రష్యా చమురు ధరపై పరిమితితో సంక్షోభం! | Analysis: G7 Russian Oil Price Cap Evolves Economies of EU Countries Will Suffer | Sakshi
Sakshi News home page

రష్యా చమురు ధరపై పరిమితితో సంక్షోభం!

Published Fri, Dec 9 2022 12:47 PM | Last Updated on Fri, Dec 9 2022 12:50 PM

Analysis: G7 Russian Oil Price Cap Evolves Economies of EU Countries Will Suffer - Sakshi

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాను నయానో, భయానో తమ దారిలోకి తెచ్చుకునేందుకు అమెరికా, దాని మిత్రదేశాలూ శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే కొత్తగా జీ7, ఆస్ట్రేలియా, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు... రష్యా ఎగుమతి చేసే ముడి చమురు ధరపై బ్యారెల్‌కు 60 డాలర్ల కనీస పరిమితి విధిస్తూ క్రితం వారం నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఒపెక్‌ ప్లస్‌ (రష్యా) దేశాలు మాత్రం రానున్న నెలల్లో ముడిచమురు ఉత్పత్తిని రోజుకు 20 లక్షల బ్యారెల్స్‌ తగ్గిస్తామని వెల్లడించాయి. ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులు మందకొండిగా ఉండటమే ఇందుకు కారణమంటున్నాయి. కాగా చమురు ఉత్పత్తిని పెంచమని అమెరికా అధ్యక్షుడు సౌదీ అరేబియాపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రపంచ చమురు ఎగుమతి చేసే దేశాల్లో 2వ స్థానంలో రష్యా ఉంది. చమురు ధరపై కనీస పరిమితి విధించి చమురు ఎగుమతి ద్వారా వచ్చే ఆదాయాలను నీరుగార్చి రష్యా ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి తీసుకెళ్లాలనేది ఈయూ దేశాల తపన. ఇది సఫలీకృతమైతే అమెరికా తన ఆధిపత్యం కొనసాగనీయ వచ్చనేది వ్యూహం. 

రష్యా ముడిచమురు ధరపై పరిమితి విధించడాన్ని క్రెమ్లిన్‌ తీవ్రస్థాయిలో ఖండించింది. రష్యాపై ఆంక్షలు విధించినప్పుడల్లా ప్రపంచ దేశాలపై ముఖ్యంగా ఐరోపా దేశాలపై అవి తీవ్ర ప్రతికూల ప్రభావాల్ని కలుగ జేస్తున్నాయని రష్యా గుర్తుచేసింది. రష్యాపై ఆంక్షల నేపథ్యంలో ముడిచమురు ధరలు 2022 ఫిబ్రవరి నుండి పెరుగుతూ వస్తున్నాయి. దీనితో ఈ సంవత్సరం రష్యా అదనంగా 41 శాతం లాభాలను పెంచుకొని ఆంక్షలు విధించిన దేశాలకు, అమెరికాకు షాక్‌ ఇచ్చింది. రష్యాతో స్నేహంగా లేని దేశాలకు మొత్తం ముడిచమురు ఎగుమతులను ఆపేసి, ప్రత్యామ్నాయ మార్కెట్లుగా వేరే దేశాలను (భారత్,  చైనాలు) ప్రోత్సహిస్తామని రష్యా అంటోంది. 

మన విదేశాంగమంత్రి జైశంకర్‌ కూడా రష్యాపై ఆంక్షలకూ భారత్‌కూ సంబంధంలేదని స్పష్టం చేశారు. ఈ వారంలో జర్మనీ విదేశాంగమంత్రి అన్నాలేనా బేర్‌బాక్‌ న్యూఢిల్లీలో జైశంకర్‌ను కలిసి ఈయూ విధించిన పరిమితి ధరకు మద్దతునివ్వాలని అభ్యర్థించగా జైశంకర్‌ తోసి పుచ్చారు. యూరప్‌ ఇంధన అవసరాలకు అనుగుణంగా భారత్‌ ప్రాధాన్యతలను ఎంపిక చేసుకోజాలదని అన్నారు. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ప్రారంభం కాక ముందునుందే భారత్, రష్యాల మధ్య ముడిచమురు వాణిజ్యం ఉందని జైశంకర్‌ అన్నారు. 

బ్యారెల్‌ ముడి చమురు ధర 60 డాలర్లకూ, అంత కన్నా తక్కువ బిల్లు చేస్తే... ప్రపంచ ఇన్సూరెన్స్‌ కంపె నీలు బీమా చేయడానికి ముందుకురావు. దీనితో రష్యా ముడిచమురు రవాణా స్తంభించి పోతుందని ఈయూ ఆలోచన. 

ముడి చమురుపై పరిమితి విధించిన రెండురోజుల్లో బ్యారెల్‌ చమురు ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 2 శాతం పెరిగింది. పరిశ్రమలకు అత్యంత అవసరమైన ఇంధన రవాణాను నిలిపివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు చిన్నా భిన్నమైపోతాయి. ఇదివరలో యూరప్‌ దేశాలకు రష్యా ముడి చమురు చాలా ఎగుమతి జరిగేది. తాత్కాలికంగా కొంతమేర దిగుమతులు ఆపినప్పటికీ రష్యా ఇంధనాన్ని ఈయూ దేశాలు వేరే మూడవ దేశం ద్వారా దిగుమతి చేసుకొంటున్నాయి. లిథువేనియా 83 శాతం,  ఫిన్లాండ్‌ 80 శాతం, స్లొవేకియా 74 శాతం, పోలాండ్‌ 58 శాతం, హంగేరి 43 శాతం, ఎస్తోనియా 34 శాతం, జర్మనీ 30 శాతం, గ్రీస్‌ 29 శాతం రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నాయి. మిగతా దేశాల దిగుమతి కూడా ఇంచు మించు 15 శాతం తగ్గకుండా ఉంది. ఇప్పుడు అకస్మాత్తుగా ధరల పరిమితి విధింపుతో రష్యాతోపాటుగా ఈయూ దేశాల ఆర్థిక వ్యవస్థలూ చాలా నష్టపోనున్నాయి. రానున్న వారాల్లో ముడి చమురు ధర అంతర్జాతీయంగా 100 డాలర్లు దాటుతుందని నిపుణుల అభిప్రాయం. 

ఇదివరకటి ‘విన్‌–విన్‌’ వాణిజ్య పరిస్థితులు ఇప్పుడు ‘లాస్‌–లాస్‌’ పరిస్థితులుగా పరిణమించాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ధరలు తగ్గినప్పుడల్లా లాభాలను కార్పొరేట్లు అనుభవిస్తున్నారు. ధరలు పెరుగు తునప్పుడు నష్టాల భారాన్ని ప్రజలపై మోపటంతో ఆర్థిక వృద్ధిరేటు తగ్గుతూ వస్తోంది. ఫలితంగా ప్రతి దేశంలోనూ ద్రవ్యోల్బణం పెరుగుదలతోపాటు నిరుద్యోగం, నిత్యా వసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఇందువల్ల జీవన ప్రమాణాలు తగ్గిపోతూ ఆర్థిక మాంద్యం వైపు దేశాలు కుంటుతున్నాయి. ఉక్రెయిన్‌–రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధంలో మరణించిన సైనికుల కంటే... ఈ చలికాలం యూరప్‌లో ప్రజలు ఇంధన కొరతతో ఎన్నో రెట్లు చలిబారిన పడి చనిపోతారని అంచనా వేస్తున్నారు. 

యుద్ధాన్ని నివారించక, శాంతి చర్చలు జరగనీయకుండా ఆయుధాలతో, ఆంక్షలతో యుద్ధం పరిసమాప్తమవుతుందని అనుకోవటం అవివేకం. ఇప్పటికే రష్యాపై ఆంక్షలతో యూరప్‌ ప్రజలు, పరోక్షంగా అభివృద్ధి చెందుతున్న దేశాలూ తీవ్రంగా నష్టపోతున్నాయి. అమెరికా మాత్రం లబ్ధిపొందుతోంది. 3 సంవత్సరాల క్రితం ఒపెక్‌ దేశాలు, రష్యా ఆర్థిక వ్యవస్థలను నష్ట పరచే విధంగా అమెరికా షేల్‌ చమురును ప్రవేశపెట్టడంతో బ్యారెల్‌ చమురు 28 డాలర్లకు పడిపోయిన సంగతి తెలిసిందే. 

 తాజాగా విధించిన ఈ కనీస 60 డాలర్ల పరిమితి వల్ల నష్టపోయేదీ ఈయూ దేశాలే. ప్రపంచ సాకర్‌ వేళ ఇది ఈయూ ‘సెల్ఫ్‌ గోల్‌’ కానుందా! (క్లిక్ చేయండి: డేటా రక్షణకు ఢోకా లేనట్లేనా?!)


- బుడ్డిగ జమిందార్‌ 
అసోసియేట్‌ ప్రొఫెసర్, కె. ఎల్‌. వర్సిటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement