ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ గడువు శనివారంతో ముగుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటుపై స్పష్టత వచ్చినట్లే కనిపిస్తున్నా ఎప్పుడు ఏర్పడుతుందో చెప్పలేని పరిస్థితి. మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌తో భేటీ కావటం, బీజేపీ– సేన తెరవెనుక చర్చలు, గురువారం బీజేపీ నేతలు గవర్నర్ భగత్‌సింగ్ కోషియారిని కలవనుండటం ఇవన్నీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టతనిచ్చాయి. కానీ గవర్నరును కలిసే బీజేపీ నేతల్లో ఫడ్నవీస్ లేరు.
బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ నేతృత్వంలో గవర్నర్‌ను కలవనున్నట్లు పార్టీ సీనియర్ నేత సుధీర్ ముంగంటివార్ చెప్పారు. పలు అంశాలను చర్చించడానికే తప్ప ప్రభుత్వ ఏర్పాటుపై మాట్లాడటానికి కాదని కూడా చెప్పారాయన. గవర్నరును కలవటంపై తమకు ఆహ్వానంలేదని శివసేన స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో... తెరవెనక పరిణామాలు చాలానే జరుగుతున్నట్లు తెలిసింది. వాటిలో గడ్కరీని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలనే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం.
మహా పీఠంపై గడ్కరీ?
మంగళవారం రాత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌ను కలిశారు. ప్రతిష్టంభన తొలగాలంటే గడ్కరీని సీఎంను చేయడమే పరిష్కారమని ఆరెస్సెస్ చీఫ్ భావిస్తున్నారనేది రాజకీయ వర్గాల సమాచారం. దీనికి శివసేన తేలిగ్గా అంగీకరిస్తుందన్న అంచనాలున్నాయి. ఎందుకంటే ఆది నుంచీ శివసేనతో గడ్కరీకి మంచి సంబంధాలే ఉన్నాయి. దివంగత అధ్యక్షుడు బాల్ థాకరేకు గడ్కరీ అత్యంత సన్నిహితుడు. థాకరే జీవించి ఉన్న రోజుల్లో గడ్కరీ ఆయన నివాసం మాతోశ్రీకి తరచూ వెళ్లేవారు.
బీజేపీ – సేన మధ్య ఎప్పుడు విభేదాలొచ్చినా గడ్కరీయే మధ్యవర్తిత్వం నెరిపి పరిష్కరించేవారు. గడ్కరీని సీఎంను చేస్తే శివసేన 50–50 ఫార్ములాపై పట్టు వీడవచ్చని బీజేపీ అంచనా వేస్తోంది. కాకపోతే ఇప్పటికే ఫడ్నవీస్‌ను తమ శాసనసభా పక్ష నేతగా మహారాష్ట్ర బీజేపీ ఎన్నుకుంది. సీఎంగా ఆయనే ఉంటారని బీజేపీ స్పష్టంగా చెప్పింది కూడా. తాజా పరిణామాల నేపథ్యంలో బుధవారం కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ నితిన్ గడ్కరీతో భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. కానీ తాను మహారాష్ట్ర రైతులకు రవాణా సౌకర్యాలపై మాట్లాడటానికే కలిశానని పటేల్ చెప్పారు.
నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటాం: పవార్
ప్రజా తీర్పును గౌరవించి మహారాష్ట్రలో వెంటనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ, శివసేనలకు శరద్ పవార్ స్పష్టం చేశారు. ఎన్సీపీ–కాంగ్రెస్ కూటమి బాధ్యతాయుత ప్రతిపక్ష పాత్రను పోషిస్తుందని చెప్పారాయన. శివసేన నేత సంజయ్ రౌత్ తనను కలిశాక పవార్ విలేకరులతో మాట్లాడారు. బీజేపీ, శివసేన బంధం 25 ఏళ్లుగా ఉందని, ఆ రెండు పార్టీలే రేపో మాపో ఒక అవగాహనకు వస్తాయని చెప్పారాయన. 170 మంది ఎమ్మెల్యేల మద్దతుతో శివసేన సీఎం పదవిని చేపట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై పవార్ ఆశ్యర్యం వ్యక్తం చేశారు. అంత మంది ఎమ్మెల్యేను శివసేన ఎలా తెస్తుందో చూడాలని ఆసక్తి ఉందన్నారు.
సోనియా వద్దనడంతో..!
50–50 ఫార్ములాపై గట్టిగా కూర్చున్న శివసేన ఒక దశలో ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్‌ను సంప్రతించి బీజేపీ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేసింది. కాకపోతే శివసేన–ఎన్‌సీపీ కలిసినంత మాత్రాన ఏమీ జరగదు. కాంగ్రెస్ సహకరించాలి. అందుకే పవార్ వెళ్లి సోనియాను కలిసి శివసేనకు మద్దతిచ్చేలా ఒప్పించబోయారని తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు కర్ణాటక ఉదంతం చూసిన సోనియా... సేనకు మద్దతిచ్చి బీజేపీకి అధికారాన్ని దూరంచేస్తే కర్ణాటకలో జరిగినట్లు తమ ఎమ్మెల్యేల్ని లాగేస్తారని సందేహపడ్డారు. దీనికితోడు బీజేపీ హిందూత్వ విధానాల్ని సేనను నమ్మితే ముస్లిం ఓట్లు దూరమవుతాయని సోనియా భయపడ్డారు. మొదటికే మోసం వచ్చి అది కూడా బీజేపీకి కలిసివస్తుందని కూడా ఆమె భావించారు. అందుకే ఈ ప్రతిపాదనకు సుతరామూ అంగీకరించలేదు. వేరే దారిలేని శివసేన బీజేపీతో ముందుకెళ్లేందుకు సిద్ధపడుతోంది. ఇక పవార్ కూడా తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని గట్టిగా చెప్పేశారు.
Comments
Please login to add a commentAdd a comment