ముంబై: పవా(వ)ర్ హీట్‌తో.. మహారాష్ట్ర రాజకీయం మళ్లీ వేడెక్కింది. వచ్చే పది, పదిహేను రోజుల్లో రాజకీయ కుదుపులకు హస్తినతో పాటు మహారాష్ట్ర సైతం వేదిక అవుతుందంటూ ప్రచారం మొదలైన నేపథ్యంలో.. ఏం జరగనుందా? అనే చర్చ జోరుగా అక్కడ నడుస్తోంది. ఈ తరుణంలో.. ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ హాట్ టాపిక్‌గా మారారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్.. మద్దతు ఎమ్మెల్యేలతో బీజేపీతో దోస్తీకి సిద్ధపడుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే.. అదంతా ఉత్త ప్రచారమేనని, తాను ఎన్‌సీపీతోనే ఉంటానని తాజాగా స్పష్టమైన ప్రకటన చేశారు ఆయన. అయినప్పటికీ అజిత్ పవార్ తీరుపై అనుమానాలు కొనసాగుతున్నాయి. బీజేపీతో దోస్తీ ప్రచారం అట్లాగే చర్చల్లో ఉండిపోయింది. ఈ తరుణంలో.. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకి చెందిన శివసేన వర్గం స్పందించింది.
ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ గనుక బీజేపీతో చెయ్యి కలిపితే.. తాము ప్రభుత్వ కూటమి నుంచి బయటకు వెళ్లిపోతామని షిండే వర్గం హెచ్చరించింది. ఈ మేరకు షిండే తాజాగా నియమించిన పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ శిర్సత్ మీడియాతో మాట్లాడారు.
మా సిద్ధాంతం స్పష్టంగా ఉంది. ఎన్‌సీపీ అనేది వెన్నుపోటు పార్టీ. అలాంటి పార్టీతో అంటకాగే దుస్థితిలో మేం లేం. యావత్ మహారాష్ట్ర ఈ పరిణామాన్ని ఇష్టపడదు కూడా. కాంగ్రెస్-ఎన్‌సీపీలతో కూటమిలో కొనసాగకూడదనే కదా బయటకు వచ్చేం. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీతో ఎలా జట్టు కడతాం? అని శిర్సత్ మీడియా ద్వారా తెలియజేశారు. బీజేపీతో ఎన్సీపీ నేరుగా జత కట్టే అవకాశం లేదని.. ఒకవేళ అలాంటిదే జరిగితే మాత్రం తాము ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేస్తామని శిర్సత్ సంకేతాలు పంపారు.
అజిత్ పవార్ ఎప్పటి నుంచో పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన తనయుడు పార్థా పవార్ ఓటమిని ఆయన తట్టుకోలేకపోయాడు. పైగా ఇప్పుడు ఎన్సీపీలో ఆయనకు ఫ్రీ హ్యాండ్ లేదు. ఈ పరిణామాలతోనే ఆయన ఆ పార్టీని వీడాలనుకుంటున్నారు. అజిత్ పవార్ ఎన్‌సీపీని వీడాలనే నిర్ణయాన్ని మేం స్వాగతిస్తాం. కానీ, ఎన్‌సీపీ నేతలతో గుంపుగా బీజేపీకి స్నేహ హస్తం చాచితే మాత్రం.. మేం ప్రభుత్వంలో కొనసాగబోం అని శిర్సత్ స్పష్టం చేశారు.
2019లో జరిగిన పరిణామాన్ని ఎవరూ మరిచిపోరు. ఫడ్నవిస్-అజిత్ పవార్ సాయంతో ఆఘమేఘాల మీద తెల్లవారుజామున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మూడే రోజుల్లో ఆ ప్రభుత్వం కుప్పకూలింది. దీనిపై శరద్ పవార్.. రాష్ట్రపతి పాలనను వెనక్కి తీసుకునేందుకు చేసిన ప్రయోగమంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. కానీ, అజిత్ పవార్ మాత్రం రెండున్నరేళ్లు గడిచినా నాటి పరిణామాలపై మౌనంగా ఉన్నారు అంటూ శిర్సత్ నాటి విషయాలను గుర్తు చేశారు.
ఇదీ చదవండి: బాంబే హైకోర్టులో షిండే సర్కార్‌కు ఊరట
Comments
Please login to add a commentAdd a comment