సాక్షి, ముంబై : తన తోటలోని మామిడి పళ్లు తింటే కొడుకులు పుడతారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన హిందుత్వ నేత శంబాజీ బిదేకు నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ‘మీ తోటలోని పళ్లు తిని మగ పిల్లల్ని సంతానంగా పొందిన జంట వివరాలు పేర్లతో సహా వెల్లడించాల్సి ఉంటుంది. మీరు చేసిన వ్యాఖ్యలను నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందంటూ’ నోటీసులో పేర్కొంది.
కాగా రాయ్‌గఢ్‌లో మరాఠాల యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ బంగారు సింహాసనాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నాసిక్‌లో ర్యాలీ నిర్వహించిన శంబాజీ.. ‘మామిడి పళ్లలో మంచి పోషకాలుంటాయని, తమ తోట మామిడి పళ్లు తిన్న జంటలకు మగ పిల్లలే పుట్టారని’ వ్యాఖ్యానించారు. ‘ఇప్పటి వరకు ఈ విషయాన్ని నా తల్లికి మినహా ఎవరికి చెప్పలేదు. నాతోటలోని మామిడి పండ్లు తిన్న 150 జంటలకు 180 మంది మగపిల్లలు జన్మించారు. ఎవరికైనా మగపిల్లలు కావాలనిపిస్తే ఈ మామిడి పండ్లు తినండి. సంతానలేమి సమస్యతో బాధపడే దంపతులకు కూడా ఈ మామిడి పండు ఉపయోగపడుతోంది.’ అని శాంబాజీ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన న్యాయవాది, సామాజిక వేత్త అబా సింగ్... మూఢనమ్మకాలను ప్రచారం చేస్తోన్న శంబాజీపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment