మధురఫలం మహాప్రియం | huge demand for mangoes | Sakshi
Sakshi News home page

మధురఫలం మహాప్రియం

Published Sat, Apr 30 2016 9:45 AM | Last Updated on Tue, Oct 9 2018 4:55 PM

మధురఫలం మహాప్రియం - Sakshi

మధురఫలం మహాప్రియం

భారీగా తగ్గిన మామిడి పండ్ల దిగుమతి
ఎగుమతులకే సరిపోతున్న మేలు రకాలు
వెలవెలబోతున్న మార్కెట్లు
గతేడాదితో పోలిస్తే రెండింతలైన ధరలు

 

హైదరాబాద్:   మామిడి..! మండు వేసవిలో ఈ పేరు వింటేనే నోరూరుతుంది కదూ. నిజమే ..ఫలాలన్నింటిలో రాజఠీవిని ఒలకబోస్తూ, అనేక పోషకాలనిచ్చే ఈ రాజఫలం నగరంలో మహా ప్రియమైంది. ఇందుకు రకరకాల కారణాలున్నాయి. వెంటాడిన కరువుకు తోడు, ఆంధ్రప్రదేశ్ నుండి రావాల్సిన మామిడి రకాలు, అక్కడి అవసరాలకే వినియోగిస్తుండటంతో నగర మార్కెట్లకు వచ్చే మామిడి అనూహ్యంగా తగ్గిపోయింది. గత ఏడాది సరిగ్గా ఇదే రోజుకు నగరంలోని ప్రధాన మార్కెట్లన్నింటినీ మామిడి దిగుబడులు ముంచెత్తగా, ఈమారు భారీగా పడిపోయాయి. అక్కడక్కడ వస్తున్న మేలు రకాలను దిల్లీ, లక్నో వ్యాపారులే ఇక్కడి నుండి నేరుగా కొనుగోలు చేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో సాధారణ మార్కెట్‌లో మామిడి పండ్ల ధర గత ఏడాదితో పోలిస్తే రెండింతలైంది. హోల్‌సేల్ మార్కెట్‌లో క్వింటా గత ఏడాది రూ.5000 మోడల్ ధర కాగా, ఈ యేడాది రూ.7000కు చేరింది. రిటైల్ మార్కెట్‌లో రూ. 80 నుండి రూ.150 వరకు విక్రయిస్తున్నారు.

ఏడాదిలో ఎంత తేడా..

ఏటా మార్చి నుండి జూలై వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల మామిడి పండ్లు దొరికే గడ్డిఅన్నారం మార్కెట్‌లో ప్రస్తుతం రెండు మూడు రకాలకు మించిన మామిడి పండ్లు దొరకటం లేదు. ఒక వైపు భారీగా పడిపోయిన దిగుమతులకు తోడు, వినియోగదారులను నోరూరించే రకాలు సైతం ఈ మారు పెద్దగా రావటం లేదు. గడిచిన ఏడాది వరకు బెనీషాన్, ఆలంపూర్, బంగినపల్లి, ఆల్ఫోన్సో, హిమసాగర్, తొతపూరి తదితర రకాల అందుబాటులో ఉండగా, ఈ మారు బెనీషాన్ రకం ఒక్కటే ఎక్కువగా వస్తోంది. గత సంవత్సరం మార్చి, ఏప్రిల్ మాసాల్లో ఒక్క గడ్డి అన్నారం మార్కెట్‌కే 6,40,239 క్వింటాళ్ల మామిడి రాగా, ఈ యేడు మాత్రం కేవలం 47,406 క్వింటాళ్లు మాత్రమే రావటం దారుణమైన పరిస్థితికి నిదర్శనమని మార్కెట్ కమిటీ ఉద్యోగి జీవన్ చెప్పారు.

 అందుబాటులోకి రైఫనింగ్ చాంబర్స్

 పండ్లను మగ్గించటంలో కార్బైడ్, ఇథిలిన్ తదితర విష రసాయనాలు వాడొద్దన్న కఠిన నిబంధనల నేపథ్యంలో మార్కెట్లలో రైఫనింగ్ ఛాంబర్స్ అందుబాటులోకి వచ్చాయి. గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ  నిర్మించాల్సిన ఛాంబర్లు, ఇంకా పూర్తి కాకపోగా, 15 మంది ప్రైవేటు వ్యాపారులు అనుమతి తీసుకుని, ఆరు చోట్ల అందుబాటులోకి తెచ్చారు.

 ఎండ తీవ్రతతో..మగ్గటంలో ఇబ్బంది

 మార్కెట్‌కు వస్తోన్న మామిడిని మగ్గించేందుకు కొందరు వ్యాపారులు రైఫనింగ్ ఛాంబర్స్‌ను ఉపయోగించుకుంటుండగా, మిగిలిన వాళ్లు సాధారణ పద్ధతులు పాటిస్తున్నారు. ఎండ తీవ్రతతో సరిగ్గా పోషకాలు అందక, మామి డి పండులో 16 శాతం వరకు ఉండాల్సిన ఇథిలిన్, తొమ్మిది శాతం కంటే తక్కువగా ఉంటోంది. దీంతో మళ్లీ రైఫనింగ్ ఛాంబర్లలో మూడు రోజుల పాటు ఉంచి మగ్గిస్తున్నారు.

 కష్టమైనా తప్పటం లేదు..

 50 సంవత్సరాల నుంచి కార్బైడ్‌తోనే మామిడి  కాయలను అమ్మడం..కొనడం జరుగుతుంది. ఇప్పడు కార్బైడ్ లేకుండా మామిడి కొనుగోలు చేయ డం అంటే కష్టంగా ఉంది. వ్యాపారాలు చాల వరకు తగ్గాయి. దీనికి తోడు కరువుతో దిగుబడులు తగ్గాయి. ఇప్పటికే కిట కిటలాడ్సిన మార్కెట్ నేడు బోసిపోతోంది. - తాజొద్దీన్, పండ్ల వ్యాపారి

  రైతుకు గడ్డుకాలం

 ఈ సారి రైతుకు సరియైన పంట లేకపోవడంతో గిట్టుబాటులేదు. రైతులకు పంటను చూస్తే రక్తం చుక్కలేదు.  నేను 200 ఎకరాలు కౌలుకు తీసుకుని మామిడి సాగుచేశాను. సకాలంలో వర్షంలేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటాయి. నీరు లేకపోవడం, వాతావరణంలో వచ్చిన మార్పుల వలన కాయ సైజు 10 శాతం తగ్గింది. కార్బైడ్ వాడొద్దంటూ ప్రభుత్వం వ్యాపారులపై ఆంక్షలు విధించింది. ఇథిలిన్‌తో మామిడి పండ్లను మగ్గపెట్టాలంటే రైతులు ముందుకు రావడంలేదు. ఖర్చుతో కూడుకుంది. గత సంవత్సరం నేను 600 టన్నులు మామిడిని మార్కెట్‌లో అమ్మితే ఈ సంవత్సరం కేవలం 150 టన్నులు మాత్రమే అమ్మాను.  - రైతు తాజ్‌బాబు, కోదాడ

 సొంతంగా ..ఛాంబర్ ఏర్పాటు చేశా

 పండ్లను ఇథలిన్‌తో పండించడం ఖర్చుతో కూడుకుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీలేదు. మేమే పండ్ల మార్కెట్‌లో కోల్డ్‌స్టోరేజ్‌ను ఏర్పాటు చేసుకున్నాం. కార్బైడ్ లేకుండా పండ్లను పండిస్తున్నాం. ఇథిలిన్‌ను రోజుకు రెండు సార్లు వదులుతాం. మూడు నుంచి నాలుగు రోజుల్లో మామిడి పండ్లు పండుతాయి. వాటిని మార్కెట్‌లో అమ్ముతాం. ఇలా స్టోరేజ్ వలన విద్యుత్ బిల్లులు నెలకు రూ40 వేల నుంచి 50 వేల వరకు వస్తుంది. నిర్వహణ కష్టసాధ్యంగా ఉంది.  - అజంఖాన్, ఫేమస్ ప్రూట్‌కంపెనీ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement