పాట్నా: సుదీర్ఘ కాలం సాగిన రాజకీయ బంధం ఎట్టకేలకు తెగిపోతోందన్న కథనాలు.. దేశ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో కొనసాగడం ఇక ఎంతమాత్రం మంచిది కాదనే అభిప్రాయంలోకి జనతాదళ్(యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ వచ్చినట్లు భోగట్టా. ఈ మేరకు జేడీయూ వర్గాలు, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు బాగా దగ్గరి వ్యక్తులే మీడియాకు ‘బ్రేకప్’ సమాచారం అందిస్తున్నారు.
బీహార్‌లో జేడీయూ మరో మహారాష్ట్ర శివసేనలా మారబోతోందనే ఉద్దేశం నితీశ్ కుమార్‌లో బలంగా నాటుకుపోయింది. అందుకే ప్రభుత్వానికి ఢోకా లేకుండా.. తిరిగి ప్రాంతీయ పార్టీలతో జత కట్టాలనే ఆలోచనకు ఆయన వచ్చారు. ఈ మేరకు ఆర్జేడీ, కాంగ్రెస్ కీలక నేతలకు పాట్నాకు రావాలనే పిలుపు ఈపాటికే అందింది. బీజేపీతో గనుక దూరం జరగకపోతే.. మహారాష్ట్రలో ఉద్దేవ్ థాక్రేకు ఎదురైన అనుభవమే తనకూ ఎదురవుతుందని.. అందుకు ‘వెన్నుపోటు’ అస్త్రాన్ని బీజేపీ ప్రయోగించబోతోందని నితీశ్ కుమార్ భావిస్తున్నారు. అవును.. ఇది నితీశ్ మానసిక అపవ్యవస్థ ఎంతమాత్రం కాదని జేడీయూ వర్గాలు అంటున్నాయి.
‘ప్రాంతీయ పార్టీల మనుముందు మనుగడ కష్టతరం’.. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన కామెంట్లు ఇవి. స్థానిక పార్టీలను బీజేపీతోనే భర్తీ చేయించాలన్న ఉద్దేశంతోనే నడ్డా ఆ కామెంట్లు చేశారని భావిస్తోంది జేడీయూ. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను, సంక్షోభ దిశ అడుగులను జేడీయూ ఆసక్తిగా గమనిస్తోంది. శివ సేనలాగే.. జేడీయూ కూడా ప్రాంతీయ పార్టీనే. పైగా సుదీర్ఘ బంధం ఉంది బీజేపీతో. ఈ కారణంతోనే పొత్తు విషయంలో నితీశ్ ఆలోచనలో పడినట్లు స్పష్టమవుతోంది.
మహారాష్ట్రకు కొనసాగింపుగా బీహార్ రాజకీయ సంక్షోభం రాబోతుందని జేడీయూలో చర్చ నడుస్తోంది. సుదీర్ఘంగా సాగిన బంధాన్ని సైతం తెంచుకుని.. మహాలో ఉద్దవ్‌థాక్రేను గద్దె దించింది బీజేపీ. అయితే.. అక్కడి పరిస్థితులు, ప్రత్యర్థి కూటమి వేరని భావించినప్పటికీ.. హు ఈజ్ నెక్స్ట్ క్రమంలో తన పేరు తర్వాత ఉందనే స్థితికి నితీశ్ వచ్చేశారు.
‘వచ్చే ఎన్నికల్లోనూ బీహార్ ఎన్డీయే కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ కుమార్.. 2024 లోకసభ ఎన్నికలతో పాటు 2025 బీహార్ ఎన్నికల్లోనూ జేడీయూతో పొత్తు ఉంటుంది’.. స్వయానా బీజేపీ కీలకనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన ప్రకటనను నితీశ్ నమ్మట్లేదన్నది ఆయన అంతరంగికులు చెప్తున్నమాట. అంతేకాదు ఏక్‌నాథ్ షిండే ద్వారా శివసేనలో బీజేపీ ముసలం రేపిందని, ఆ అసంతృప్తత ద్వారానే ఉద్దవ్‌ను గద్దె దింపిందని నితీశ్ పదే పదే పార్టీ భేటీల్లో చర్చిస్తున్నారట. ఈ క్రమంలోనే.. శివ సేన లాగా బంధం ఉన్న జేడీయూకు రేపో మాపో అలాంటి గతి పట్టొచ్చనే భావిస్తున్నారు ఆయన.
అమిత్ షా, బీజేపీ హామీలను, ప్రకటనలను.. ఎట్టిపరిస్థితుల్లో నమ్మే స్థితిలో ఇప్పుడు జేడీయూ, ఆ పార్టీ అధినేత నితీశ్ లేరు. ఎందుకంటే.. వెన్నుపోటు రాజకీయం ద్వారా తనను గద్దె దించే అవకాశం ఉందన్న స్థితికి ఆయన ఎప్పుడో చేరిపోయారు. అందుకు కారణాలు లేకపోలేదు.. బీహార్ కేబినెట్‌లోని జేడీయూ మంత్రుల్లో చాలామంది అమిత్ షాకు అనుకూలంగా ఉన్నారు. అంతెందుకు.. జేడీయూలో పరోక్షంగా అమిత్ షా డామినేషన్ కొనసాగుతోంది కూడా. జేడీయూ రిమోట్ కంట్రోల్ పూర్తిగా షా చేతికి వెళ్లకముందే జాగ్రత్త పడాలని నితీశ్ అనుకుంటున్నారట. అందుకే జేడీయూ నేత ఆర్సీపీ సింగ్ రాజ్యసభ పదవీకాలాన్ని కావాలనే.. పొడగించకుండా నితీశ్ అడ్డుకున్నారన్న వాదన ఇప్పుడు తెర మీదకు వచ్చింది.
ఏడు జన్మలెత్తినా నితీశ్ ప్రధాని కాలేడంటూ ఆర్సీపీ సింగ్ వ్యాఖ్యానించడం, ఆ వెంటనే జేడీయూకి గుడ్‌బై చెప్పడంతో.. నితీశ్‌కు వ్యతిరేకంగా వెన్నుపోటు వాదన నిజమేమోనని జేడీయూలో చర్చ నడుస్తోంది. ఆర్సీపీ సింగ్‌ను పెద్దల సభకు ఎంపిక చేసిందే నితీశ్. అలాంటిది ఆయనే స్వయంగా ఆర్సీపీ సింగ్‌ను నిలువరించడం గమనార్హం. నితీశ్ కుమార్ ప్రధాన అనుచరుడు, జేడీయూ ప్రెసిడెంట్ రాజీవ్ రంజన్‌సింగ్(లలన్ సింగ్) ఏం చెప్తున్నారంటే.. బీజేపీలో చేరాలని ఆర్సీపీ సింగ్ ఎప్పటి నుంచో భావిస్తున్నారు. పొత్తులో భాగంగా మేం బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని ఓ కేంద్ర మంత్రి పదవికావాలని కోరాం. ఆ సమయంలో సింగ్ జోక్యం చేసుకుని.. తనకు మాత్రమే మంత్రి పదవి ఇస్తామని అమిత్ షా తన వద్ద ప్రస్తావించారని చెప్పారు. ‘అలాంటిప్పుడు నాకెందుకు చెప్పడం.. వాళ్లతో కలిసి మీకు మీరే డిసైడ్ చేస్కోండి’ అంటూ నితీశ్, ఆర్సీపీ సింగ్ మీద ఫైర్ అయినట్లు లాలన్ సింగ్ తాజాగా మీడియాకు వెల్లడించారు.
ఇదీ చదవండి: ఎన్డీఏకు నితీశ్ రాంరాం.. కూలిపోనున్న బిహార్ సర్కార్.. షాక్‌లో బీజేపీ!
Comments
Please login to add a commentAdd a comment