అమిత్‌కు విద్యార్థి సేన పగ్గాలు! | Amit Thackeray To Head Student Wing Of MNS | Sakshi
Sakshi News home page

అమిత్‌కు విద్యార్థి సేన పగ్గాలు!

Published Tue, Jul 20 2021 12:13 AM | Last Updated on Tue, Jul 20 2021 12:13 AM

Amit Thackeray To Head Student Wing Of MNS - Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (ఎమ్మెన్నెస్‌)కు అనుబంధంగా ఉన్న విద్యార్థి సేన అధ్యక్షుడిగా అమిత్‌ ఠాక్రేకు నియమించనున్నారని తెలిసింది. ఇదివరకు విద్యార్థి సేన అధ్యక్ష పదవిలో కొనసాగిన ఆదిత్య శిరోడ్కర్‌ ఎమ్మెన్నెస్‌ నుంచి బయటపడి శివసేనలో చేరారు. దీంతో ఖాళీ అయిన ఆ పదవిలో పార్టీ చీఫ్‌ రాజ్‌ఠాక్రే తనయుడు అమిత్‌ ఠాక్రేను నియమించేందుకు ఆ పార్టీ పదాధికారులు, కార్యకర్తలు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆ పార్టీలో పలువురు సీనియర్‌ల పేర్లు రేసులో ఉన్నప్పటికీ అమిత్‌ ఠాక్రేను నియమించాలనే డిమాండ్‌ తెరమీదకు వచ్చింది. దీంతో ఈ పదవీ బాధ్యతలు ఎవరికి కట్టబెడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.  

నాసిక్‌లో చర్చలు.. 
ఎమ్మెన్నెస్‌ ప్రధాన కార్యదర్శి, విద్యార్థి సేన అధ్యక్షుడు ఆదిత్య శిరోడ్కర్‌ ఇటీవల ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సమక్షంలో శివసేనలో చేరారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఆదిత్య అకస్మాత్తుగా శివసేనలో చేరడం వల్ల ఎమ్మెన్నెస్‌కు గట్టి దెబ్బ తగిలినట్‌లైంది. వచ్చే సంవత్సరం బీఎంసీ ఎన్నికలు, భవిష్యత్తులో అసెంబ్లీ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఆదిత్య ఇలా అకస్మాత్తుగా పార్టీని విడటం రాజ్‌ ఠాక్రేతోపాటు ఆ పార్టీ సీనియర్‌ నాయకులు, పదాధికారులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.

ప్రస్తుతం రాజ్‌ఠాక్రే నాసిక్‌ పర్యటనలో ఉన్నారు. దీంతో ఆ పదవిలో ఎవరిని నియమించాలనే దానిపై చర్చించేందుకు అమిత్‌తోపాటు పలువురు సీనియర్‌ నాయకులు వెంటనే నాసిక్‌కు రావాలని సందేశం పింపించారు. అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై చర్చించినట్లు తెలిసింది. ఇందులో అధిక శాతం అమిత్‌నే నియమించడానికి ఇష్టపడినట్లు తెలిసింది. ఒకవేళ ఈ పదవిలో అమిత్‌ ఠాక్రేను నియమిస్తే నేటి యువ కార్యకర్తల్లో నవ చైత్యనం నూరిపోసినట్లవుతుంది. దీంతో అమిత్‌నే నియమించాలని పదాధికారులు, కార్యకర్తలు పట్టుబడినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కాగా ఎమ్మెన్సెస్‌ సినెట్‌ సభ్యులు సుధాకర్‌ తాంబోలి, అఖిల్‌ చిత్రే, గజానన్‌ కాళే తదితర సీనియర్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. కానీ, ముందువరుసలో అమిత్‌ ఠాక్రే ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇందులో విద్యార్థి సేన అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

ప్రారంభంలో ఘనంగా.. 
అప్పట్లో శివసేన నుంచి బయటపడిన రాజ్‌ఠాక్రే సొంత పార్టీ పెట్టుకున్నారు. అన్ని వర్గాల ప్రజలను తమ పార్టీలో చేర్చుకుంటామని పేర్కొంటూ 2006 మార్చి 9వ తేదీన ఎమ్మెన్నెస్‌ పార్టీ స్థాపించారు. ప్రారంభంలో తిరుగులేని పార్టీగా ఎదిగిన ఎమ్మెన్నెస్‌ ప్రధాన పార్టీలను సైతం దెబ్బతీసింది. ఆ తరువాత జరిగిన బీఎంసీ, నాసిక్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించుకుంది. కాని కాలక్రమేణా పార్టీ ప్రతిష్ట, ప్రాబల్యం దెబ్బతినసాగింది. దీంతో కార్పొరేటర్ల సంఖ్య, ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోయింది. చివరకు పార్టీలో ఒక్కరే ఎమ్మెల్యే, ఒక్కరే కార్పొరేటర్‌ మిగిలారు. ఇది పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పార్టీ కోల్పోయిన ప్రతిష్ట, కార్యకర్తలు కోల్పోయిన మనోధైర్యాన్ని తిరిగి నింపేందుకు శత ప్రయత్నాలు చేస్తున్నారు.

అందులో భాగం గా త్వరలో ఎన్నికలు జరగనున్న కార్పొరేషన్లలో పర్యటించడం, పదాధికారులు, కార్యకర్తలతో సంప్రదించడం లాంటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అదేవిధంగా సభ్యత నమోదు పథకాన్ని సోషల్‌ మీడియా ద్వారా చేపట్టి పార్టీలో కార్యకర్తల సంఖ్య పెంచుకోవాలని, అలాగే ప్రజలకు మరిం త దగ్గరవ్వాలనే ప్రయత్నం రాజ్‌ ఠాక్రే చేస్తున్నా రని పార్టీ అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఒకవేళ విద్యార్థి సేన పగ్గాలు అమిత్‌కు దక్కితే పార్టీలో నూతనోత్తేజం రావడం ఖాయమని రాజకీయ వర్గాలో చర్చ నడుస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement