
మంఝికి పదవీ గండం?
పట్నా: వివాదాస్పద వ్యాఖ్యలతో జేడీయూను ఇబ్బందుల్లో పడేస్తున్న ఆ పార్టీ నేత, బిహార్ ముఖ్యమంత్రి జితన్‌రాం మంఝిని పదవి నుంచి తొలగించే అవకాశాలున్నట్లు గురువారం మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తాయి. మంఝి నలుగురు పార్టీ రెబెల్స్‌కు వత్తాసు పలకడం, పార్టీ నేత నితీశ్ కుమార్‌కు సన్నిహితులైన పలువురు అధికారులను బదిలీ చేయడం, నక్సల్స్‌ల లెవీ వసూళ్లను సమర్థించడం, ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు రానుండడం నేపథ్యంలో ఆయనకు పదవీ గండం తప్పకపోవచ్చని కథనాలు వచ్చాయి.
మంఝిని సీఎం పదవిలో కూర్చోబెట్టిన నితీశ్ గురువారం ఢిల్లీకి వెళ్లడంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. మంఝి భవితవ్యాన్ని తేల్చడానికి పార్టీ చీఫ్ శరద్ యాదవ్, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ నేతలతో చర్చించేందుకు ఆయన హస్తిన బాట పట్టారని వార్తలొచ్చాయి. అయితే వీటిని నితీశ్ తోసిపుచ్చారు. మంఝి సీఎం పదవిలో కొనసాగుతారో, లే దో నిర్ణయించడానికి తానెవరినని పట్నాలో విలేకర్లతో అన్నారు.
బిహార్ అంశాన్ని ఢిల్లీలో చర్చించాల్సిన అవసరం లేదన్నారు. ఢిల్లీలో శరద్‌ను కలిసిన అనంతరమూ ఇదే విధంగా స్పందించారు. మంఝిని పదవి నుంచి తప్పించే అవకాశం లేదని, శరద్‌తో జరిపిన చర్చల్లో ఈ అంశం రాలేదని అన్నారు. ఎన్డీఏ సర్కారుపై పోరాడ్డానికి జనతా పరివార్ పార్టీలను విలీనం చేయడంపై శరద్‌తో చర్చించానని తెలిపారు. మంఝిని తొలగిస్తారన్న వార్తలు మీడియా సృష్టేనని శరద్ కూడా అన్నారు. కాగా, తాను తెలివైన వాడిని కానని, సుదీర్ఘ అనుభవం ఆధారంగా మాట్లాడుతున్నాని, దురదృష్ట వశాత్తూ అవి పతాకశీర్షికలకు ఎక్కుతున్నాయని మంఝి పేర్కొన్నారు. మరోపక్క.. మంఝిని సీఎం పదవి నుంచి తప్పుకునేలా చేసి ఆ పదవి చేపట్టేందుకు నితీశ్ ఒత్తిడి తెస్తున్నారని బీజేపీ నేత సుశీల్ కుమార్ షిండే ఆరోపించారు. నితీశ్ వర్గం నేతల నుంచి అవమానాలు పడేబదులు మంఝీ రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ సూచించారు.