సాక్షి, హైదరాబాద్: ఈ కోడి చాలా కడక్.. పోషక విలువల్లోనే కాదు ఖరీదులో సైతం.. దీని కడక్‌నాథ్ కోడి. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఈ కోడికి మాంచి డిమాండ్ వచ్చింది. రోగ నియంత్రణకు మాంసాహారం తీసుకోవాలనే వైద్య నిపుణులు సూచిస్తున్న క్రమంలో.. ఈ కోడిలో పోషకాలు మెండుగా ఉండడంతో మాంసంప్రియుల చూపు దీనిపై పడింది. అసలు ఆ కోడి ఎక్కడ నుంచి వచ్చింది? దీని ప్రత్యేకత ఏమిటి? తెలుసుకోవాలంటే ఓ లుక్కేయండి.
అన్నీ నలుపే..
సాధారణంగా కడక్‌నాథ్ జాతి కోళ్లు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్‌లలోని గిరిజన ప్రాంతాల్లో దొరుకుతాయి. నలుపు రంగులో ఉండే ఈ కోడి.. గుడ్లు కాఫీ రంగుతో పాటు కొంత పింక్ కలర్‌లో ఉంటాయి. ఈ కోళ్లను మాంసం కోసం పెంచుతారు. దీని చర్మమే కాదు, ముక్కు, గోళ్లు, ఎముకలు చివరికి నాలుక కూడా నలుపే. దీని శరీరంలో మెలనిన్ ఎక్కువగా ఉండటంతో ఈ రంగులో ఉంటుందని పౌల్ట్రీ రంగ నిపుణులు చెబుతున్నారు.
ఔషధ గుణాలు భేష్
కడక్‌నాథ్ కోళ్లలో ప్రొటీన్లు సమృద్ధిగా లభిస్తాయి, కొవ్వు, కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉంటాయి. దీని మాంసం తింటే ఊబకాయం రాదు. ఈ కోడి మాంసంలో ఔషధ గుణాలు కూడా ఎక్కువే. పోషకాలు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెంచడమే కాకుండా, శ్వాస సంబంధమైన ఆస్తమా వంటి రోగాలను నియంత్రణలో ఉంచుతుందట. పురిటినొప్పులు తగ్గించడంతో పాటు.. మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలోనూ ఈ మాంసం తోడ్పడుతుందనే ప్రచారమూ ఉంది.
తేడా ఇలా..
కడక్‌నాథ్ మంచి బరువు తూగేందుకు 8 నెలల సమయం పడుతుంది. సాధారణంగా మార్కెట్‌లో దొరికే బ్రాయిలర్ కోళ్లు 45 రోజుల్లోనే ఒకింత బరువు తూగుతాయి. ఇక్కడే సాధారణ కోడికి, కడక్‌నాథ్ కోడికి తేడా ఉంది. కడక్‌నాథ్ కోళ్లలో క్వాలిటీ ఉంటుంది. వీటి పెంపకం నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువే. అందుకే దీని ధర అధికంగా ఉంటుందని పెంపకందారులు చెబుతున్నారు.
ఊపందుకుంది..
కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పట్నుంచీ ప్రజల్లో ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై మరింత శ్రద్ధ పెరిగింది. కోవిడ్ బారిన పడకుండా ఉండటం కోసం.. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టి పెట్టారు జనాలు. ఇందులో భాగంగా డ్రై ఫ్రూట్స్, పండ్లు, ఆకుకూరలు, కోడిగుడ్లు, మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ గిరిజన ప్రాంతం ఝూబువా, అలీరాజ్‌పూర్‌కే పరిమితమైన దేశీ నల్ల కోడి కడక్‌నాథ్‌కు ఫుల్ డిమాండ్ పెరిగింది. దీంతో నగర శివారు ప్రాంతాల్లో కడక్‌నాథ్ కోళ్ల పెంపకం ఊపందుకుంది. కడక్‌నాథ్ చికెన్ ధర దాదాపు వెయ్యి రూపాయలపైనే పలుకుతోంది. బతికున్న కోడి కిలో రూ.800 నుంచి రూ.1000 వరకు అమ్ముడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment