, వ్యాపారులు భావిస్తున్నారు. జిల్లాలో మే నెల రెండవ వారం నుంచి మామిడి పండ్ల సీజన్ ప్రారంభమవుతుంది. ఎగుమతి రకాలు ఖాదర్, బేనిషా, బంగినపల్లె జూన్ నెల రెండవ వారం నుంచి మార్కెట్‌లో అందుబాటులోకి వస్తాయి.