మీడియాతో మాట్లాడుతున్న ఉద్ధవ్. పక్కన ఆదిత్య
ముంబై: మహారాష్ట్రలో కనుచూపు మేరలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు సాధ్యంకాని నేపథ్యంలో ఆ రాష్ట్ర కొత్త అసెంబ్లీ సుప్తచేతనావస్థలోకి వెళ్లనుంది. ఆ రాష్ట్ర అసెంబ్లీని గవర్నర్ తొలిసారి సమావేశపర్చేవరకూ 14వ అసెంబ్లీ సుప్తచేతనా వస్థలోనే ఉంటుందని అసెంబ్లీ వ్యవహరాల మాజీ అధికారి ఒకరు తెలిపారు. మహారాష్ట్ర 13వ అసెంబ్లీ పదవీకాలం శనివారం రాత్రితో ముగిసింది. అయితే బీజేపీ, శివసేనల మధ్య ఎలాంటి సయోధ్య కుదరకపోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది.
అధికార వర్గాల సమాచారం ప్రకారం.. గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని అడ్వకేట్ జనరల్ అశుతోష్ కుంభకోణి శనివారం రాజ్‌భవన్‌లో కలిసి ఈ అంశంపై చర్చించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మెజార్టీ సాధించినా ముఖ్యమంత్రి పదవి విషయంలో రెండు పార్టీల మధ్య పీటముడి కొనసాగుతోంది. శనివారం అయోధ్య వివాదంలో సుప్రీం తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడిన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే.. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేశారు.
అసెంబ్లీని సమావేశపర్చే వరకూ అంతే..
‘కొత్త అసెంబ్లీని గవర్నర్ సమావేశపర్చనంత వరకూ మహారాష్ట్ర 14వ అసెంబ్లీ సుప్తచేతనావస్థలోకి వెళ్తుంది’అని మహారాష్ట్ర అసెంబ్లీ మాజీ ముఖ్య కార్యదర్శి అనంత కల్సే చెప్పారు. సుప్తచేతనావస్థలో ఎంత కాలం ఉంచాలన్న దానిపై నిర్దిష్ట సమయమేదీ లేదన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆ సమయంలో జీతాలు, ఇతర అలవెన్సులు అందుకుంటారన్నారు. ‘రాష్ట్రపతి పాలనే చివరి ప్రత్యామ్నాయం. కేబినెట్ సిఫార్సు లేకుండా గవర్నర్ కూడా కొత్త అసెంబ్లీని సమావేశపర్చలేరు. ప్రస్తుతం రాష్ట్రంలో కేబినెట్ లేదు’అని పేర్కొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 సీట్లకు గాను బీజేపీ 105 స్థానాలు, శివసేన 56 సీట్లు గెలుచుకోగా.. ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే.
ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించండి
ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయాలని కోరుతూ గవర్నర్ కోషియారీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, బీజేపీ శాసనసభా పక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు శనివారం లేఖ రాశారు. సీఎం పీఠం విషయంలో బీజేపీ, శివసేన మధ్య పక్షం రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ఆయన ఈ సూచన చేయడం గమనార్హం. ప్రభుత్వం ఏర్పాటుపై సానుకూలంగా స్పందించాలని ఆ లేఖలో కోరారు. ఈ పరిణామంపై ఎన్సీపీ స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే పక్షంలో శాసనసభలో తాము వ్యతిరేకంగా ఓటు వేస్తామని స్పష్టం చేసింది. శివసేన కూడా బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే అప్పుడు ప్రత్యామ్నాయం ఆలోచిస్తామని తెలిపింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు తమ ఎమ్మెల్యేలతో క్యాంపులు నడుపుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment