Shiv Sena -bjp
-
షిండే వర్గంలో అసంతృప్తి.. 22 మంది ఎమ్మెల్యేలతో సహా..!
ముంబై: శివసేనను రెండుగా చీల్చి, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన ఏక్నాథ్ షిండేకు ఇప్పుడు సొంత పార్టీ నేతల నుంచి తలనొప్పులు మొదలయ్యాయి. బీజేపీతో పొసగని తన ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో షిండే వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలతో సహా 9 మంది ఎంపీలు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ (యూబీటీ)కి చెందిన సామ్నా పత్రిక వెల్లడించింది. ఆ పార్టీలోని ఎమ్మెల్యేలకు బీజేపీతో పొసగడంలేదని పేర్కొంది. షిండే వర్గంలోని కొంతమంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని యూబీటీ ఎంపీ వినాయక్ రౌత్ తెలిపారు. ఆ పార్టీ నుంచి బయటకు వస్తామని వారు తెలిపినట్లు చెప్పారు. ఎన్డీయే భాగస్వామ్యంలో ఎలాంటి అభివృద్ధి జరగట్లేదని చెప్పినట్లు వెల్లడించారు. బీజేపీ-షిండేకు చెందిన శివసేన భాగస్వామ్యంలోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే గజానన్ కీర్తికార్ బహిరంగంగానే బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సామ్నా తెలిపింది. బీజేపీ నుంచి అంతర్గతంగా వారు వివక్షను ఎదుర్కొంటునట్లు చెప్పారు. 'మేము 13 మంది ఎమ్మెల్యేలం ఉన్నాం. ఎన్డీయే భాగస్వామ్యంలో మా సమస్యలు పరిష్కారమయ్యేలా లేవు'అని గజానన్ కీర్తికార్ ఇదివరకే అన్నారు. అయితే ఈ పరిస్థితిని షిండే వర్గం తోసిపుచ్చుతోంది. #WATCH | "Can Vinayak Raut see the future? Does he know face-reading? He says anything. There is no fact to what he says. We are all satisfied. Under the leadership of CM Eknath Shinde, we are working well. Vinayak Raut keeps saying things like this, we don't pay attention to… pic.twitter.com/vMTbpc1kxI — ANI (@ANI) May 30, 2023 'వ్యక్తిగత గౌరవాన్ని డబ్బులతో కొనలేం. ఇది మరోసారి రుజువైంది. ఈ సారి 22 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తాం' అని షిండే నేతృత్వంలోని శివసేన నేతలు ఇప్పటికే చెప్పారు. ఎన్డీయే భాగస్వామ్యంలోని షిండే వర్గానికి 22 సీట్లు ఇచ్చే అవకాశాలు దాదాపుగా లేవని సామ్నా తెలిపింది. చదవండి:కిడ్నీ సమస్యతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత.. తండ్రి చనిపోయిన మూడు రోజులకే! -
ఆయన బీజేపీతో కలిస్తే.. మేం నిష్క్రమిస్తాం
ముంబై: పవా(వ)ర్ హీట్‌తో.. మహారాష్ట్ర రాజకీయం మళ్లీ వేడెక్కింది. వచ్చే పది, పదిహేను రోజుల్లో రాజకీయ కుదుపులకు హస్తినతో పాటు మహారాష్ట్ర సైతం వేదిక అవుతుందంటూ ప్రచారం మొదలైన నేపథ్యంలో.. ఏం జరగనుందా? అనే చర్చ జోరుగా అక్కడ నడుస్తోంది. ఈ తరుణంలో.. ఎన్సీపీ నేత అజిత్ పవార్ హాట్ టాపిక్‌గా మారారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్.. మద్దతు ఎమ్మెల్యేలతో బీజేపీతో దోస్తీకి సిద్ధపడుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే.. అదంతా ఉత్త ప్రచారమేనని, తాను ఎన్సీపీతోనే ఉంటానని తాజాగా స్పష్టమైన ప్రకటన చేశారు ఆయన. అయినప్పటికీ అజిత్ పవార్ తీరుపై అనుమానాలు కొనసాగుతున్నాయి. బీజేపీతో దోస్తీ ప్రచారం అట్లాగే చర్చల్లో ఉండిపోయింది. ఈ తరుణంలో.. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకి చెందిన శివసేన వర్గం స్పందించింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ గనుక బీజేపీతో చెయ్యి కలిపితే.. తాము ప్రభుత్వ కూటమి నుంచి బయటకు వెళ్లిపోతామని షిండే వర్గం హెచ్చరించింది. ఈ మేరకు షిండే తాజాగా నియమించిన పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ శిర్సత్ మీడియాతో మాట్లాడారు. మా సిద్ధాంతం స్పష్టంగా ఉంది. ఎన్సీపీ అనేది వెన్నుపోటు పార్టీ. అలాంటి పార్టీతో అంటకాగే దుస్థితిలో మేం లేం. యావత్ మహారాష్ట్ర ఈ పరిణామాన్ని ఇష్టపడదు కూడా. కాంగ్రెస్-ఎన్సీపీలతో కూటమిలో కొనసాగకూడదనే కదా బయటకు వచ్చేం. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీతో ఎలా జట్టు కడతాం? అని శిర్సత్ మీడియా ద్వారా తెలియజేశారు. బీజేపీతో ఎన్సీపీ నేరుగా జత కట్టే అవకాశం లేదని.. ఒకవేళ అలాంటిదే జరిగితే మాత్రం తాము ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేస్తామని శిర్సత్ సంకేతాలు పంపారు. అజిత్ పవార్ ఎప్పటి నుంచో పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన తనయుడు పార్థా పవార్ ఓటమిని ఆయన తట్టుకోలేకపోయాడు. పైగా ఇప్పుడు ఎన్సీపీలో ఆయనకు ఫ్రీ హ్యాండ్ లేదు. ఈ పరిణామాలతోనే ఆయన ఆ పార్టీని వీడాలనుకుంటున్నారు. అజిత్ పవార్ ఎన్సీపీని వీడాలనే నిర్ణయాన్ని మేం స్వాగతిస్తాం. కానీ, ఎన్సీపీ నేతలతో గుంపుగా బీజేపీకి స్నేహ హస్తం చాచితే మాత్రం.. మేం ప్రభుత్వంలో కొనసాగబోం అని శిర్సత్ స్పష్టం చేశారు. 2019లో జరిగిన పరిణామాన్ని ఎవరూ మరిచిపోరు. ఫడ్నవిస్-అజిత్ పవార్ సాయంతో ఆఘమేఘాల మీద తెల్లవారుజామున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మూడే రోజుల్లో ఆ ప్రభుత్వం కుప్పకూలింది. దీనిపై శరద్ పవార్.. రాష్ట్రపతి పాలనను వెనక్కి తీసుకునేందుకు చేసిన ప్రయోగమంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ, అజిత్ పవార్ మాత్రం రెండున్నరేళ్లు గడిచినా నాటి పరిణామాలపై మౌనంగా ఉన్నారు అంటూ శిర్సత్ నాటి విషయాలను గుర్తు చేశారు. ఇదీ చదవండి: బాంబే హైకోర్టులో షిండే సర్కార్‌కు ఊరట -
బీజేపీ నేతపై మిత్రపక్ష వర్గీయుల దాడి
ముంబై: బీజేపీ మద్దతుతో శివసేన చీలిక వర్గం ఏక్నాథ్ షిండే నేతృత్వంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సంగతి విదితమే. అయితే.. ప్రత్యర్థి పక్షంగా ఉన్న రోజుల నుంచి ఈ రెండు వర్గాల నడుమ కొనసాగుతున్న వైరం.. మంత్రి వర్గ విస్తరణ సమయంలో ఉవ్వెత్తున పైకి లేచి.. ఇప్పుడు తారాస్థాయిలో కొనసాగుతోంది. అదీ నియోజకవర్గాల వారీగా కావడం గమనార్హం. తాజాగా షిండే వర్గం మిత్రపక్ష నేతపైనే దాడికి పాల్పడింది. మిత్ర పక్షాల నడుమ పోరు మంచిది కాదని, ఐక్యతతో ముందుకు సాగాలని ఇటు సీఎం షిండే, అటు డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ ఇస్తున్న పిలుపు ఆయా పార్టీల నేతలకు, కార్యకర్తలకు చెవికెక్కడం లేదు. థానేలో బీజేపీ ఆఫీస్ బేరర్‌గా వ్యవహరిస్తున్న ప్రశాంత్ జాదవ్‌కు, షిండే వర్గీయులకు గొడవ జరిగింది. గురువారం వాగ్లే ఎస్టేట్‌లోని పరబ్‌వాడీ దగ్గర బ్యానర్లు, ఫ్లకార్డులు ఏర్పాటు విషయంలో వివాదం మొదలైంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. ఇరు వర్గాలను హెచ్చరించి పంపించారు. అయితే శుక్రవారం సాయంత్రం ప్రశాంత్ జాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని షిండే వర్గీయులకు దాడికి దిగారు. పదిహేను నుంచి ఇరవై మంది దాకా ఆయన్ని చితకబాదారు. ఈ దాడిలో తల పగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం!. ఆపై ఈ గొడవపై ఆ పంచాయితీ పోలీస్ స్టేషన్‌కి చేరింది. ఇరు పక్షాలు ఎవరికి వాళ్లు అవతలి వాళ్ల మీదే నిందలు వేయడం ప్రారంభించారు. हल्लेखोरांवर तात्काळ कारवाई करा @ThaneCityPolice असले नीच कृत्य करणाऱ्यांचा तिव्र निषेध@CMOMaharashtra @Dev_Fadnavis https://t.co/JfciHraaem — Chitra Kishor Wagh (@ChitraKWagh) December 30, 2022 మరోవైపు పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోలేదని స్టేషన్ బయట బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. దీంతో మరోసారి గొడవ జరుగుతుందేమోనన్న పరిస్థితులు కొనసాగుతున్నాయి అక్కడ. ఇక ఈ ఘర్షణలపై బీజేపీ మహిళా మోర్చా పరోక్షంగా ఓ ట్వీట్ చేసింది. దోస్తీకి దోస్తీ.. దెబ్బకు దెబ్బ.. రక్తానికి రక్తం అంటూ ట్వీట్లో పేర్కొంది. పరిస్థితి చల్లార్చేందుకు ఇరు పార్టీలు కీలక నేతలను థానేకు పంపనున్నట్లు సమాచారం. -
మరో ఉద్దవ్ థాక్రే కావడం ఇష్టం లేకనే!
పాట్నా: సుదీర్ఘ కాలం సాగిన రాజకీయ బంధం ఎట్టకేలకు తెగిపోతోందన్న కథనాలు.. దేశ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో కొనసాగడం ఇక ఎంతమాత్రం మంచిది కాదనే అభిప్రాయంలోకి జనతాదళ్(యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ వచ్చినట్లు భోగట్టా. ఈ మేరకు జేడీయూ వర్గాలు, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు బాగా దగ్గరి వ్యక్తులే మీడియాకు ‘బ్రేకప్’ సమాచారం అందిస్తున్నారు. బీహార్‌లో జేడీయూ మరో మహారాష్ట్ర శివసేనలా మారబోతోందనే ఉద్దేశం నితీశ్ కుమార్లో బలంగా నాటుకుపోయింది. అందుకే ప్రభుత్వానికి ఢోకా లేకుండా.. తిరిగి ప్రాంతీయ పార్టీలతో జత కట్టాలనే ఆలోచనకు ఆయన వచ్చారు. ఈ మేరకు ఆర్జేడీ, కాంగ్రెస్ కీలక నేతలకు పాట్నాకు రావాలనే పిలుపు ఈపాటికే అందింది. బీజేపీతో గనుక దూరం జరగకపోతే.. మహారాష్ట్రలో ఉద్దేవ్ థాక్రేకు ఎదురైన అనుభవమే తనకూ ఎదురవుతుందని.. అందుకు ‘వెన్నుపోటు’ అస్త్రాన్ని బీజేపీ ప్రయోగించబోతోందని నితీశ్ కుమార్ భావిస్తున్నారు. అవును.. ఇది నితీశ్ మానసిక అపవ్యవస్థ ఎంతమాత్రం కాదని జేడీయూ వర్గాలు అంటున్నాయి. ‘ప్రాంతీయ పార్టీల మనుముందు మనుగడ కష్టతరం’.. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన కామెంట్లు ఇవి. స్థానిక పార్టీలను బీజేపీతోనే భర్తీ చేయించాలన్న ఉద్దేశంతోనే నడ్డా ఆ కామెంట్లు చేశారని భావిస్తోంది జేడీయూ. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను, సంక్షోభ దిశ అడుగులను జేడీయూ ఆసక్తిగా గమనిస్తోంది. శివ సేనలాగే.. జేడీయూ కూడా ప్రాంతీయ పార్టీనే. పైగా సుదీర్ఘ బంధం ఉంది బీజేపీతో. ఈ కారణంతోనే పొత్తు విషయంలో నితీశ్ ఆలోచనలో పడినట్లు స్పష్టమవుతోంది. మహారాష్ట్రకు కొనసాగింపుగా బీహార్ రాజకీయ సంక్షోభం రాబోతుందని జేడీయూలో చర్చ నడుస్తోంది. సుదీర్ఘంగా సాగిన బంధాన్ని సైతం తెంచుకుని.. మహాలో ఉద్దవ్‌థాక్రేను గద్దె దించింది బీజేపీ. అయితే.. అక్కడి పరిస్థితులు, ప్రత్యర్థి కూటమి వేరని భావించినప్పటికీ.. హు ఈజ్ నెక్స్ట్ క్రమంలో తన పేరు తర్వాత ఉందనే స్థితికి నితీశ్ వచ్చేశారు. ‘వచ్చే ఎన్నికల్లోనూ బీహార్ ఎన్డీయే కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ కుమార్.. 2024 లోకసభ ఎన్నికలతో పాటు 2025 బీహార్ ఎన్నికల్లోనూ జేడీయూతో పొత్తు ఉంటుంది’.. స్వయానా బీజేపీ కీలకనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన ప్రకటనను నితీశ్ నమ్మట్లేదన్నది ఆయన అంతరంగికులు చెప్తున్నమాట. అంతేకాదు ఏక్నాథ్ షిండే ద్వారా శివసేనలో బీజేపీ ముసలం రేపిందని, ఆ అసంతృప్తత ద్వారానే ఉద్దవ్‌ను గద్దె దింపిందని నితీశ్ పదే పదే పార్టీ భేటీల్లో చర్చిస్తున్నారట. ఈ క్రమంలోనే.. శివ సేన లాగా బంధం ఉన్న జేడీయూకు రేపో మాపో అలాంటి గతి పట్టొచ్చనే భావిస్తున్నారు ఆయన. అమిత్ షా, బీజేపీ హామీలను, ప్రకటనలను.. ఎట్టిపరిస్థితుల్లో నమ్మే స్థితిలో ఇప్పుడు జేడీయూ, ఆ పార్టీ అధినేత నితీశ్ లేరు. ఎందుకంటే.. వెన్నుపోటు రాజకీయం ద్వారా తనను గద్దె దించే అవకాశం ఉందన్న స్థితికి ఆయన ఎప్పుడో చేరిపోయారు. అందుకు కారణాలు లేకపోలేదు.. బీహార్ కేబినెట్లోని జేడీయూ మంత్రుల్లో చాలామంది అమిత్ షాకు అనుకూలంగా ఉన్నారు. అంతెందుకు.. జేడీయూలో పరోక్షంగా అమిత్ షా డామినేషన్ కొనసాగుతోంది కూడా. జేడీయూ రిమోట్ కంట్రోల్ పూర్తిగా షా చేతికి వెళ్లకముందే జాగ్రత్త పడాలని నితీశ్ అనుకుంటున్నారట. అందుకే జేడీయూ నేత ఆర్సీపీ సింగ్ రాజ్యసభ పదవీకాలాన్ని కావాలనే.. పొడగించకుండా నితీశ్ అడ్డుకున్నారన్న వాదన ఇప్పుడు తెర మీదకు వచ్చింది. ఏడు జన్మలెత్తినా నితీశ్ ప్రధాని కాలేడంటూ ఆర్సీపీ సింగ్ వ్యాఖ్యానించడం, ఆ వెంటనే జేడీయూకి గుడ్‌బై చెప్పడంతో.. నితీశ్‌కు వ్యతిరేకంగా వెన్నుపోటు వాదన నిజమేమోనని జేడీయూలో చర్చ నడుస్తోంది. ఆర్సీపీ సింగ్‌ను పెద్దల సభకు ఎంపిక చేసిందే నితీశ్. అలాంటిది ఆయనే స్వయంగా ఆర్సీపీ సింగ్‌ను నిలువరించడం గమనార్హం. నితీశ్ కుమార్ ప్రధాన అనుచరుడు, జేడీయూ ప్రెసిడెంట్ రాజీవ్ రంజన్‌సింగ్(లలన్ సింగ్) ఏం చెప్తున్నారంటే.. బీజేపీలో చేరాలని ఆర్సీపీ సింగ్ ఎప్పటి నుంచో భావిస్తున్నారు. పొత్తులో భాగంగా మేం బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని ఓ కేంద్ర మంత్రి పదవికావాలని కోరాం. ఆ సమయంలో సింగ్ జోక్యం చేసుకుని.. తనకు మాత్రమే మంత్రి పదవి ఇస్తామని అమిత్ షా తన వద్ద ప్రస్తావించారని చెప్పారు. ‘అలాంటిప్పుడు నాకెందుకు చెప్పడం.. వాళ్లతో కలిసి మీకు మీరే డిసైడ్ చేస్కోండి’ అంటూ నితీశ్, ఆర్సీపీ సింగ్ మీద ఫైర్ అయినట్లు లాలన్ సింగ్ తాజాగా మీడియాకు వెల్లడించారు. ఇదీ చదవండి: ఎన్డీఏకు నితీశ్ రాంరాం.. కూలిపోనున్న బిహార్ సర్కార్.. షాక్‌లో బీజేపీ! -
అమిత్‌కు విద్యార్థి సేన పగ్గాలు!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్)కు అనుబంధంగా ఉన్న విద్యార్థి సేన అధ్యక్షుడిగా అమిత్ ఠాక్రేకు నియమించనున్నారని తెలిసింది. ఇదివరకు విద్యార్థి సేన అధ్యక్ష పదవిలో కొనసాగిన ఆదిత్య శిరోడ్కర్ ఎమ్మెన్నెస్ నుంచి బయటపడి శివసేనలో చేరారు. దీంతో ఖాళీ అయిన ఆ పదవిలో పార్టీ చీఫ్ రాజ్‌ఠాక్రే తనయుడు అమిత్ ఠాక్రేను నియమించేందుకు ఆ పార్టీ పదాధికారులు, కార్యకర్తలు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆ పార్టీలో పలువురు సీనియర్ల పేర్లు రేసులో ఉన్నప్పటికీ అమిత్ ఠాక్రేను నియమించాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది. దీంతో ఈ పదవీ బాధ్యతలు ఎవరికి కట్టబెడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. నాసిక్‌లో చర్చలు.. ఎమ్మెన్నెస్ ప్రధాన కార్యదర్శి, విద్యార్థి సేన అధ్యక్షుడు ఆదిత్య శిరోడ్కర్ ఇటీవల ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమక్షంలో శివసేనలో చేరారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఆదిత్య అకస్మాత్తుగా శివసేనలో చేరడం వల్ల ఎమ్మెన్నెస్‌కు గట్టి దెబ్బ తగిలినట్లైంది. వచ్చే సంవత్సరం బీఎంసీ ఎన్నికలు, భవిష్యత్తులో అసెంబ్లీ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఆదిత్య ఇలా అకస్మాత్తుగా పార్టీని విడటం రాజ్ ఠాక్రేతోపాటు ఆ పార్టీ సీనియర్ నాయకులు, పదాధికారులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం రాజ్‌ఠాక్రే నాసిక్ పర్యటనలో ఉన్నారు. దీంతో ఆ పదవిలో ఎవరిని నియమించాలనే దానిపై చర్చించేందుకు అమిత్‌తోపాటు పలువురు సీనియర్ నాయకులు వెంటనే నాసిక్‌కు రావాలని సందేశం పింపించారు. అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై చర్చించినట్లు తెలిసింది. ఇందులో అధిక శాతం అమిత్‌నే నియమించడానికి ఇష్టపడినట్లు తెలిసింది. ఒకవేళ ఈ పదవిలో అమిత్ ఠాక్రేను నియమిస్తే నేటి యువ కార్యకర్తల్లో నవ చైత్యనం నూరిపోసినట్లవుతుంది. దీంతో అమిత్‌నే నియమించాలని పదాధికారులు, కార్యకర్తలు పట్టుబడినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కాగా ఎమ్మెన్సెస్ సినెట్ సభ్యులు సుధాకర్ తాంబోలి, అఖిల్ చిత్రే, గజానన్ కాళే తదితర సీనియర్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. కానీ, ముందువరుసలో అమిత్ ఠాక్రే ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇందులో విద్యార్థి సేన అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రారంభంలో ఘనంగా.. అప్పట్లో శివసేన నుంచి బయటపడిన రాజ్‌ఠాక్రే సొంత పార్టీ పెట్టుకున్నారు. అన్ని వర్గాల ప్రజలను తమ పార్టీలో చేర్చుకుంటామని పేర్కొంటూ 2006 మార్చి 9వ తేదీన ఎమ్మెన్నెస్ పార్టీ స్థాపించారు. ప్రారంభంలో తిరుగులేని పార్టీగా ఎదిగిన ఎమ్మెన్నెస్ ప్రధాన పార్టీలను సైతం దెబ్బతీసింది. ఆ తరువాత జరిగిన బీఎంసీ, నాసిక్ కార్పొరేషన్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించుకుంది. కాని కాలక్రమేణా పార్టీ ప్రతిష్ట, ప్రాబల్యం దెబ్బతినసాగింది. దీంతో కార్పొరేటర్ల సంఖ్య, ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోయింది. చివరకు పార్టీలో ఒక్కరే ఎమ్మెల్యే, ఒక్కరే కార్పొరేటర్ మిగిలారు. ఇది పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పార్టీ కోల్పోయిన ప్రతిష్ట, కార్యకర్తలు కోల్పోయిన మనోధైర్యాన్ని తిరిగి నింపేందుకు శత ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగం గా త్వరలో ఎన్నికలు జరగనున్న కార్పొరేషన్లలో పర్యటించడం, పదాధికారులు, కార్యకర్తలతో సంప్రదించడం లాంటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అదేవిధంగా సభ్యత నమోదు పథకాన్ని సోషల్ మీడియా ద్వారా చేపట్టి పార్టీలో కార్యకర్తల సంఖ్య పెంచుకోవాలని, అలాగే ప్రజలకు మరిం త దగ్గరవ్వాలనే ప్రయత్నం రాజ్ ఠాక్రే చేస్తున్నా రని పార్టీ అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఒకవేళ విద్యార్థి సేన పగ్గాలు అమిత్‌కు దక్కితే పార్టీలో నూతనోత్తేజం రావడం ఖాయమని రాజకీయ వర్గాలో చర్చ నడుస్తోంది. -
వద్దన్న బీజేపీ... మళ్లీ ముందుకు!
తీర్పు స్పష్టంగానే వచ్చింది. కానీ పార్టీలే మాట తప్పాయి. ఇక్కడ ఏ పార్టీ మాట తప్పిందంటే... చెప్పటం కష్టం. మహారాష్ట్రలో బీజేపీ– శివసేన కూటమికి జనం అధికారమిచ్చినా... రెండున్నరేళ్ల చొప్పున ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకుంటామని ముందు చెప్పి, తరవాత మాట తప్పుతున్నందుకే తాము బీజేపీతో కలవటం లేదని శివసేన చెబుతోంది. తాము అలాంటి హామీనే ఇవ్వలేదని, శివసేనే మాట మారుస్తోందని బీజేపీ చెబుతోంది. అందుకే... ఇద్దరి పొత్తూ పెటాకులైంది. బీజేపీకి సింగిల్‌గా బలం చాలదు కనక... గవర్నరు పిలిచినా... చేతులెత్తేసింది. శివసేనను పిలిచినా అదే కథ. కాకపోతే ఈ పార్టీ కొంచెం సమయం కావాలంది. దానికి నిరాకరిస్తూ మరో పార్టీ ఎన్సీపీని కూడా పిలిచారు గవర్నరు. అంతలోనే ఈ గొడవ తేలదంటూ ఈ వారం మొదట్లో గవర్నరు రాష్ట్రపతి పాలనకూ సిఫారసు చేశారు. కేంద్రం ఓకే చేసేసింది. ఇది అన్యాయమంటూ శివసేన సుప్రీంకోర్టుకు వెళ్లింది కూడా. 288 సీట్ల మహారాష్ట్రలో బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 స్థానాలున్నాయి. బీజేపీగానీ, శివసేనగానీ లేకుండా ఏ ప్రభుత్వమూ ఏర్పాటయ్యే పరిస్థితి లేదు. అందుకే సేన కూడా మొండిపట్టు పడుతోంది. ప్రాంతీయ శక్తుల ఎదుగుదలకు అవకాశమున్న మహారాష్ట్రలో ముందుముందు బలోపేతం కావాలంటే అధికార పీఠం తన చేతిలో ఉండాలన్నది సేన మనోగతం. అందుకే మునుపటిలా బీజేపీకే ఐదేళ్లూ అవకాశం ఇవ్వకుండా తనకూ రెండున్నరేళ్లు సీఎం పీఠం కావాలంది. ఇదే ప్రతిపాదనతో ఎన్సీపీ– కాంగ్రెస్‌లతోనూ సంప్రదింపులు జరుపుతోంది. ఎన్సీపీ ఓకే అంటున్నా... కాంగ్రెస్ మాత్రం సైద్ధాంతిక వైరుధ్యాల దృష్ట్యా అంత సుముఖత వ్యక్తం చేయలేదు. కాకపోతే దేశ ఆర్థిక రాజధాని ముంబైని బీజేపీకి దూరం చేయాలంటే సేనకు మద్దతివ్వక తప్పదు. అందుకే ముగ్గురూ కలిసి ఓ అవగాహనకు రావటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి కాంగ్రెస్ కూడా సై అనే ప్రకటించింది. కాంగ్రెస్ ఎలాగూ శివసేనతో కలవదని, సేన తమ చెంతకే వస్తుందని ధీమాగా ఉన్న బీజేపీకి ఇది షాకే. అందుకే వేగంగా పావులు కదిపింది. తమకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, కాబట్టి ప్రభుత్వానికి అవకాశమివ్వాలని గవర్నరును శనివారం కోరింది. కనీసం 144 మంది మద్దతిస్తేనే ప్రభుత్వం సాధ్యం. మరి 118 మందితో ఏం చేస్తారు? తమ పార్టీల ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది బీజేపీ వ్యూహమని సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మండిపడుతున్నాయి. ఏమో!! ఏం జరుగుతుందో... గవర్నరు ఏం చేస్తారో చూడాల్సిందే!!. కనీసం 144 మంది మద్దతిస్తేనే ప్రభుత్వం సాధ్యం. మరి 118 మందితో ఏం చేస్తారు? తమ పార్టీల ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది బీజేపీ వ్యూహమ’ని సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మండిపడుతున్నాయి. -
బీజేపీ వెనక్కి.. శివసేన ముందుకు
-
బీజేపీ వెనక్కి.. శివసేన ముందుకు
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రెండు వారాలకు పైగా నెలకొన్న రాజకీయ అనిశ్చితిలో ఒక్కసారిగా కదలిక వచ్చింది. ఆదివారం సాయంత్రం వేగంగా పరిణామాలు మారిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు విముఖత చూపింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ బీజేపీని శనివారం గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ వెనకడుగు వేయడంతో కొత్త రాజకీయ సమీకరణాలు ఊపందుకుంటున్నాయి. సీఎం పదవి విషయంలో శివసేనతో అంతరం పెరిగిపోవడం, ప్రభుత్వం ఏర్పాటుకు చాలినంత బలం కూడగట్టలేక బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించేందుకే మొగ్గు చూపింది. దీంతో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానం పంపారు. ఈ విషయంలో అభిప్రాయం తెలపాలంటూ సోమవారం సాయంత్రం 7.30 గంటల వరకు గవర్నర్ ఆ పార్టీ శాసనసభా నేత ఏక్నాథ్ షిండేకు గడువిచ్చారు. ప్రస్తుతం ముంబైలోని ఓ హోటల్లో మకాం వేసిన శివసేన ఎమ్మెల్యేలంతా గవర్నర్ ఆహ్వానం అనంతరం పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీకి తరలివెళ్లారు. అంతకుముందు సేన చీఫ్ ఠాక్రే నగరంలోని ఓ హోటల్లో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలతో తమ పార్టీ నేత సీఎం పీఠం ఎక్కనున్నారంటూ ప్రకటించారు. ప్రతిపక్షం మద్దతుతో సర్కారు ఏర్పాటుకు గల అన్ని అవకాశాలను అన్వేషిస్తున్నట్లు ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ కూడా తెలిపారు. ఏదేమైనా తమ పార్టీ నేతే సీఎం అవుతారన్నారు. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామన్నారు. ఈ పరిణామాలతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య చర్చలు ఊపందుకున్నాయి. శివసేన ఎన్డీఏ నుంచి వైదొలిగితేనే.. శివసేన–ఎన్సీపీ సంకీర్ణానికి కాంగ్రెస్ మద్దతిచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం జైపూర్‌లో ఉన్న మహారాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ్యులు అంతిమ నిర్ణయాన్ని సోనియా గాంధీకి వదిలివేసేందుకు ఆమోదం తెలిపారు. ఎన్సీపీ చీఫ్ పవార్ మంగళవారం తమ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం సోనియాతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు మాట్లాడుతూ.. ‘సేన–ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే పక్షంలో కాంగ్రెస్ మద్దతిస్తుంది. కాంగ్రెస్‌కు స్పీకర్ పోస్టు దక్కే అవకాశముంది’ అన్నారు. కాంగ్రెస్ తమకు విరోధి కాదంటూ సామ్నా పేర్కొనడంపై కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ.. సేనకు మద్దతు తెలపాలంటే, ముందుగా ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాలి. ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి అరవింద్ సావంత్ రాజీనామా చేయాలి’ అన్నారు. అయితే, ప్రభుత్వం ఏర్పాటుపై కాంగ్రెస్‌లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. శివసేనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం అప్పగించరాదని కొందరు, కాంగ్రెస్–ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వానికి శివసేన మద్దతిస్తే చాలునని మరికొందరు అంటున్నారు. రాష్ట్రపతి పాలన రావాలని తమ పార్టీ కోరుకోవడం లేదని కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ తెలిపారు. ప్రతిపక్షంలో ఉండేందుకు బీజేపీ నిర్ణయం ఇటీవలి ఎన్నికల్లో శివసేనతో కలిసి బరిలోకి దిగిన బీజేపీ ఆదివారం ప్రభుత్వం ఏర్పాటులో అన్ని ప్రయత్నాలు చేసింది. శివసేన ససేమిరా అనడంతో గవర్నర్‌ను కలిసి ప్రతిపక్షంగానే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. శివసేన పట్టు కారణంగా ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత నేపథ్యంలో ఆదివారం ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయానికి వచ్చినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తెలిపారు. ‘శివసేన ప్రజల తీర్పును అపహాస్యం చేసింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంది. అందుకే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పాం’అని ఆయన అన్నారు. అందరి చూపు కాంగ్రెస్ వైపు మహారాష్ట్ర పరిణామాలు మరోసారి కర్ణాటక రాజకీయాలను జ్ఞప్తికి తెస్తున్నాయి. అక్కడ ఎక్కువ సీట్లు సాధించిన కాంగ్రెస్ కొన్ని స్థానాలు మాత్రమే గెలుచుకున్న జేడీఎస్‌కు ముఖ్యమంత్రి పదవి అప్పగించి, తలబొప్పి కట్టించుకుంది. మహారాష్ట్రలో.. శివసేనతో కలిసి ఎన్నికల్లో ప్రచారం చేసిన బీజేపీ అతిపెద్ద పార్టీ గా అవతరించింది. శివసేనతో సీఎం పీఠం విషయంలో పొసగక తెగదెంపులు చేసుకుంది. స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతిచ్చినప్పటికీ బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌కు 25 సీట్ల దూరంలో ఉండిపోయింది. అయితే, గవర్నర్ ఆహ్వానంతో సైద్ధాంతిక విభేదాలున్న కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టు కట్టేందుకు సేన సిద్ధమయింది. అయితే, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక భాగస్వామ్య పక్షాలతో సాధారణంగా తలెత్తే విభేదాల కారణంగా తమ ఎమ్మెల్యేలు ప్రతిపక్షం వలలో పడే అవకాశముందని కర్ణాటక అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకుని కాంగ్రెస్ భయపడుతోంది. సంకీర్ణంలో భాగస్వామి అవుతుందా? లేక బయటి నుంచి మద్దతిస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నిర్ణయంపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తమ ఎమ్మెల్యేలను ఎక్కడ బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుందోననే భయంతో శివసేన కూడా క్యాంపు నడుపుతున్న విషయం తెలిసిందే. శివసేన తన ప్రయత్నాల్లో ఉందా? బీజేపీ మద్దతు లేకుండానే శివసేన ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రావడం ఆసక్తి కరంగా మారింది. కొన్ని రోజులుగా శివసేన నేత సంజయ్ రౌత్ ‘త్వరలోనే మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారబోతోందంటూ’ మాట్లాడటం వెనుక అంతరార్థం ఇదా అని విశ్లేషకులు విస్తుపోతున్నారు. శివసేన నేత సంజయ్ రౌత్ వారం రోజుల్లో మూడు సార్లు పవార్ ఇంట్లో భేటీ కావడం అంతర్గతంగా ఏదో ఒప్పందం జరిగి ఉండొచ్చని అనే ఊహాగానాలకు తావిస్తోంది. దీంతోపాటు, సోమవారం శివసేన సంజయ్ రౌత్ సోనియా గాంధీతో భేటీ అయేందుకు డిల్లీ వెళుతున్నట్లు సమాచారం. -
సుప్తచేతనావస్థలోకి మహారాష్ట్ర అసెంబ్లీ!
ముంబై: మహారాష్ట్రలో కనుచూపు మేరలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు సాధ్యంకాని నేపథ్యంలో ఆ రాష్ట్ర కొత్త అసెంబ్లీ సుప్తచేతనావస్థలోకి వెళ్లనుంది. ఆ రాష్ట్ర అసెంబ్లీని గవర్నర్ తొలిసారి సమావేశపర్చేవరకూ 14వ అసెంబ్లీ సుప్తచేతనా వస్థలోనే ఉంటుందని అసెంబ్లీ వ్యవహరాల మాజీ అధికారి ఒకరు తెలిపారు. మహారాష్ట్ర 13వ అసెంబ్లీ పదవీకాలం శనివారం రాత్రితో ముగిసింది. అయితే బీజేపీ, శివసేనల మధ్య ఎలాంటి సయోధ్య కుదరకపోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని అడ్వకేట్ జనరల్ అశుతోష్ కుంభకోణి శనివారం రాజ్‌భవన్‌లో కలిసి ఈ అంశంపై చర్చించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మెజార్టీ సాధించినా ముఖ్యమంత్రి పదవి విషయంలో రెండు పార్టీల మధ్య పీటముడి కొనసాగుతోంది. శనివారం అయోధ్య వివాదంలో సుప్రీం తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడిన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే.. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేశారు. అసెంబ్లీని సమావేశపర్చే వరకూ అంతే.. ‘కొత్త అసెంబ్లీని గవర్నర్ సమావేశపర్చనంత వరకూ మహారాష్ట్ర 14వ అసెంబ్లీ సుప్తచేతనావస్థలోకి వెళ్తుంది’అని మహారాష్ట్ర అసెంబ్లీ మాజీ ముఖ్య కార్యదర్శి అనంత కల్సే చెప్పారు. సుప్తచేతనావస్థలో ఎంత కాలం ఉంచాలన్న దానిపై నిర్దిష్ట సమయమేదీ లేదన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆ సమయంలో జీతాలు, ఇతర అలవెన్సులు అందుకుంటారన్నారు. ‘రాష్ట్రపతి పాలనే చివరి ప్రత్యామ్నాయం. కేబినెట్ సిఫార్సు లేకుండా గవర్నర్ కూడా కొత్త అసెంబ్లీని సమావేశపర్చలేరు. ప్రస్తుతం రాష్ట్రంలో కేబినెట్ లేదు’అని పేర్కొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 సీట్లకు గాను బీజేపీ 105 స్థానాలు, శివసేన 56 సీట్లు గెలుచుకోగా.. ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించండి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయాలని కోరుతూ గవర్నర్ కోషియారీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, బీజేపీ శాసనసభా పక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు శనివారం లేఖ రాశారు. సీఎం పీఠం విషయంలో బీజేపీ, శివసేన మధ్య పక్షం రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ఆయన ఈ సూచన చేయడం గమనార్హం. ప్రభుత్వం ఏర్పాటుపై సానుకూలంగా స్పందించాలని ఆ లేఖలో కోరారు. ఈ పరిణామంపై ఎన్సీపీ స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే పక్షంలో శాసనసభలో తాము వ్యతిరేకంగా ఓటు వేస్తామని స్పష్టం చేసింది. శివసేన కూడా బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే అప్పుడు ప్రత్యామ్నాయం ఆలోచిస్తామని తెలిపింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు తమ ఎమ్మెల్యేలతో క్యాంపులు నడుపుతున్నాయి. -
సస్పెన్స్ సా...గుతోంది!
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు డెడ్‌లైన్ ముంచుకొస్తోంది. అయినా ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ఫలితాలు విడుదలైన దగ్గర్నుంచి చెరో రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలని డిమాండ్ చేస్తున్న శివసేన పట్టిన పట్టు వీడడం లేదు. రొటేషన్ పద్ధతిలో సీఎం పదవిని పంచుకోవడానికి సిద్ధపడితే బీజేపీతో ఎప్పుడైనా చర్చలకు సిద్ధమేనని శివసేన ప్రకటించింది. 105 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి 182 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని విస్తృతంగా ప్రచారం జరగడంతో శివసేనలో చీలికలు వస్తాయన్న ఆందోళన మొదలైంది. అందుకే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమై గంటకు పైగా చర్చలు జరిపారు. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే సర్వాధికారాలు పార్టీ అధినేతకే కట్టబెడుతూ ఎమ్మెల్యేలందరూ తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు చేజారిపోకుండా వారిని అధ్యక్షుడు నివాసమైన మాతోశ్రీకి సమీపంలోని ఫైవ్ స్టార్ హోటల్‌కి తరలించారు. బ్లాక్మెయిల్ రాజకీయాలు పనిచేయవు శివసేనలో చీలికలు రావడం ఖాయమని 25 మందికిపైగా సేన ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతూ ఉండడంతో ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ కమలదళంపై కస్సుమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి బ్లాక్మెయిల్ రాజకీయాల్ని పనిచేయవని అన్నారు. గవర్నర్‌తో బీజేపీ చర్చలు బీజేపీ సీనియర్ నాయకులు గురువారం గవర్నర్ భగత్ సింగ్ కొషియారిని కలుసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతూ ఉండడంతో ఎదురయ్యే న్యాయపరమైన అడ్డంకులపై గవర్నర్‌తో చర్చించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, మంత్రులు సుధీర్ ముంగంటివార్, గిరీష్ మహాజన్ తదితరులు గవర్నర్‌ని కలిసిన వారిలో ఉన్నారు. అసెంబ్లీ గడువు ముగిసేలోగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోతే అతిపెద్ద పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించాల్సి ఉంటుందని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. కాగా, ముఖ్యమంత్రి రేసులో తాను లేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్‌నే ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్నారని తెలిపారు. ఏం జరిగే అవకాశాలున్నాయ్ ! ప్రస్తుత మహారాష్ట్ర అసెంబ్లీ గడువు శనివారంతో ముగియనుంది. ఈ లోపల ప్రభుత్వ ఏర్పాటుపై ఏదో ఒక స్పష్టత రావాలి. లేదంటే జరిగే పరిణామాలు ఏవంటే.. ► ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరైనా ముందుకు వచ్చే వరకు దేవేంద్ర ఫడ్నవీస్‌నే సీఎంగా కొనసాగాలని గవర్నర్ ఆదేశించే అవకాశం. ► మహారాష్ట్ర గవర్నర్‌ని బీజేపీ ఎమ్మెల్యేల బృందం కలిసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం. సభలో బల నిరూపణకు గవర్నర్ సమయాన్ని ఇవ్వడం. ► బీజేపీయేతర పక్షాలన్నీ చేతులు కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ని కోరడం. ► మెజార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధించడం. -
పాత కూటమి... కొత్త సీఎం?
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ గడువు శనివారంతో ముగుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటుపై స్పష్టత వచ్చినట్లే కనిపిస్తున్నా ఎప్పుడు ఏర్పడుతుందో చెప్పలేని పరిస్థితి. మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌తో భేటీ కావటం, బీజేపీ– సేన తెరవెనుక చర్చలు, గురువారం బీజేపీ నేతలు గవర్నర్ భగత్‌సింగ్ కోషియారిని కలవనుండటం ఇవన్నీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టతనిచ్చాయి. కానీ గవర్నరును కలిసే బీజేపీ నేతల్లో ఫడ్నవీస్ లేరు. బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ నేతృత్వంలో గవర్నర్‌ను కలవనున్నట్లు పార్టీ సీనియర్ నేత సుధీర్ ముంగంటివార్ చెప్పారు. పలు అంశాలను చర్చించడానికే తప్ప ప్రభుత్వ ఏర్పాటుపై మాట్లాడటానికి కాదని కూడా చెప్పారాయన. గవర్నరును కలవటంపై తమకు ఆహ్వానంలేదని శివసేన స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో... తెరవెనక పరిణామాలు చాలానే జరుగుతున్నట్లు తెలిసింది. వాటిలో గడ్కరీని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలనే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. మహా పీఠంపై గడ్కరీ? మంగళవారం రాత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌ను కలిశారు. ప్రతిష్టంభన తొలగాలంటే గడ్కరీని సీఎంను చేయడమే పరిష్కారమని ఆరెస్సెస్ చీఫ్ భావిస్తున్నారనేది రాజకీయ వర్గాల సమాచారం. దీనికి శివసేన తేలిగ్గా అంగీకరిస్తుందన్న అంచనాలున్నాయి. ఎందుకంటే ఆది నుంచీ శివసేనతో గడ్కరీకి మంచి సంబంధాలే ఉన్నాయి. దివంగత అధ్యక్షుడు బాల్ థాకరేకు గడ్కరీ అత్యంత సన్నిహితుడు. థాకరే జీవించి ఉన్న రోజుల్లో గడ్కరీ ఆయన నివాసం మాతోశ్రీకి తరచూ వెళ్లేవారు. బీజేపీ – సేన మధ్య ఎప్పుడు విభేదాలొచ్చినా గడ్కరీయే మధ్యవర్తిత్వం నెరిపి పరిష్కరించేవారు. గడ్కరీని సీఎంను చేస్తే శివసేన 50–50 ఫార్ములాపై పట్టు వీడవచ్చని బీజేపీ అంచనా వేస్తోంది. కాకపోతే ఇప్పటికే ఫడ్నవీస్‌ను తమ శాసనసభా పక్ష నేతగా మహారాష్ట్ర బీజేపీ ఎన్నుకుంది. సీఎంగా ఆయనే ఉంటారని బీజేపీ స్పష్టంగా చెప్పింది కూడా. తాజా పరిణామాల నేపథ్యంలో బుధవారం కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ నితిన్ గడ్కరీతో భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. కానీ తాను మహారాష్ట్ర రైతులకు రవాణా సౌకర్యాలపై మాట్లాడటానికే కలిశానని పటేల్ చెప్పారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటాం: పవార్ ప్రజా తీర్పును గౌరవించి మహారాష్ట్రలో వెంటనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ, శివసేనలకు శరద్ పవార్ స్పష్టం చేశారు. ఎన్సీపీ–కాంగ్రెస్ కూటమి బాధ్యతాయుత ప్రతిపక్ష పాత్రను పోషిస్తుందని చెప్పారాయన. శివసేన నేత సంజయ్ రౌత్ తనను కలిశాక పవార్ విలేకరులతో మాట్లాడారు. బీజేపీ, శివసేన బంధం 25 ఏళ్లుగా ఉందని, ఆ రెండు పార్టీలే రేపో మాపో ఒక అవగాహనకు వస్తాయని చెప్పారాయన. 170 మంది ఎమ్మెల్యేల మద్దతుతో శివసేన సీఎం పదవిని చేపట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై పవార్ ఆశ్యర్యం వ్యక్తం చేశారు. అంత మంది ఎమ్మెల్యేను శివసేన ఎలా తెస్తుందో చూడాలని ఆసక్తి ఉందన్నారు. సోనియా వద్దనడంతో..! 50–50 ఫార్ములాపై గట్టిగా కూర్చున్న శివసేన ఒక దశలో ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్‌ను సంప్రతించి బీజేపీ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేసింది. కాకపోతే శివసేన–ఎన్సీపీ కలిసినంత మాత్రాన ఏమీ జరగదు. కాంగ్రెస్ సహకరించాలి. అందుకే పవార్ వెళ్లి సోనియాను కలిసి శివసేనకు మద్దతిచ్చేలా ఒప్పించబోయారని తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు కర్ణాటక ఉదంతం చూసిన సోనియా... సేనకు మద్దతిచ్చి బీజేపీకి అధికారాన్ని దూరంచేస్తే కర్ణాటకలో జరిగినట్లు తమ ఎమ్మెల్యేల్ని లాగేస్తారని సందేహపడ్డారు. దీనికితోడు బీజేపీ హిందూత్వ విధానాల్ని సేనను నమ్మితే ముస్లిం ఓట్లు దూరమవుతాయని సోనియా భయపడ్డారు. మొదటికే మోసం వచ్చి అది కూడా బీజేపీకి కలిసివస్తుందని కూడా ఆమె భావించారు. అందుకే ఈ ప్రతిపాదనకు సుతరామూ అంగీకరించలేదు. వేరే దారిలేని శివసేన బీజేపీతో ముందుకెళ్లేందుకు సిద్ధపడుతోంది. ఇక పవార్ కూడా తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని గట్టిగా చెప్పేశారు. -
...అయిననూ అస్పష్టతే!
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. రోజంతా ఎవరికి వారు సమావేశాలు జరిపినా ప్రభుత్వ ఏర్పాటులో స్పష్టతలేదు. అధికారాన్ని పంచుకోవడంలో బీజేపీ, శివసేన మధ్య రేగిన సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందో ఎవరి అంచనాలకు అందడం లేదు. శివసైనికులు మహారాష్ట్ర గవర్నర్‌ను కలిస్తే, ముఖ్యమంత్రి∙ఫడ్నవీస్ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాని కలిసి భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు. ఈ అధికార పోరాటంలో అవసరమైతే శివసేనకు మద్దతునివ్వాలని భావించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో చర్చలు జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాము ప్రజాతీర్పుకనుగుణంగా ప్రతిపక్షంలో కూర్చుంటామని స్పష్టం చేశారు. సేనకు మద్దతునిచ్చే అంశంలో ఎవరూ తమను సంప్రదించలేదని, తమకు సంఖ్యా బలం లేదని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు బీజేపీ, శివసేన తమ తదుపరి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. గవర్నర్‌ని కలిసిన శివసైనికులు శివసేన పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్, ఇతర నేతలతో కలిసి సోమవారం మహారాష్ట్ర గవర్నర్ భగత్ కోష్యారీని కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మర్యాదపూర్వకంగానే తాము గవర్నర్‌ని కలిశామన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న ప్రతిష్టంభనకు తాము కారణం కాదని గవర్నర్‌కు చెప్పామని సంజయ్ వెల్లడించారు. అమిత్ షాతో ఫడ్నవీస్ మంతనాలు మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఎలాంటి తొందర లేదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి మహారాష్ట్రలో ఏర్పడిన ప్రతిష్టంభనపై చర్చలు జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ‘వీలైనంత త్వరగా ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం లేదు. నేను కచ్చితంగా చెబుతున్నా. ప్రభుత్వమైతే ఏర్పాటవుతుంది’అని చెప్పారు. ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్గా వ్యవహరించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌ను ఫడ్నవీస్ కలుసుకున్నారు. రౌత్ ఒక భేతాళుడు: మరాఠీ పత్రిక హేళన మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సంక్షోభానికి శివసేన నేత సంజయ్ రౌత్ కారణమనే ఉద్దేశంతో ఆయనను ఒక మరాఠీ పత్రిక భేతాళుడిగా చిత్రీకరించింది. ఆరెస్సెస్‌కు మద్దతుగా నిలిచే తరుణ్ భారత్‌లో రాసిన ఒక వ్యాసంలో విక్రమార్కుడి భుజంపై వేళ్లాడే భేతాళుడు సంజయ్ అని, బీజేపీ–శివసేన అధికారంలోకి రాకుండా ఆయన అడ్డుకుంటున్నారని తిట్టిపోసింది. రామజన్మభూమి–బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో అత్యంత కీలకమైన సుప్రీంకోర్టు తీర్పు ముందన్న నేపథ్యంలో మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు జరగడం అత్యంత ముఖ్యమని పేర్కొంది. గడ్కరీ మధ్యవర్తిత్వం ? కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రంగంలోకి దింపితే బీజేపీ, శివసేన మధ్య నెలకొన్న సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తారని శివసేన పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు సలహాదారుడైన కిషోర్ తివారీ సోమవారం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు ఒక లేఖ రాశారు. గడ్కరీని శివసేనతోచర్చలకు పంపాలని అన్నారు. -
మాకు 170 మంది మద్దతుంది
సాక్షి ముంబై/ఔరంగాబాద్: ముఖ్యమంత్రి పీఠంపై రాజీపడేది లేదని శివసేన మరోసారి స్పష్టం చేసింది. తమకు 170 మందికిపైగా ఎమ్మెల్యేల మద్దతుందని ప్రకటించింది. ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి ఒప్పందం శివసేనతో జరగలేదంటూ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మాటమార్చడం వల్లనే బీజేపీతో చర్చలను నిలిపి వేశామన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవిని తాము వదిలేది లేదన్నారు. శివసేన అధికార పగ్గాలు చేపట్టేదీ లేనిదీ తొందరలోనే ప్రజలు తెలుసుకుంటారని ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. అంతకు మించి వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఆదివారం ఆయన ఔరంగాబాద్‌లో మాట్లాడారు. నేడు ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలో ‘మహా’డ్రామా కొలిక్కివస్తుందని అంచనావేస్తున్నారు. పవార్ కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో, ఫడ్నవీస్ బీజేపీ చీఫ్ అమిత్‌షాతో భేటీకానున్నారు. దీంతో అందరి దృష్టీ దేశ రాజధానిపై ఉంది. ఈ నేపథ్యంలో ఉన్న ఐదు ప్రత్యామ్నాయాలను సామ్నా పత్రికలో రౌత్ వివరించారు. ► శివసేనను తప్పించి అతిపెద్దపార్టీగా ఆవిర్భవించిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు రావచ్చు. బీజేపీ వద్ద 105 మంది ఎమ్మెల్యేలుండగా మ్యాజిక్ ఫిగర్ కోసం 40 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంది. దీంతో బలనిరూపణ సమయంలో ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. ► 2014 ఎన్నికల్లో మాదిరిగా బీజేపీకి ఎన్సీపీ మద్దతు ప్రకటించేందుకు అవకాశం ఉంది. ఇలా జరిగితే సుప్రియా సూలేకు కేంద్రంలో, అజిత్ పవార్‌కు రాష్ట్రంలో మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నాయి. కాని, అలాంటి అవకాశమే లేదని స్వయంగా శరద్ పవార్ చెబుతున్నారు. ► బీజేపీ విశ్వాస పరీక్షలో నెగ్గకుంటే రెండో పెద్ద పార్టీగా శివసేన అధికారం కోసం ముందుకువచ్చే అవకాశాలున్నాయి. ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 ఎమ్మెల్యేలతోపాటు ఇతరుల సాయంతో అవసరానికి మించి 170 వరకు సంఖ్యాబలం చేరవచ్చు. శివసేనకు ముఖ్యమంత్రి పదవి లభిస్తుంది. కానీ, మూడు వేర్వేరు సిద్ధాంతాలున్న పార్టీలతో ముందుకెళ్లడం అసాధ్యం. ► బీజేపీ, శివసేన పంతం మాని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. ముఖ్యంగా శివసేన డిమాండ్లపై బీజేపీ ఆలోచించాల్సి ఉంది. సీఎం పదవిని విభజించాల్సి రావచ్చు. ఇది అత్యంత ఉత్తమ ప్రత్యామ్నాయం. ► అధికారాన్ని వాడుకుని, ప్రలోభాలకు గురి చేసి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. అయితే, ఫడ్నవీస్‌కు ప్రస్తుతం అదేమంత సులభం కాదని చెప్పవచ్చు. -
పవార్‌తో పవర్ పంచుకుంటారా?
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: రోజుకో రాజకీయం, పూటకో మలుపు, నేతల మధ్య మాటల తూటాలు, కొత్త పొత్తుల కోసం ఆరాటాలు ఇలా మహారాష్ట్ర రాజకీయం రంగులు మారుతోంది. 50:50 ఫార్ములాకే శివసేన పట్టుబట్టడం, అవసరమైతే రాష్ట్రపతిపాలనకైనా సిద్ధపడతామని బీజేపీ తేల్చి చెప్పడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో పీటముడి మరింత బిగుసుకుంది. అధికారం కోసం చావో రేవోకో సిద్ధపడిన శివసేన పవార్‌తో పవర్ పంచుకుంటామనే సంకేతాలు పంపుతోంది. ఇప్పటివరకు ప్రతిపక్షంలోనే కూర్చుంటామన్న ఎన్సీపీ తన రూటు మార్చుకుంటుందా అన్న చర్చ జరుగుతోంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఆయన భేటీ అవుతారు. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చించడం కోసమే ఢిల్లీ వెళుతున్నానని పవార్ బయటకి చెబుతున్నప్పటికీ, బీజేపీని అధికారానికి దూరం చేయడం కోసం కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి శివసేనకు మద్దతు ఇవ్వడంపై గల సాధ్యాసాధ్యాలను చర్చించడమే ప్రధాన ఎజెండా అన్న ఊహాగానాలు సాగుతున్నాయి. ‘నవంబర్ 4, సోమవారం ఢిల్లీలో సోనియాగాంధీతో శరద్ పవార్ భేటీ అవుతారు. ఆయన ఈ మధ్య ఫోన్లో ఆమెతో మాట్లాడారు. వాళ్ల మధ్య ఏయే అంశాలు చర్చకు వస్తాయో ఆ రోజే తెలుస్తుంది’ అని కాంగ్రెస్, ఎన్సీపీ హయాంలో డిప్యూటీ సీఎంగా పని చేసిన అజిత్ పవార్ చెప్పారు. శివసేన, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ బయట నుంచి మద్దతు ఇచ్చేలా మూడు పార్టీల మధ్య ఒక అవగాహన కుదురుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. శివసేన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలంటూ ఇప్పటికే కాంగ్రెస్‌లో స్వరాలు పెరుగుతున్నాయి. ఆ పార్టీ నేత హుస్సేన్ దల్వాయ్ పార్టీ అధ్యక్షురాలు సోనియాకు లేఖ రాశారు. సేనకు మద్దతివ్వాలని ఆ లేఖలో ఆయన కోరారు. సంకీర్ణ ధర్మానికే కట్టుబడతాం: సంజయ్ మహారాష్ట్ర ఫలితాలు వెలువడి పది రోజులు దాటిపోయినా ప్రభుత్వ ఏర్పాటు అంశంలో అడుగు కూడా ముందుకు పడకపోవడం ఉత్కంఠకు దారి తీస్తోంది. చివరిక్షణం వరకు తాము సంకీర్ణ ధర్మానికే కట్టుబడి ఉంటామని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తెలిపారు. ఈ నెల 9తో 13వ శాసనసభ గడువు ముగిసిపోనుంది. అయినప్పటికీ రెండు పార్టీల మధ్య ప్రభుత్వ ఏర్పాటుపై అధికారిక చర్చలేవీ జరగలేదు. మహారాష్ట్ర ప్రజలు బీజేపీ, శివసేనలకు కలిపి అధికారాన్ని అప్పగించారని, అందుకోసం తాము ఇద్దరూ కలిసే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వేచి చూస్తామన్నారు. ఉద్ధవ్ సీఎం కావాలి: అథవాలే శివసేన తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆదిత్య ఠాక్రేని ముందుకు తీసుకురావడాన్ని కేంద్ర మంత్రి, ఆర్పీఐ (ఏ) చీఫ్ రామ్‌దాస్ అథవాలే వ్యతిరేకించారు. భవిష్యత్‌లో శివసేనకు ఆ అవకాశం వస్తే ఆదిత్య బదులుగా ఉద్ధవ్ ఠాక్రే ఆ పదవిని చేపడితే బాగుంటుందని సూచించారు. ఈ విషయంలో శివసేన పునరాలోచించాలని అన్నారు. రామ్‌దాస్, ఇతర బీజేపీ మిత్రపక్షాలతో కలిసి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీను శనివారం కలుసుకున్నారు. అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిలవాలని ఆయన గవర్నర్‌ని కోరారు. రాష్ట్రపతి మీ జేబులో ఉన్నారా? ఈ నెల 7లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తామన్న బీజేపీ సీనియర్ నేత సుధీర్ మంగన్‌తివార్ వ్యాఖ్యలపై శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో విరుచుకుపడింది. మహారాష్ట్రకే అవమానం, రాష్ట్రపతి మీ జేబులో ఉన్నారా ? అన్న హెడ్డింగ్‌తో రాసిన సంపాదకీయంలో సుధీర్ చేసిన ప్రకటన అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమంటూ ధ్వజమెత్తింది. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాతీర్పునే అవమానించినట్టు అవుతుందని రాష్ట్రపతి అధికార పక్షం జేబులో ఉన్నారా అంటూ ప్రశ్నించింది. కొత్త ఎమ్మెల్యేలను భయపెట్టడానికే రాష్ట్రపతి పాలన అస్త్రాన్ని బయటకు తీశారా? అని∙ ఆ సంపాదకీయంలో బీజేపీని శివసేన నిలదీసింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్ హుడాను కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నేతగా నియమించారు. కొత్తగా ఎన్నికైన అసెంబ్లీలో హుడా విపక్ష నేతగా వ్యవహరిస్తారని కాంగ్రెస్ నేత ఆజాద్ వెల్లడించారు. -
మహారాష్ట్ర రాజకీయాలు మహా ముదురే!!
ముంబై : మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నవంబర్ 7లోపు ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే ఇక రాష్ట్రపతి పాలన విధిస్తారంటూ బీజేపీ నేత సుధీర్ మృదుగంటివార్ వ్యాఖ్యలు చేయడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఫలితాలొచ్చి వారం దాటిపోయినా ఇంకా శివసేనతో వ్యవహారం ఓ కొలిక్కి రాకపోవడంతో బీజేపీ కొత్త ఎత్తుకి తెరలేపిందేమో అన్న సందేహాలు మొదలయ్యాయి. రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం నవంబర్ 8న ముగియనుందని, ఆ లోపే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందంటూ బీజేపీ వ్యాఖ్యానించిన సందర్భంలో ఈ వ్యాఖ్యలపై శివసేన ఘాటుగా స్పందించింది. రాష్ట్రపతి పాలన వస్తుందంటూ బెదిరించడం ముమ్మాటికీ రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడానికి భారత రాష్ట్రపతి బీజేపీ కంట్రోల్లో ఉన్నారా? లేదా రాష్ట్రపతి స్టాంప్ బీజేపీ కార్యాలయంలో ఉందా? అంటూ శివసేన అధికార పత్రిక సామ్నా ప్రశ్నించింది. బీజేపీ వ్యాఖ్యలు మహారాష్ట్ర ప్రజల తీర్పును అగౌరవ పరిచేలా ఉన్నాయని పేర్కొంది. రాష్ట్రపతి అంటే కేవలం ఒక వ్యక్తి కాదని.. రాజ్యాంగ వ్యవస్థలో రాష్ట్రపతి అత్యున్నత వ్యక్తి అని, యావత్ దేశానికి ప్రతినిధి అని చెప్పింది. ఈ దేశం ఏ ఒక్కరి జేబులో లేదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్సీపీ స్పందన : 50-50 ఫార్ములాకు కట్టుబడి తమకు సీఎం పదవి ఇవ్వాలని శివసేన పట్టుబడుతుండటంతో బీజేపీ ఎటూ తేల్చుకోలేని సంఘటస్థితికి చేరుకుంది. ఈ దశలో 54 సీట్లను గెలుచుకున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో శివసేన నేతలు భేటీ కావడం ఉత్కంఠను మరింత పెంచింది. ఏ క్షణం ఏం జరగుతుందో అన్న పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో మీడియా ముందుకొచ్చిన శరద్ పవార్ తన మదిలో అంతరంగాన్ని బయటపెట్టారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు ఎన్సీపీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. తాము ప్రతిపక్షంలో ఉండాలని ప్రజలు తీర్పునిచ్చారని, వారి తీర్పును మేము శిరసావహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, శివసేనలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంపై మాట్లాడుతూ.. ఈ దిశగా ఎన్సీపీలో ఎలాంటి సంప్రదదింపులు జరపలేదన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ - శివసేనలకు ప్రజలు మెజార్టీ స్థానాలను ఇస్తే.. వారు చేస్తున్నదేంటి? వారిద్దరూ చిన్నపిల్లల్లా వ్యవహరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. శివసేన కోరితే మద్దతు ఇస్తామంటూనే కాంగ్రెస్ మరోసారి ప్రతిపక్షపాత్రకే పరిమితం అవుతామంటోంది. ఇలా ప్రతి పార్టీ కూడా రెండు రకాలుగా వ్యవహరిస్తుండటంతో మహానాటకం రక్తి కడుతోంది. కాగా ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. -
‘శివ’సైనికుడే సీఎం
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి వారం గడిచినా.. మెజారిటీ సాధించిన మిత్రపక్షాలు బీజేపీ, శివసేనల మధ్య అధికారం పంపిణీపై అవగాహన కుదరకపోవడంతో ఈ ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే. నవంబర్ 7వ తేదీలోగా కొత్త ప్రభుత్వం ఏర్పడనట్టయితే రాష్ట్రపతి పాలన విధించే అవకాశముందని బీజేపీ నేత, ఆర్థికమంత్రి ముంగంతివార్ పేర్కొన్నారు. ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి నవంబర్ 8వ తేదీతో ముగుస్తుంది. దీపావళి పండుగ కారణంగా శివసేన, బీజేపీల మధ్య చర్చలు ప్రారంభం కాలేదని, ఒకట్రెండు రోజుల్లో అవి ప్రారంభమవుతాయని ముంగంటివార్ తెలిపారు. ఏ ఒక్క పార్టీకో అనుకూలంగా ప్రజలు తీర్పునివ్వలేదని, బీజేపీ, సేన కూటమికి వారు మద్దతిచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ‘మా కూటమి ఫెవికాల్ కన్నా, అంబుజా సిమెంట్ కన్నా దృఢమైనది’అని వ్యాఖ్యానించారు. మరోవైపు, శివసేన వ్యక్తే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడంటూ సేన నేత సంజయ్ రౌత్ శుక్రవారం వ్యాఖ్యానించారు. ‘సేన కోరుకుంటే.. సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సభ్యుల మద్దతు కూడగట్టుకోగలదు’అన్నారు. అధికారాన్ని సమంగా పంచుకోవాలనే ప్రతిపాదనకే మహారాష్ట్ర ప్రజలు ఓటేశారన్నారు. అతివృష్టితో తీవ్రంగా నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందాల్సి ఉందని శివసేన పత్రిక సామ్నా పేర్కొంది. ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తాం ఒకవేళ బీజేపీ, శివసేన ప్రభుత్వ ఏర్పాటులో విఫలమైతే.. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు తాముప్రయత్నిస్తామని ఎన్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ వ్యాఖ్యానించారు. మరోవైపు, అదే పార్టీ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మాత్రం.. ప్రతిపక్షంలో కూర్చోమనే ప్రజలు తీర్పిచ్చారని, తాము అదే పాటిస్తామని వక్కాణించారు. గురువారం రాత్రి శరద్‌పవార్ నివాసంలో ఎన్సీపీ నేతల భేటీ అనంతరం అజిత్ పవార్ పై వ్యాఖ్యలు చేశారు. అది బీజేపీ, శివసేన డ్రామా బీజేపీ, శివసేన డ్రామాలో పావు కావద్దొని కాంగ్రెస్‌కు ఆ పార్టీ నేత సంజయ నిరుపమ్ సూచించారు. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతివ్వాలన్న కాంగ్రెస్ ఆలోచనను ఆయన తప్పుబట్టారు. బీజేపీ, శివసేనల మధ్య విభేదాలను ‘అధికారంలో ఎక్కువ వాటా కోసం ఆడుతున్న తాత్కాలిక డ్రామా’అని ఆయన అభివర్ణించారు. ‘బీజేపీ నీడ నుంచి శివసేన ఎన్నటికీ బయటకు రాదు’అని కాంగ్రెస్‌లో చేరకముందు శివసేనలో కీలక నేతగా వ్యవహరించిన సంజయ్ వ్యాఖ్యానించారు. పొత్తు తేలే దాకా నేనే సీఎం! ఔరంగాబాద్: రాజకీయ అనిశ్చితి కొనసా గుతున్న మహారాష్ట్రలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. బీజేపీ, శివసేనల మధ్య ఒప్పందం కుదిరేవరకూ తనను ముఖ్యమంత్రిగా చేయాలని ఓ రైతు అధికారులకు విజ్ఞప్తి చేశాడు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలు, శివసేన 56 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే, ముఖ్యమంత్రి పదవిపై ఇరుపార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో బీడ్ జిల్లాకు చెందిన రైతు శ్రీకాంత్ విష్ణూ గడాలే గురువారం కలెక్టర్‌ను కలిసి సీఎం పీఠంపై అస్పష్టత తొలిగే వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించి, రైతుల సమస్యలు పరిష్కరిస్తానంటూ వినతి పత్రం అందించారు. లేదంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళనకు దిగుతా నంటూ ఆ రైతు హెచ్చరించడం కొసమెరుపు! -
సీఎం పీఠమూ 50:50నే!
ముంబై: ‘మహా’ సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి వారం రోజులు దాటుతున్నా.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా స్పష్టత రాలేదు. అధికారాన్ని సమంగా పంచుకునే తమ డిమాండ్ విషయంలో వెనక్కు తగ్గబోమని శివసేన గురువారం మరోసారి స్పష్టం చేసింది. సమ అధికార పంపిణీ అంటే.. ముఖ్యమంత్రి పదవిని సమానంగా పంచుకోవడమేనని తేల్చిచెప్పింది. దాంతో, డిమాండ్ల విషయంలో సేన మెత్తబడిందని, త్వరలో శివసేనతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని వచ్చిన వార్తలకు తెరపడింది. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మిత్రపక్షాలు బీజేపీ, శివసేనల మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. కాగా, మహారాష్ట్ర రాజకీయాల్లో గురువారం పలు కీలక ఘటనలు చోటు చేసుకున్నాయి. శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్నాథ్ షిండే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కొడుకు, తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఠాక్రే వంశాంకురం ఆదిత్య ఠాక్రే పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నిక కాకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆదిత్య ఠాక్రేనే షిండే పేరును ప్రతిపాదించారు. ఉద్ధవ్ సూచన మేరకే ఎల్పీ నేతగా షిండే తెరపైకి వచ్చారని సమాచారం. పలువురు పార్టీ నేతలతో కలిసి ఉద్ధవ్ రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్ కోషియారీని కలిశారు. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు పంటలను దారుణంగా దెబ్బతీశాయని, అందువల్ల రాష్ట్రంలో అతివృష్టి వల్ల ఏర్పడిన కరువు నెలకొన్నట్లుగా ప్రకటించాలని గవర్నర్‌ను కోరారు. కాగా, శివసేన కార్యాలయం ముందు ‘ఆదిత్య ఠాక్రేనే మహారాష్ట్ర సీఎం’ అని రాసి ఉన్న భారీ హోర్డింగ్‌ను బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. మరోవైపు, కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నేత మల్లిఖార్జున్ ఖర్గే ముంబైలో సమావేశమయ్యారు. త్వరలో సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. వాడుకుని వదిలేసే విధానం వద్దు బీజేపీ వాడుకుని వదిలేసే విధానాన్ని అవలంబిస్తోందని శివసేన ఆరోపించింది. పొత్తు సమయంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాల్సిందేనని శివసేన పత్రిక ‘సామ్నా’ సంపాదకీయం పేర్కొంది. అధికార పంపిణీ విషయంలో సేన మెత్తబడిందన్న వార్తలు వదంతులేనని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఆదిత్య ఠాక్రే విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించి తుది నిర్ణయం ఉద్ధవ్ ఠాక్రేదేనని స్పష్టం చేశారు. ఢిల్లీ ముందు తలొంచం ఎన్సీపీ కార్యాలయం ముందు ఆ పార్టీ కార్యకర్తలు ఒక భారీ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు. ‘ఢిల్లీ సింహాసనానికి మహారాష్ట్ర ఏ నాటికి తలొంచదని చరిత్ర చెబుతోంది’ అని ఆ హోర్డింగ్‌పై రాసి ఉంది. మనీ లాండరింగ్‌కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనపై కేసు పెట్టినప్పుడు ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ చేసిన వ్యాఖ్య అది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ బాగా పుంజుకున్న విషయం తెలిసిందే. 2014లో కన్నా 13 స్థానాలు ఎక్కువగా, మొత్తం 54 స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ(105), శివసేన(56)కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్‌కు 44 సీట్లు వచ్చాయి. పవార్‌తో సంజయ్ రౌత్ భేటీ బీజేపీ, శివసేనల మధ్య విభేదాలతో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గురువారం భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి పదవిని శివసేనతో సమంగా పంచుకునేందుకు బీజేపీ వ్యతిరేకత చూపుతున్న పరిస్థితుల్లో.. ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా సమీకరణాలు మారుతున్నాయని రెండు రోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ వార్తలను ఎన్సీపీ ఖండించింది. సేన, బీజేపీల మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం సంజయ్ రౌత్ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసానికి వెళ్లడంతో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాట్లపై ఊహాగానాలకు మరోసారి తెరలేచింది. -
బీజేపీ, శివసేన మధ్య ‘50:50’పై పీటముడి
ముంబై: ‘ఇత్నా సన్నాటా క్యోం హై భాయి (ఇంత నిశ్శబ్దం ఎందుకు సోదరా?)’ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా షోలేలో ఫేమస్ డైలాగ్ ఇది. ఈ డైలాగ్‌ను ఉటంకిస్తూ దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యంపై విమర్శలు గుప్పిస్తూ సోమవారం పార్టీ పత్రిక సామ్నాలో శివసేన సంపాదకీయం రాసింది. మాంద్యం మూలంగా దీపావళి రోజు కళకళలాడాల్సిన మార్కెట్లలో నెలకొన్న స్తబ్దతను మిత్రపక్షం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఎత్తి చూపుతూ ఆ డైలాగ్‌ను శివసేన వాడుకుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం రాజకీయంగానూ మహారాష్ట్రలో ఒక రకమైన నిశ్శబ్దమే నెలకొని ఉండటమే ఇక్కడ విశేషం. రాష్ట్రంలో అధికారాన్ని సమంగా పంచుకోవాలన్న శివసేన డిమాండ్‌కు బీజేపీ అంగీకరిస్తుందా?, బీజేపీ ఒత్తిడి తెస్తే ఆ డిమాండ్‌ను శివసేన వదిలేస్తుందా?’ తదితర ప్రశ్నలకు ప్రస్తుతం నిశ్శబ్దమే సమాధానంగా వస్తోంది. హరియాణాలో స్మూత్.. ‘మహా’ ఉత్కంఠ ఒకేసారి ఎన్నికలు జరిగిన మహారాష్ట్ర, హరియాణాల్లో నిజానికి హంగ్ అసెంబ్లీ ఏర్పడిన హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటులో కొంత అస్థిరత, ఉత్కంఠ నెలకొనాల్సి ఉండగా.. అక్కడ ప్రభుత్వ ఏర్పాటు సజావుగా సాగింది. ప్రాంతీయ పార్టీ జననాయక జనతా పార్టీ(జేజేపీ) మద్దతుతో బీజేపీ సీఎం ఖట్టర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. పొత్తు షరతుల్లో భాగంగా జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మరోవైపు, ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్న బీజేపీ– శివసేన కూటమికి ఈ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ వచ్చినప్పటికీ.. ఆశ్చర్యకరంగా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో సందిగ్ధత, ఉత్కంఠ కొనసాగుతున్నాయి. శివసేనతో పొత్తు ఉన్నప్పటికీ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ వస్తుందని బీజేపీ ఆశించింది. అలా జరిగితే బీజేపీకి సమస్య ఉండకపోయేది. కానీ, అలా జరగలేదు. 288 స్థానాల అసెంబ్లీలో 2014లో కన్నా 17 స్థానాలు తక్కువగా 105 సీట్లకే బీజేపీ పరిమితమైంది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సహకారం అనివార్యమైంది. ఈ పరిస్థితిని అనుకూలంగా తీసుకున్న శివసేన పొత్తుకు ముందు అంగీకరించిన షరతులను తెరపైకి తీసుకువచ్చింది. 50 : 50 ఫార్ములాను అమలు చేయాల్సిందేనని పట్టుబడుతోంది. ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెడ్తున్న ఠాక్రే వంశాంకురం ఆదిత్య ఠాక్రేకు ప్రభుత్వంలో ‘సముచిత’ గౌరవం లభించాలన్నది సేన ఆలోచన. ముఖ్యమంత్రిత్వం తప్పితే ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి కూడా శివసేన సుముఖంగా లేదని తెలుస్తోంది. సంకీర్ణ ధర్మం పాటించాలి శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, పార్టీ నేత సంజయ్ రౌత్ తదితరులు తమ డిమాండ్లు చెప్పారు. ‘2019 లోక్‌సభ ఎన్నికల ముందే.. పొత్తు చర్చల సమయంలోనే ఈ విషయమై ఒక అంగీకారానికి వచ్చాం’ అని ఉద్ధవ్ ఠాక్రే గుర్తు చేస్తున్నారు. అధికార పంపిణీకి సంబంధించిన ఫార్మూలాను అమలు చేస్తామని ప్రభుత్వ ఏర్పాటుపై జరిపే చర్చలకు ముందే తమకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని సేన ఇప్పుడు డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై బీజేపీ నుంచి స్పందన లేదు. కానీ, ముఖ్యమంత్రిగా బీజేపీ వ్యక్తే ఉంటారనే విషయంలో ఎలాంటి రాజీ లేదనే సంకేతాలు మాత్రం ఇస్తోంది. జూనియర్ పార్ట్నర్గా శివసేన సంకీర్ణ ధర్మం పాటించాలని, ప్రభుత్వంలో చేరి ఆదిత్య ఠాక్రే సీనియర్ అయిన సీఎం ఫడ్నవిస్ వద్ద పాఠాలు నేర్చుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. 1989లో శివసేన బీజేపీల తరఫున బాల్ ఠాక్రే, ఎల్కే అద్వానీల మధ్య పొత్తు కుదిరినప్పుడు.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని స్థూలంగా ఒక అంగీకారానికి వచ్చారు. అయితే, 2009 నుంచి పరిస్థితి మారుతూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో గెలుస్తూ వస్తోంది. 2014 శాసనసభ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసిన బీజేపీ, శివసేనలు వరుసగా 122, 63 సీట్లు గెల్చాయి. త్వరలో∙బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ నేత జీవీఎల్ నరసింహారావు సోమవారం స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించిందని, విపక్ష కూటమి అయిన కాంగ్రెస్(44), ఎన్సీపీ(54)లు కలిసి సాధించిన సీట్ల కన్నా తాము ఎక్కువ సీట్లలోనే గెలిచామని ఆయన వివరించారు. బుధవారం బీజేపీ చీఫ్ అమిత్ ముంబై రానుండటంతో అప్పటివరకు ఈ సస్పెన్స్ కొనసాగే అవకాశముంది. రాముడు సత్యమే మాట్లాడేవాడు.. అధికారాన్ని సమంగా పంచుకోవాలనే విషయంలో అమిత్– ఉద్ధవ్‌ల మధ్య గతంలోనే ఒక అంగీకారానికి వచ్చిన విషయంపై నిజాలు మాట్లాడాలని సంజయ్‌రౌత్ డిమాండ్ చేశారు. ‘బీజేపీ ఎప్పుడూ శ్రీరాముడిని స్మరిస్తూ ఉంటుంది. రాముడు సత్యవాక్పరిపాలకుడు. ఇప్పుడు బీజేపీ కూడా 50:50 ఫార్ములాపై నిజాలు మాట్లాడాలి’ అని రౌత్ వ్యాఖ్యానించారు. గవర్నర్‌ను కలిసిన ఇరు పార్టీల నేతలు బీజేపీ నేత, సీఎం ఫడ్నవిస్, శివసేన నాయకుడు దివాకర్ రౌతె సోమవారం రాష్ట్ర గవర్నర్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. చర్చల వివరాలు వెల్లడి కాలేదు కానీ.. అవి మర్యాదపూర్వకమైనవేనని రాజ్‌భవన్ అధికారులు చెప్పారు. అక్టోబర్ 21న జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి 105, శివసేనకు 56 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. శివసేనకు కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతు! ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు కాంగ్రెస్, ఎన్సీపీలు మద్దతివ్వనున్నాయని ముంబై వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ సమీకరణాలు నిజమైతే.. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు.. మొత్తం 154 సీట్లతో 288 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ సులభంగానే లభిస్తుంది. శివసేన నుంచి ప్రతిపాదన వస్తే దానిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలాసాహెబ్ వ్యాఖ్యానించారు. సామ్నాలో బీజేపీపై విమర్శలు సోమవారం శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం కూడా బీజేపీపై నిప్పులు చెరిగింది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్థిక విధానాల వల్లనే ఆర్థికమాంద్యం పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించింది. దీపావళి సమయంలో మార్కెట్లలో స్తబ్దత నెలకొనడంపై స్పందిస్తూ.. ‘ఇత్నా సన్నాటా క్యోం హై భాయి(ఇంత నిశ్శబ్దం ఎందుకు సోదరా?)’ అనే షోలే సినిమా డైలాగ్‌ను ఉటంకించింది. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి నిర్ణయాల వల్లనే ఈ పరిస్థితి నెలకొందనే కథనాలు వినిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. ‘అమ్మకాలు తగ్గిపోయాయి. కొన్ని పరిశ్రమలు మూత పడ్డాయి. ఉద్యోగాలు పోతున్నాయి. దీపావళి సమయంలోనే మార్కెట్లలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. మరోవైపు, పలు విదేశీ కంపెనీలు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై విపరీతంగా అమ్మకాలు జరిపి మన డబ్బుల్తో తమ ఖజానాలను నింపుకుంటున్నాయి’ అని పేర్కొంది. -
రాసిస్తేనే మద్దతిస్తాం..
సాక్షి ముంబై: మరాఠా రాజకీయం వేడెక్కుతోంది. సంకీర్ణంలో పదవుల పంపకంపై శివసేన పట్టు బిగించింది. ముఖ్యమంత్రి పదవి ఆదిత్య ఠాక్రేకు ఇవ్వడంతోపాటు మంత్రి పదవుల్లో సమాన వాటా కల్పిస్తామంటూ లిఖిత పూర్వక హామీ ఇవ్వాలంటూ బీజేపీపై ఒత్తిడి తెస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో శనివారం తన నివాసం మాతోశ్రీలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే భేటీ అయ్యారు. సమావేశం అనంతరం శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మా పార్టీ ఎమ్మెల్యేలంతా రెండున్నరేళ్లు ముఖ్యమంత్రితోపాటు ఇతర మంత్రి పదవుల్లో సమాన వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, యువసేన చీఫ్, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే(29)కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో లిఖిత పూర్వకంగా బీజేపీ హామీ ఇచ్చేదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని తెలిపారు’అని వెల్లడించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే సమాన వాటా ఇస్తామంటూ లోక్‌సభ ఎన్నికల సమయంలో ఉద్ధవ్ ఠాక్రేకు ఇచ్చిన హామీని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నెరవేర్చాల్సిందేనని పట్టుబట్టారన్నారు. బీజేపీ, శివసేన హిందుత్వకు కట్టుబడి ఉన్నాయని, అందుకే ప్రత్యామ్నాయాలున్నా వాటిపై ఆసక్తి లేదని ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారని సర్నాయక్ తెలిపారు. సీఎం పదవి మాదే: బీజేపీ ఇన్చార్జి సరోజ్ పాండే మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పీఠం తమ పార్టీదేనని బీజేపీ మహారాష్ట్ర ఇన్చార్జి సరోజ్ పాండే స్పష్టం చేశారు. మహారాష్ట్రలో బీజేపీ ఊహించిన దానికంటే 17 సీట్లు తగ్గినా 105 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. మిత్రపక్షమైన శివసేనకు కూడా ఏడు సీట్లు తగ్గి, 56 సీట్లు గెలుచుకుందని తెలిపారు. దీపావళి తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై ఉద్ధవ్‌తో సీఎం ఫడ్నవిస్ చర్చలు జరుపుతారని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రావుసాహెచ్ దన్వే వెల్లడించారు. బీజేపీ ఎమ్మెల్యేలంతా ఈ నెల 30న సమావేశమై శాసనసభా పక్షం నేతను ఎన్నుకోనున్నారు. సీఎం ఫడ్నవిస్ స్వతంత్రులు, చిన్న పార్టీలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మేం ప్రతిపక్షంలోనే: పవార్ ప్రభుత్వం ఏర్పాటులో శివసేనకు ఎన్సీపీ మద్దతిస్తుందంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. ‘మేం ప్రతిపక్షంలో ఉండాలని ప్రజలు తీర్పునిచ్చారు. ఆ తీర్పును పాటిస్తాం’అని పేర్కొన్నారు. ‘ప్రతిపక్షంగా ఉండాలనే ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ప్రజాతీర్పు బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవ్వాలనుకుంటే శివసేననే ముందుగా స్పందించాలి’అని కాంగ్రెస్ సీనియర్ నేత విజయ్ వడెత్తివార్ అన్నారు. మహారాష్ట్రలో బీజేపీని అధికా రం నుంచి తప్పించేందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తామని మాజీ సీఎంలు చవాన్, పృథ్వీరాజ్ తెలిపారు. -
బీజేపీకి ఝలక్.. వద్దంటే వదిలేయండి!
సాక్షి, ముంబై : ‘సంకీర్ణ ప్రభుత్వంలో ఉంటారో వెళ్తారో తేల్చుకోండి’ అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ విసిరిన సవాలుకు మిత్రపక్షం శివసేన ఘాటుగా బదులిచ్చింది. ‘మాతో పొత్తు వద్దనుకుంటే నిరభ్యంతరంగా వదిలేయండి’ అని సేన తన అధికారిక పత్రిక ‘సామ్నా’లో పేర్కొంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోపే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న వార్తల నేపథ్యంలో బీజేపీ-సేన మైత్రికి తెరపడే అవకాశాలున్నట్లు ఊహాగానలు వినిపిస్తున్నాయి. వాటికి తగ్గట్లే నేతల విమర్శలు కూడా శృతిమించాయి. త్వరలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ? : గతవారం ఓ కార్యక్రమంలో సీఎం ఫడ్నవిస్ మాట్లాడుతూ.. భాగస్వామిగా ఉంటూ ప్రభుత్వ నిర్ణయాలపై ఎడతెగని విమర్శలు గుప్పించడం శివసేనకు తగదని, సంకీర్ణప్రభుత్వంలో ఉండాలో బయటికి వెళ్లాలో ఉద్దవ్ ఠాక్రే నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. అంతకుముందోసారి.. శీతాకాల సమావేశాల్లోపే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగొచ్చని సీఎం అన్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం, ఇటీవలే కాంగ్రెస్ నుంచి బయటికొచ్చిన నారాయణ రాణేకు ఫడ్నవిస్ తన కేబినెట్లో చోటు కల్పించబోతున్నట్లు సమాచారం. బీజేపీ మా సైద్ధాంతిక శత్రువు : సందర్భం చిక్కినప్పుడల్లా బీజేపీపైనా, ప్రధాని మోదీపైనా సెటైర్లు వేస్తోన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్.. సోమవారం కూడా అదేపని చేశారు. శివసేనకు బీజేపీ సైద్ధాంతిక శత్రువని, కేవలం ప్రభుత్వం నడవటం కోసమే తాము మద్దతు ఇచ్చామని అన్నారు. అంతకుముందు ఆయన.. మోదీ ప్రభ తగ్గిపోయిందని, రాహుల్ గాంధీయే దేశాన్ని నడిపించగల నాయకుడని చేసిన వ్యాఖ్యలు సేన-బీజేపీల మధ్య చిచ్చుకు కారణమయ్యాయి. రౌత్‌కు కౌంటర్‌గా సీఎం ఫడ్నవిస్ సవాలు చేస్తే, ఇప్పుడు ఫడ్నవిస్‌కు సేన ఘాటు సమాధానమిచ్చింది. -
విడిగా పోటీ.. సీఎం హీరో అయ్యారు!
ముంబై: మహారాష్ట్రలో జరిగిన 10 మునిసిపల్ కార్పొరేషన్లు, 25 జిల్లా పరిషత్ ఎన్నికల్లో అధికార బీజేపీ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించడంతో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రతిష్ట మరో స్థాయికి చేరింది. ఈ స్థానిక ఎన్నికల ఫలితాలతో బీజేపీలో ఫడ్నవీస్ మార్క్ రాజకీయంతో హీరో అయ్యారు. కీలకమైన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) లో బీజేపీ తన స్థానాలను ఘననీయంగా పెంచుకోవడంతో పాటు శివసేనకు కంచుకోటగా ఉన్న కార్పొరేషన్లో వారి జోరుకు బ్రేకులు వేయగలిగింది. బీఎంసీలో మొత్తం 227 స్థానాలకుగానూ శివసేన 84 సీట్లు, బీజేపీ 82 స్థానాలు నెగ్గాయి. కాంగ్రెస్ 31, ఎన్సీపీ 9 సీట్లు, ఎంఎన్ఎస్ 7, మజ్లిస్ పార్టీ 3 స్థానాలు దక్కించుకోగా, ఇండిపెండెంట్లు 11 స్థానాలు దక్కించుకున్నారు. గతంలో 31 స్థానాలున్న బీజేపీ ఈసారి శివసేనతో పొత్తులేకుండా విడిగా బరిలో నిలిచి మరో 51 స్థానాలు అదనంగా సాధించుకుంది. రాష్ట్రంలో ఎలాంటి వివాదాలలో చిక్కుకోకుండా క్లీన్ ఇమేజ్ తో ఉన్న ఫడ్నవీస్ ముందుండి పార్టీని నడిపించడంతో బీజేపీ అధిష్టానంతో మంచి మార్కులు కొట్టేశారు. కార్పొనేషన్ ఎన్నికల్లో బీజేపీని దెబ్బకొట్టి రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు తీసుకురావాలని భావించిన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు ఈ ఫలితాలు మింగుడు పడటం లేదు. బీజేపీ నోటిస్ పిరియడ్ లో ఉందని, శివసేన మద్ధతు లేకపోతే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉండదని వ్యాఖ్యానించిన ఉద్ధవ్ ఈ ఫలితాలతో కాస్త వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉంది. తమ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ కూలిపోదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తానే సీఎం పీఠంలో కొనసాగుతానని చెప్పిన ఫడ్నవీస్ ధైర్యంగా శివసేన ఎత్తులకు పై ఎత్తులు వేసి బీజేపీకి విజయాన్ని చేకూర్చారు. బీఎంసీ సహా 8 కార్పొరేషన్లలో కమలం పార్టీ సత్తా చాటింది. బీఎంసీలో శివసేన, బీజేపీలకు మ్యాజిక్ ఫిజిక్ 114 స్థానాలు రాలేదు. అయితే వలసలపై ఆ పార్టీలు దృష్టిపెడతాయా లేక కూటమిగా కొనసాగుతాయా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఎంసీ ఎన్నికల్లో విఖ్ రోలీ కార్పొరేటర్ స్నెహల్ మోరె, దిండోషి నుంచి గెలిచిన తలసీదాస్ షిండేలు శివసేనలో చేరిపోయారు.