
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు శుభవార్త అందించింది. ఆయన నేతృత్వంలోని జనతా దళ్ (యూనైటెడ్) పార్టీని నిజమైన వర్గంగా గుర్తిస్తూ గురువారం నిర్ణయం ప్రకటించింది.
ఈ మేరకు పార్టీ బాణం గుర్తును కూడా నితీశ్ వర్గానికే కేటాయిస్తున్నట్లు తెలిపింది. ‘‘మెజార్టీ సభ్యుల మద్ధతు నితీశ్‌కే ఉంది. నేషనల్ పార్టీ కౌన్సిల్ కూడా ఆయన వెంటే ఉంది. అలాంటప్పుడు జేడీయూ పార్టీపై శరద్ యాదవ్‌కు ఎలాంటి హక్కు ఉండవు’’ అని ఈసీ ఈ సందర్భంగా అభిప్రాయపడింది. దీంతో శరద్ యాదవ్ వర్గం ఢీలా పడిపోయింది.
కాగా, మహాకూటమి నుంచి ఈ యేడాది జూలై 26న నితీశ్ వైదొలిగిన తర్వాత.. ఆ నిర్ణయంపై శరద్ యాదవ్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకోగా.. శరద్ యాదవ్‌ను రాజ్యసభ ప్రాతినిథ్యం నుంచి తప్పిస్తూ నితీశ్ మరో కవ్వింపు చర్య చేపట్టారు. దీంతో అసలైన పార్టీ తమదేనంటూ శరద్ తరపున ఆ వర్గ నేత చోటుభాయ్ అమరసంగ వాసవ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు.