
చిన్న గొడవ చిలికి చిలికి గాలి వాన అయ్యింది. ఏకంగా వెంట పడి ఆయన తల పగలకొట్టేంత..
ముంబై: బీజేపీ మద్దతుతో శివసేన చీలిక వర్గం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సంగతి విదితమే. అయితే.. ప్రత్యర్థి పక్షంగా ఉన్న రోజుల నుంచి ఈ రెండు వర్గాల నడుమ కొనసాగుతున్న వైరం.. మంత్రి వర్గ విస్తరణ సమయంలో ఉవ్వెత్తున పైకి లేచి.. ఇప్పుడు తారాస్థాయిలో కొనసాగుతోంది. అదీ నియోజకవర్గాల వారీగా కావడం గమనార్హం. తాజాగా షిండే వర్గం మిత్రపక్ష నేతపైనే దాడికి పాల్పడింది.
మిత్ర పక్షాల నడుమ పోరు మంచిది కాదని, ఐక్యతతో ముందుకు సాగాలని ఇటు సీఎం షిండే, అటు డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ ఇస్తున్న పిలుపు ఆయా పార్టీల నేతలకు, కార్యకర్తలకు చెవికెక్కడం లేదు. థానేలో బీజేపీ ఆఫీస్ బేరర్‌గా వ్యవహరిస్తున్న ప్రశాంత్ జాదవ్‌కు, షిండే వర్గీయులకు గొడవ జరిగింది. గురువారం వాగ్లే ఎస్టేట్‌లోని పరబ్‌వాడీ దగ్గర బ్యానర్లు, ఫ్లకార్డులు ఏర్పాటు విషయంలో వివాదం మొదలైంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. ఇరు వర్గాలను హెచ్చరించి పంపించారు.
అయితే శుక్రవారం సాయంత్రం ప్రశాంత్ జాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని షిండే వర్గీయులకు దాడికి దిగారు. పదిహేను నుంచి ఇరవై మంది దాకా ఆయన్ని చితకబాదారు. ఈ దాడిలో తల పగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం!. ఆపై ఈ గొడవపై ఆ పంచాయితీ పోలీస్ స్టేషన్‌కి చేరింది. ఇరు పక్షాలు ఎవరికి వాళ్లు అవతలి వాళ్ల మీదే నిందలు వేయడం ప్రారంభించారు.
हल्लेखोरांवर तात्काळ कारवाई करा @ThaneCityPolice
— Chitra Kishor Wagh (@ChitraKWagh) December 30, 2022
असले नीच कृत्य करणाऱ्यांचा तिव्र निषेध@CMOMaharashtra @Dev_Fadnavis https://t.co/JfciHraaem
మరోవైపు పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోలేదని స్టేషన్ బయట బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. దీంతో మరోసారి గొడవ జరుగుతుందేమోనన్న పరిస్థితులు కొనసాగుతున్నాయి అక్కడ. ఇక ఈ ఘర్షణలపై బీజేపీ మహిళా మోర్చా పరోక్షంగా ఓ ట్వీట్ చేసింది. దోస్తీకి దోస్తీ.. దెబ్బకు దెబ్బ.. రక్తానికి రక్తం అంటూ ట్వీట్‌లో పేర్కొంది. పరిస్థితి చల్లార్చేందుకు ఇరు పార్టీలు కీలక నేతలను థానేకు పంపనున్నట్లు సమాచారం.