రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌కు చెందిన ఆశా స్వచ్ఛంద సేవాసంస్థ డైరెక్టర్ గౌరీ మిశ్రా(54) శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆయనను అతి సమీపం నుంచి తుపాకీతో కాల్పులు జరపడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మిశ్రాను గుణుçపూర్ సబ్ డివిజన్ ఆస్పత్రికి తరలించారు. తనిఖీ చేసిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి గుణుపూర్ ఆదర్శ పోలీస్ స్టేసన్ ఐఐసీ నీలాంబర్ జాని వివరాలను ఆదివారం వెల్లడించారు.
రోజూ రాత్రి భోజనం అనంతరం గౌరీ మిశ్రా, కొంతమంది మిత్రులు కలిసి సమీపంలోని వంశధార నది వంతెన వద్దకు బైక్‌పై వెళ్లి, కొద్దిసేపు గడిపి తిరిగి వస్తుంటారు. ఎప్పటిలాగే శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో అంతా వంతెనకు చేరుకోగా.. మరికొంత సమయం ఉండి వస్తానని మిశ్రా చెప్పడంతో మిగతా వారంతా ఇళ్లకు తిరిగి వెళ్లారు. కొద్ది సేపటికి కొంతమంది దుండగులు బైకుపై వచ్చి, తుపాకీతో అతి సమీపం నుంచి అతనిపై 3 రౌండ్లు కాల్పులు జరిపారు.
దర్యాప్తు ముమ్మరం..
గౌరీ మిశ్రా గత కొన్నాళ్లుగా ఆశా అనే స్వచ్ఛంద సేవాసంస్థకు డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. అంతకుముందు పాత్రికేయుడిగా పనిచేసిన ఆయన.. డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తుండటంతో పాత్రికేయ వృత్తి వీడారు. ఆశా తరఫున పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ స్థానికంగతా ఆదరాభిమానాలు సంపాదించుకున్నారు. ఈ క్రమంలో ఈ దారుణ హత్యకు గురికావడం స్థానికంగా పలు అనుమానాలకు తావిస్తోంది.
మరోవైపు శనివారం రాత్రి చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గుణుపూర్ పరిసర ప్రాంతాలను అప్రమత్తం చేశారు. హత్యకు సంబంధించి ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఘటనలో మావోయిస్టుల ప్రమేయం ఉందా? గిట్టని వారు ఎవరైనా ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారా అని అనుమానిస్తున్నారు. పూర్తి ఆధారాలు సేకరించిన అనంతరం హత్యకు గల కారణాలను వెల్లడిస్తామని పోలీసులు స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment