ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన ఠాక్రేల కుటుంబం నుంచి మరో వారసుడు రాజకీయాల్లోకి వచ్చారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్ ఠాక్రే జయంతి సందర్భంగా గురువారం గోరెగావ్‌లో ఎమ్మెన్నెస్ మహా సభ నిర్వహించింది. ఈ వేదికపై నుంచే ఎమ్మెన్నెస్ సీనియర్ నాయకులు అమిత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా అమిత్ మాట్లాడుతూ.. ‘పార్టీ స్థాపించిన 14 ఏళ్లలో తొలిసారిగా నేను ఓ బహిరంగసభలో మాట్లాడుతున్నాను. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంద’ని అన్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న అమిత్ తల్లి షర్మిల భావోద్వేగానికి లోనయ్యారు.
ఎమ్మెన్నెస్‌లో అమిత్‌కు ఏ బాధ్యతలు అప్పగిస్తారనేదానిపై ఆ పార్టీ నేతలు స్పష్టత ఇవ్వలేదు. అయితే ఎమ్మెన్నెస్ యూత్ వింగ్ బాధ్యతలను అమిత్‌కు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే పార్టీ జెండాలో కూడా మార్పులు చేశారు. హిందూత్వాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ఆలోచనలతో పూర్తిగా కాషాయం రంగుతో పార్టీ కొత్త జెండాను రూపొందించారు. జెండా మధ్యలో ఛత్రపతి శివాజీ కాలంనాటి రాజముద్రను చేర్చారు. ఎమ్మెన్నెస్ స్థాపించినప్పుడు.. పార్టీ జెండాను కాషాయం, నీలం, ఆకుపచ్చ రంగులతో తీర్చిదిద్దారు.
కాగా, శివసేన నుంచి బయటికొచ్చిన రాజ్ ఠాక్రే 2006లో ఎమ్మెన్నెస్‌ను స్థాపించారు. అనంతరం 2009లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో మొదటిసారి పోటీచేసిన ఎమ్మెన్నెస్.. 13 సీట్లలో గెలుపొందింది. ఆ తర్వాత పలు ఎన్నికల్లో ఆ పార్టీ పోటీచేసిన కూడా అశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 122 స్థానాల్లో పోటీచేసిన ఎమ్మెన్నెస్.. ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందడం ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే పార్టీలో పలు మార్పులు చేయాలని ఆలోచనకు వచ్చారు.
మరోవైపు ఠాక్రేల కుటుంబం నుంచి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ఆదిత్య ఠాక్రే.. వర్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. దీంతో శివసేనకు, బీజేపీకి మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి హిందూత్వ ఎజెండాతో ముందుకెళ్లాలని ఎమ్మెన్నెస్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో రాజ్ ఠాక్రే భేటీ అయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment