శివసేన చీఫ్ ఉద్ధవ్, మహా సీఎం ఫడ్నవిస్ (ఫైల్ ఫొటో)
సాక్షి, ముంబై : ‘సంకీర్ణ ప్రభుత్వంలో ఉంటారో వెళ్తారో తేల్చుకోండి’ అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ విసిరిన సవాలుకు మిత్రపక్షం శివసేన ఘాటుగా బదులిచ్చింది. ‘మాతో పొత్తు వద్దనుకుంటే నిరభ్యంతరంగా వదిలేయండి’ అని సేన తన అధికారిక పత్రిక ‘సామ్నా’లో పేర్కొంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోపే కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందన్న వార్తల నేపథ్యంలో బీజేపీ-సేన మైత్రికి తెరపడే అవకాశాలున్నట్లు ఊహాగానలు వినిపిస్తున్నాయి. వాటికి తగ్గట్లే నేతల విమర్శలు కూడా శృతిమించాయి.
త్వరలో కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ? : గతవారం ఓ కార్యక్రమంలో సీఎం ఫడ్నవిస్ మాట్లాడుతూ.. భాగస్వామిగా ఉంటూ ప్రభుత్వ నిర్ణయాలపై ఎడతెగని విమర్శలు గుప్పించడం శివసేనకు తగదని, సంకీర్ణప్రభుత్వంలో ఉండాలో బయటికి వెళ్లాలో ఉద్దవ్ ఠాక్రే నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. అంతకుముందోసారి.. శీతాకాల సమావేశాల్లోపే కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ జరగొచ్చని సీఎం అన్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం, ఇటీవలే కాంగ్రెస్ నుంచి బయటికొచ్చిన నారాయణ రాణేకు ఫడ్నవిస్ తన కేబినెట్‌లో చోటు కల్పించబోతున్నట్లు సమాచారం.
బీజేపీ మా సైద్ధాంతిక శత్రువు : సందర్భం చిక్కినప్పుడల్లా బీజేపీపైనా, ప్రధాని మోదీపైనా సెటైర్లు వేస్తోన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్.. సోమవారం కూడా అదేపని చేశారు. శివసేనకు బీజేపీ సైద్ధాంతిక శత్రువని, కేవలం ప్రభుత్వం నడవటం కోసమే తాము మద్దతు ఇచ్చామని అన్నారు. అంతకుముందు ఆయన.. మోదీ ప్రభ తగ్గిపోయిందని, రాహుల్ గాంధీయే దేశాన్ని నడిపించగల నాయకుడని చేసిన వ్యాఖ్యలు సేన-బీజేపీల మధ్య చిచ్చుకు కారణమయ్యాయి. రౌత్‌కు కౌంటర్‌గా సీఎం ఫడ్నవిస్ సవాలు చేస్తే, ఇప్పుడు ఫడ్నవిస్‌కు సేన ఘాటు సమాధానమిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment