EU ban
-
రష్యా చమురు ధరపై పరిమితితో సంక్షోభం!
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాను నయానో, భయానో తమ దారిలోకి తెచ్చుకునేందుకు అమెరికా, దాని మిత్రదేశాలూ శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే కొత్తగా జీ7, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ దేశాలు... రష్యా ఎగుమతి చేసే ముడి చమురు ధరపై బ్యారెల్‌కు 60 డాలర్ల కనీస పరిమితి విధిస్తూ క్రితం వారం నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఒపెక్ ప్లస్ (రష్యా) దేశాలు మాత్రం రానున్న నెలల్లో ముడిచమురు ఉత్పత్తిని రోజుకు 20 లక్షల బ్యారెల్స్ తగ్గిస్తామని వెల్లడించాయి. ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులు మందకొండిగా ఉండటమే ఇందుకు కారణమంటున్నాయి. కాగా చమురు ఉత్పత్తిని పెంచమని అమెరికా అధ్యక్షుడు సౌదీ అరేబియాపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రపంచ చమురు ఎగుమతి చేసే దేశాల్లో 2వ స్థానంలో రష్యా ఉంది. చమురు ధరపై కనీస పరిమితి విధించి చమురు ఎగుమతి ద్వారా వచ్చే ఆదాయాలను నీరుగార్చి రష్యా ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి తీసుకెళ్లాలనేది ఈయూ దేశాల తపన. ఇది సఫలీకృతమైతే అమెరికా తన ఆధిపత్యం కొనసాగనీయ వచ్చనేది వ్యూహం. రష్యా ముడిచమురు ధరపై పరిమితి విధించడాన్ని క్రెమ్లిన్ తీవ్రస్థాయిలో ఖండించింది. రష్యాపై ఆంక్షలు విధించినప్పుడల్లా ప్రపంచ దేశాలపై ముఖ్యంగా ఐరోపా దేశాలపై అవి తీవ్ర ప్రతికూల ప్రభావాల్ని కలుగ జేస్తున్నాయని రష్యా గుర్తుచేసింది. రష్యాపై ఆంక్షల నేపథ్యంలో ముడిచమురు ధరలు 2022 ఫిబ్రవరి నుండి పెరుగుతూ వస్తున్నాయి. దీనితో ఈ సంవత్సరం రష్యా అదనంగా 41 శాతం లాభాలను పెంచుకొని ఆంక్షలు విధించిన దేశాలకు, అమెరికాకు షాక్ ఇచ్చింది. రష్యాతో స్నేహంగా లేని దేశాలకు మొత్తం ముడిచమురు ఎగుమతులను ఆపేసి, ప్రత్యామ్నాయ మార్కెట్లుగా వేరే దేశాలను (భారత్, చైనాలు) ప్రోత్సహిస్తామని రష్యా అంటోంది. మన విదేశాంగమంత్రి జైశంకర్ కూడా రష్యాపై ఆంక్షలకూ భారత్‌కూ సంబంధంలేదని స్పష్టం చేశారు. ఈ వారంలో జర్మనీ విదేశాంగమంత్రి అన్నాలేనా బేర్బాక్ న్యూఢిల్లీలో జైశంకర్‌ను కలిసి ఈయూ విధించిన పరిమితి ధరకు మద్దతునివ్వాలని అభ్యర్థించగా జైశంకర్ తోసి పుచ్చారు. యూరప్ ఇంధన అవసరాలకు అనుగుణంగా భారత్ ప్రాధాన్యతలను ఎంపిక చేసుకోజాలదని అన్నారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ప్రారంభం కాక ముందునుందే భారత్, రష్యాల మధ్య ముడిచమురు వాణిజ్యం ఉందని జైశంకర్ అన్నారు. బ్యారెల్ ముడి చమురు ధర 60 డాలర్లకూ, అంత కన్నా తక్కువ బిల్లు చేస్తే... ప్రపంచ ఇన్సూరెన్స్ కంపె నీలు బీమా చేయడానికి ముందుకురావు. దీనితో రష్యా ముడిచమురు రవాణా స్తంభించి పోతుందని ఈయూ ఆలోచన. ముడి చమురుపై పరిమితి విధించిన రెండురోజుల్లో బ్యారెల్ చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో 2 శాతం పెరిగింది. పరిశ్రమలకు అత్యంత అవసరమైన ఇంధన రవాణాను నిలిపివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు చిన్నా భిన్నమైపోతాయి. ఇదివరలో యూరప్ దేశాలకు రష్యా ముడి చమురు చాలా ఎగుమతి జరిగేది. తాత్కాలికంగా కొంతమేర దిగుమతులు ఆపినప్పటికీ రష్యా ఇంధనాన్ని ఈయూ దేశాలు వేరే మూడవ దేశం ద్వారా దిగుమతి చేసుకొంటున్నాయి. లిథువేనియా 83 శాతం, ఫిన్లాండ్ 80 శాతం, స్లొవేకియా 74 శాతం, పోలాండ్ 58 శాతం, హంగేరి 43 శాతం, ఎస్తోనియా 34 శాతం, జర్మనీ 30 శాతం, గ్రీస్ 29 శాతం రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నాయి. మిగతా దేశాల దిగుమతి కూడా ఇంచు మించు 15 శాతం తగ్గకుండా ఉంది. ఇప్పుడు అకస్మాత్తుగా ధరల పరిమితి విధింపుతో రష్యాతోపాటుగా ఈయూ దేశాల ఆర్థిక వ్యవస్థలూ చాలా నష్టపోనున్నాయి. రానున్న వారాల్లో ముడి చమురు ధర అంతర్జాతీయంగా 100 డాలర్లు దాటుతుందని నిపుణుల అభిప్రాయం. ఇదివరకటి ‘విన్–విన్’ వాణిజ్య పరిస్థితులు ఇప్పుడు ‘లాస్–లాస్’ పరిస్థితులుగా పరిణమించాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ధరలు తగ్గినప్పుడల్లా లాభాలను కార్పొరేట్లు అనుభవిస్తున్నారు. ధరలు పెరుగు తునప్పుడు నష్టాల భారాన్ని ప్రజలపై మోపటంతో ఆర్థిక వృద్ధిరేటు తగ్గుతూ వస్తోంది. ఫలితంగా ప్రతి దేశంలోనూ ద్రవ్యోల్బణం పెరుగుదలతోపాటు నిరుద్యోగం, నిత్యా వసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఇందువల్ల జీవన ప్రమాణాలు తగ్గిపోతూ ఆర్థిక మాంద్యం వైపు దేశాలు కుంటుతున్నాయి. ఉక్రెయిన్–రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధంలో మరణించిన సైనికుల కంటే... ఈ చలికాలం యూరప్‌లో ప్రజలు ఇంధన కొరతతో ఎన్నో రెట్లు చలిబారిన పడి చనిపోతారని అంచనా వేస్తున్నారు. యుద్ధాన్ని నివారించక, శాంతి చర్చలు జరగనీయకుండా ఆయుధాలతో, ఆంక్షలతో యుద్ధం పరిసమాప్తమవుతుందని అనుకోవటం అవివేకం. ఇప్పటికే రష్యాపై ఆంక్షలతో యూరప్ ప్రజలు, పరోక్షంగా అభివృద్ధి చెందుతున్న దేశాలూ తీవ్రంగా నష్టపోతున్నాయి. అమెరికా మాత్రం లబ్ధిపొందుతోంది. 3 సంవత్సరాల క్రితం ఒపెక్ దేశాలు, రష్యా ఆర్థిక వ్యవస్థలను నష్ట పరచే విధంగా అమెరికా షేల్ చమురును ప్రవేశపెట్టడంతో బ్యారెల్ చమురు 28 డాలర్లకు పడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా విధించిన ఈ కనీస 60 డాలర్ల పరిమితి వల్ల నష్టపోయేదీ ఈయూ దేశాలే. ప్రపంచ సాకర్ వేళ ఇది ఈయూ ‘సెల్ఫ్ గోల్’ కానుందా! (క్లిక్ చేయండి: డేటా రక్షణకు ఢోకా లేనట్లేనా?!) - బుడ్డిగ జమిందార్ అసోసియేట్ ప్రొఫెసర్, కె. ఎల్. వర్సిటీ -
కొవిషీల్డ్ వ్యాక్సిన్ విషయంలో కొత్త ట్విస్ట్
న్యూఢిల్లీ: గ్రీన్ పాసుల జారీ విషయంలో ఈయూకు భారత్‌కు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈయూ అప్రూవల్‌కి కొంత టైం పట్టొచ్చని సీరమ్ సీఈవో అదర్ పూనావాలా ప్రకటించడం, కొవిషీల్డ్‌కు ఈయూలోని కొన్ని దేశాలు పరిమితులతో అనుమతించడంతో ఈ విషయం చల్లబడింది. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. కొవిషీల్డ్ ఆథరైజేషన్ కోసం సీరమ్ ఇండియా అసలు ఈయూ మెడికల్ బాడీకి రిక్వెస్ట్ అప్లికేషన్ పంపలేదని తేలింది!. ఈ మేరకు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. కొవిడ్ వ్యాక్సిన్ల తయారీదారులు ఫార్మాలిటీకి ఒక మార్కెటింగ్ ఆథరైజేషన్ అప్లికేషన్ పంపాల్సి ఉంటుందని, కానీ, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్‌కు సంబంధించి ఇంతవరకు ఎలాంటి అప్లికేషన్ మాకు అందలేద’ని స్పష్టం చేసింది. అలాగే ఈయూ దేశాల వ్యాక్సిన్లు, మెడిసిన్స్కు సంబంధించి మాత్రమే అంతిమ నిర్ణయాలు తమ చేతుల్లో ఉంటాయని ఈఎంఏ స్పష్టం చేసింది. For the #COVID19vaccine Covishield to be evaluated for use in the EU, the developer needs to submit a formal marketing authorisation application to EMA, which to date has not been received. #EMAPresser — EU Medicines Agency (@EMA_News) July 15, 2021 ఇదిలా ఉంటే ఇండియన్ వెర్షన్ ఆస్ట్రాజెనెకా ‘కొవిషీల్డ్’కు ఈయూ మెడిసిన్స్ ఏజెన్సీ మొదటి నుంచి డిజిటల్కొవిడ్ సర్టిఫికెట్(గ్రీన్ పాస్) ఇవ్వడంలేదు. తయారీలో స్వల్ఫ తేడాల వల్ల వ్యాక్సిన్ తుది ఫలితం వేరుగా ఉంటుందని, కాబట్టి, తమ అనుమతులు తప్పనిసరని ఈయూ ఇదివరకే స్పష్టం చేసింది. ఆ అనుమతుల కోసమే సీరం ఇండియా ఒక అప్లికేషన్ పంపాల్సి ఉండగా.. ఇంతవరకు పంపలేదని ఇప్పుడు తెలిసింది. దీంతో ఆయా దేశాలకు వెళ్లే భారత ప్రయాణికులు(కొవిషీల్డ్ తీసుకున్నవాళ్లు) కఠిన క్వారంటైన్ ప్రొటోకాల్స్‌ను పాటించాల్సి ఉంటుంది. అంతేకాదు ఈయూలోని కొన్ని దేశాలు అనుమతించకపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఆల్రెడీ అప్లికేషన్ పంపామని ప్రకటించిన సీరమ్ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో చూడాలి. -
కోవీషీల్డ్‌కు గ్రీన్ పాస్ షాక్! సీరం సీఈవో స్పందన
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్న ధృవీకరణ పత్రాలను చాలా దేశాలు తప్పనిసరి చేసాయి. అయితే మన దేశంలో తయారైన కోవీషీల్డ్ టీకా తీసుకుని విదేశాలకు పయనం కాబోతున్నవారికి ఎదురవుతున్న గ్రీన్ పాస్ ఇబ్బందులపై శుభవార్త. కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుని ఈయూ దేశాలకు వెళుతున్న విమాన ప్రయాణీకులకు ఇబ్బందులపై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈవో అదార్ పూనావాలా స్పందించారు. కోవీషీల్డ్ కారణంగా ప్రయాణ సమస్యలను ఎదుర్కొంటున్న భారతీయుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని పూనావాలా ట్వీట్ చేశారు. ఈ త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని ఆందోళన అవసరం లేదని హామీ ఇచ్చారు. (DRDO: 2-డీజీ డ్రగ్, కమర్షియల్ లాంచ్ ) కోవీషీల్డ్ టీకా తీసుకున్న చాలామంది భారతీయులు ఎదుర్కొంటున్న విదేశీ ప్రయాణ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నానంటూ భరోసా ఇచ్చారు. దీనిని ఆయా దేశాల అత్యున్నత అధికారులు, రెగ్యులేటర్లు, దౌత్య అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు. దీనికి త్వరలోనే పరిష్కారం లభించనుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. గ్రీన్ పాస్ నుంచి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను యూరోపియన్ యూనియన్ మినహాయించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. పూణేకు చెందిన సీరం దేశీయంగా తయారు చేస్తున్న కోవిషీల్డ్ టీకా తీసుకున్న ప్రయాణికులు యూరోపియన్ యూనియన్ (ఈయు) ‘గ్రీన్ పాస్’కు కోవిడ్-19 వ్యాక్సిన్ల జాబితా నుంచి తొలగించింది. ప్రస్తుతం, ఫైజర్, మెడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ , వాక్స్ జెర్విరా ఈ నాలుగు టీకాలను యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఆమోదించింది. I realise that a lot of Indians who have taken COVISHIELD are facing issues with travel to the E.U., I assure everyone, I have taken this up at the highest levels and hope to resolve this matter soon, both with regulators and at a diplomatic level with countries. — Adar Poonawalla (@adarpoonawalla) June 28, 2021 -
దిల్ ‘మ్యాంగో’ మోర్..!
⇒ మళ్లీ మామిడి ఎగుమతుల జోరు ⇒ ఈయూ నిషేధం ఎత్తివేత ఫలితం ⇒ మామిడికి ధరలు పెరిగే అవకాశం ⇒ రైతుల్లో చిగురించిన ఆశలు సాక్షి, చిత్తూరు/మచిలీపట్నం: భారత్ మామిడి పండ్ల దిగుమతిపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో మామిడి ఎగుమతులు మళ్లీ జోరందుకోనున్నాయి. దీంతో మామిడికి ధరలు పెరిగే అవకాశం ఉండడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. భారత్ నుంచి దిగుమతి అవుతున్న మామిడి పండ్లలో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయంటూ గత ఏడాది మే ఒకటి నుంచి 2015 డిసెంబర్ వరకు యూరోపియన్ యూనియన్ మామిడి దిగుమతులపై తాత్కాలిక నిషేధం విధించింది. అయితే మామిడి పండ్ల ఎగుమతులు, నాణ్యతకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు భారత ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ మామిడి దిగుమతులపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. మామిడితోటల ఆరోగ్య పరిస్థితి, నిర్వహణ, సర్టిఫికేషన్ విధానంలో కీలకమైన మార్పులను తాజాగా చేపట్టడంతో ఈ ఏడాది మార్చి నుంచి ఇతర దేశాలకు మామిడి ఎగుమతులకు మార్గం సుగమమైంది. యూరోపియన్ యూనియన్ నిషేధంతో 2014 మామిడి సీజన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, పశ్చిమగోదావరి, చిత్తూరు, కడప తదితర జిల్లాల నుంచి విదేశాలకు మామిడి ఎగుమతులు తగ్గాయి. పశ్చిమగోదావరి జిల్లాలో హోతా కంపెనీ గత ఏడాది అన్ని జాగ్రత్తలు తీసుకుని 200 టన్నుల మామిడి కాయలను మాత్రం ఎగుమతి చేయగలిగింది. కృష్ణాజిల్లా నుంచి విదేశాలకు దాదాపు ఎగుమతులు నిలిచిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేసే అంశంపై ఇంకా విధివిధానాలు వెలువడాల్సి ఉందని, ఎగుమతులపై నిషేధం తొలగిస్తే రైతులకు మేలు జరుగుతుందని ఉద్యానశాఖ కృష్ణాజిల్లా అధికారి సుజాత తెలిపారు. రూ.60-80 వేలకు ధర... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 92,913 హెక్టార్లల్లో మామిడి సాగవుతోంది. ఇక్కడ పండించే రకాల్లో ఖాదర్, బంగినపల్లె, బేనిషా రకాలను యూరోపియన్ యూనియన్, గల్ఫ్ దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. మామిడి పండ్లతో పాటు మామిడి గుజ్జు (పల్ప్) ఎగుమతి అవుతోంది. జిల్లావ్యాప్తంగా ఏడాదికి ఆరు లక్షల టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి అవుతుండగా,. ఇందులో పల్ప్ లక్ష టన్నులు, మామిడి పండ్లు 50వేల టన్నుల వరకు ఎగుమతి అవుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 2011 నుంచి క్రమేపీ పెరుగుతూ వచ్చిన ఎగుమతి రకాల టన్ను ధర గతేడాది రూ. 20 వేలకు పడిపోయింది. క్రితం ఏడాది ఎగుమతులపై నిషేధం ఉండడంతో జాతీయ మార్కెట్లోనూ మామిడి ధరలు తగ్గిన విషయం విదితమే. ప్రస్తుతం అంతర్జాతీయ ఎగుమతులపై నిషేధం తొలగించడంతో మామిడి పండ్లకు మంచి ధర లభించే అవకాశమున్నట్లు రైతు, వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్థానికంగా గత సంవత్సరంలో టన్ను రూ.20 వేల వరకు ఉన్న ధర... అంతర్జాతీయ ఎగుమతుల నేపథ్యంలో ఈ ఏడాది టన్ను రూ.60 వేల నుంచి 80 వేల వరకు పెరిగే అవకాశముందని రైతులు, వ్యాపారులు భావిస్తున్నారు. జిల్లాలో మే నెల రెండవ వారం నుంచి మామిడి పండ్ల సీజన్ ప్రారంభమవుతుంది. ఎగుమతి రకాలు ఖాదర్, బేనిషా, బంగినపల్లె జూన్ నెల రెండవ వారం నుంచి మార్కెట్లో అందుబాటులోకి వస్తాయి.