సీఎం, మాజీల మధ్య ‘మ్యాంగోఫైట్’ | mango fight between chief minister and ex | Sakshi
Sakshi News home page

సీఎం, మాజీల మధ్య ‘మ్యాంగోఫైట్’

Published Fri, Jun 5 2015 2:43 PM | Last Updated on Tue, Oct 9 2018 4:55 PM

సీఎం, మాజీల మధ్య ‘మ్యాంగోఫైట్’ - Sakshi

సీఎం, మాజీల మధ్య ‘మ్యాంగోఫైట్’

బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ మధ్య గిల్లికజ్జాలు మొదలయ్యాయి. ఆనీ వన్ మార్గ్‌లో ఉన్న బీహార్ ముఖ్యమంత్రి అధికార నివాసంలోనే ఉంటున్న వీరిద్దరికీ ఒకరి పొడ ఒకరికి గిట్టడం లేదు. నితీష్ కుమార్ పుణ్యమా అని ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చి, మళ్లీ ఆయన కారణంగానే గత ఫిబ్రవరిలో అర్ధంతరంగా పదవిని కోల్పోయిన మాంఝీ.. ఖాళీ చేయమన్నా అధికార నివాసాన్ని మాత్రం వదిలి పెట్టడం లేదు. ఈ నేపథ్యంలోనే వీరి మధ్య ‘మ్యాంగో ఫైట్’ మొదలైంది. సీఎం బంగ్లా ప్రాంగణంలో మామిడి చెట్లకు విరగకాసిన కాయలను తాను, తమవారు తెంపుకోనీయకుండా నితీష్ కుమార్ 24 మంది పోలీసులను కాపలా పెట్టారంటూ మాంఝీ విచిత్ర ఆరోపణలు చేశారు.

బీసీ వర్గానికి చెందిన తన వద్దకు బీసీ ప్రజలు, నాయకులు వస్తుంటారని, వారు అప్పుడప్పుడు మామిడికాయలు, తోటలోని ఇతర పండ్లను తెంపుకుంటారని, అది చూసి ఓర్వలేకనే నితీష్ కుమార్ పోలీసుల కాపలా పెట్టారని ఆరోపించారు. నగరంలో చోరీలను అరికట్టేందుకు అవసరమైన పోలీసు సిబ్బంది లేక సతమతమవుతుంటే మామిడి చెట్లకు పోలీసుల కాపలా పెట్టడం ఎంతమేరకు సమంజసమని మాంఝీ ప్రశ్నించారు.

ఈ ఆరోపణలను నితీష్ కుమార్ దృష్టికి మీడియా ప్రతినిధులు తీసుకెళ్లగా, ఆయన పగలబడి నవ్వుతూ...‘నిజంగా ఈ విషయం నాకు తెలియదు. మామిడి చెట్ల వద్ద పోలీసు కాపలానా... సీఎం భద్రత కోసం ఏర్పాటుచేశారా, మామిడి పండ్ల కోసం పెట్టారా? అన్న విషయాన్ని ఉన్నతాధికారులను అడిగి చెబుతాను’ అని చెప్పారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మళ్లీ మాట్లాడుతూ ‘బంగళాలో మామిడి చెట్లకు పోలీసు భద్రత గురించి పోలీసు ఇంచార్జి అధికారికి కూడా తెలియదట. మాంఝీకి నిజంగా మామిడి కాయలు, పండ్లు కావాలని కబురంపితే నేనే స్వయంగా వాటిని తెంపించి పంపించేవాణ్ణి కదా! చెట్ల నుంచి కాయలు, పండ్లు తెంపినందుకు ఏమైనా డబ్బు చెల్లించాల్సి ఉంటే కూడా నా జీతం డబ్బులతోనే చెల్లిస్తా కదా !’ అని వ్యాఖ్యానించారు.

అనీ మార్గ్ బంగళాలో 2006 నుంచి నితీష్ కుమార్ ఉంటున్నారు. అంతకుముందు 15 ఏళ్లపాటు లాలూ ప్రసాద్ తన కుటుంబ సభ్యులతో అందులో ఉన్నారు. బంగళాలోని ఐదెకరాల స్థలంలో వంద ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల పెంపకానికి నితీష్ కుమార్ ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ఇప్పుడా తోటలో వాటితోపాటు 35 మామిడి చెట్లు, పదుల సంఖ్యలో పనస, అల్ల నేరేడు, జామ చెట్లు ఉన్నాయి. పెద్ద రావి చెట్టు కూడా ఉంది. ఇంటి ఆవరణలో రావిచెట్టు ఉండడం మంచిది కాదని భావించిన నితీష్ కుమార్, 2013, జనవరి 4వ తేదీన దలైలామాను పిలిపించి ఆయన చేత రావి చెట్టుకు ‘పవిత్ర’తను ఆపాదింపచేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1948 నుంచి 1952 వరకు బీహార్ గవర్నర్‌గా పనిచేసిన  మాధవ్ శ్రీహరి ఆనీ పేరిట సీఎం బంగళాను అనీ మార్గ్ వన్ అని పిలుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement