గవర్నర్ కోషియారిని కలసిన బీజేపీ నాయకులు
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు డెడ్‌లైన్ ముంచుకొస్తోంది. అయినా ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ఫలితాలు విడుదలైన దగ్గర్నుంచి చెరో రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలని డిమాండ్ చేస్తున్న శివసేన పట్టిన పట్టు వీడడం లేదు. రొటేషన్ పద్ధతిలో సీఎం పదవిని పంచుకోవడానికి సిద్ధపడితే బీజేపీతో ఎప్పుడైనా చర్చలకు సిద్ధమేనని శివసేన ప్రకటించింది. 105 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి 182 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని విస్తృతంగా ప్రచారం జరగడంతో శివసేనలో చీలికలు వస్తాయన్న ఆందోళన మొదలైంది.
అందుకే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమై గంటకు పైగా చర్చలు జరిపారు. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే సర్వాధికారాలు పార్టీ అధినేతకే కట్టబెడుతూ ఎమ్మెల్యేలందరూ తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు చేజారిపోకుండా వారిని అధ్యక్షుడు నివాసమైన మాతోశ్రీకి సమీపంలోని ఫైవ్ స్టార్ హోటల్‌కి తరలించారు.
బ్లాక్‌మెయిల్ రాజకీయాలు పనిచేయవు
శివసేనలో చీలికలు రావడం ఖాయమని 25 మందికిపైగా సేన ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతూ ఉండడంతో ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ కమలదళంపై కస్సుమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి బ్లాక్‌మెయిల్ రాజకీయాల్ని పనిచేయవని అన్నారు.
గవర్నర్‌తో బీజేపీ చర్చలు
బీజేపీ సీనియర్ నాయకులు గురువారం గవర్నర్ భగత్ సింగ్ కొషియారిని కలుసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతూ ఉండడంతో ఎదురయ్యే న్యాయపరమైన అడ్డంకులపై గవర్నర్‌తో చర్చించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, మంత్రులు సుధీర్ ముంగంటివార్, గిరీష్ మహాజన్ తదితరులు గవర్నర్‌ని కలిసిన వారిలో ఉన్నారు. అసెంబ్లీ గడువు ముగిసేలోగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోతే అతిపెద్ద పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించాల్సి ఉంటుందని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. కాగా, ముఖ్యమంత్రి రేసులో తాను లేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్‌నే ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్నారని తెలిపారు.
ఏం జరిగే అవకాశాలున్నాయ్ !
ప్రస్తుత మహారాష్ట్ర అసెంబ్లీ గడువు శనివారంతో ముగియనుంది. ఈ లోపల ప్రభుత్వ ఏర్పాటుపై ఏదో ఒక స్పష్టత రావాలి. లేదంటే జరిగే పరిణామాలు ఏవంటే..
► ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరైనా ముందుకు వచ్చే వరకు దేవేంద్ర ఫడ్నవీస్‌నే సీఎంగా కొనసాగాలని గవర్నర్ ఆదేశించే అవకాశం.
► మహారాష్ట్ర గవర్నర్‌ని బీజేపీ ఎమ్మెల్యేల బృందం కలిసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం. సభలో బల నిరూపణకు గవర్నర్ సమయాన్ని ఇవ్వడం.
► బీజేపీయేతర పక్షాలన్నీ చేతులు కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ని కోరడం.
► మెజార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధించడం.
Comments
Please login to add a commentAdd a comment