ముంబై: సంక్షోభ రాజకీయాలకు నెలవైన మహారాష్ట్రలో ముక్కోణపు పార్టీ అధికార కూటమి.. చీలికలకు గురికాకుండా జాగ్రత్త పడుతోంది. అదే సమయంలో బీజేపీ ఎత్తులను ముందుగానే అంచనా వేసిన ఎన్సీపీ(రెబల్) నేత అజిత్ పవార్.. తన వర్గానికి మంత్రివర్గంలో సుమచిత స్థానం కోసం జరిపిన లాబీయింగ్‌లో గ్రాండ్ సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. కీలక శాఖలు రెండింటిని ఆయన వర్గమే దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ ఆసక్తికరంగా మారుతున్నాయి. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ నుంచి ఆర్థిక శాఖ.. ఎన్సీపీ నేత, మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేతికి వెళ్లనుంది. ముఖ్యమైన పోర్ట్‌పోలియోలు దక్కించుకోవడంలో సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో ఎన్సీపీ రెబల్ వర్గం జరిపిన చర్చలు ఫలవంతంగా ముగిశాయి. అదే సమయంలో ఎన్సీపీ(రెబల్)కి మంత్రి వర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలనుకోవడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న బీజేపీ-షిండే వర్గ ఎమ్మెల్యేలను ఆయా అధిష్టానాలు చల్లార్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్సీపీ ఎమ్మెల్యేలతో షిండే కూటమి(శివసేన)-బీజేపీ ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్.. పోర్టుపోలియోల కేటాయింపులో బెట్టు ప్రదర్శిస్తూ వచ్చారు. కీలకమైన ఆర్థికంతో పాటు ప్రణాళిక మంత్రిత్వ శాఖల్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను బీజేపీ ఎమ్మెల్యేలు కొందరు బహిరంగంగా వ్యతిరేకించారు కూడా. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానాన్ని నేరుగా కలవకుండా.. ఎన్సీపీ(రెబల్) వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ ద్వారా హస్తిన నేతలతో చర్చలు నడిపించారు అజిత్ పవార్. ఫలితంగా.. మంత్రివర్గ విస్తరణ ఆసల్యం అవుతూ వచ్చింది. అయితే మంగళవారం అర్ధరాత్రి దాటాక కూడా సాగిన చర్చల్లో ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు బుధవారం ప్రఫుల్ పటేల్ సమస్య పరిష్కారం అయ్యిందంటూ ప్రకటించడం గమనార్హం. ఒకటి రెండు రోజుల్లో పోర్ట్‌పోలియోల కేటాయింపు జరగవచ్చని తెలుస్తోంది. ఇక జులై 18వ తేదీన ప్రధాని మోదీని తాము కలవబోతున్నామని.. ఎన్డీయే సమావేశానికి తమకూ ఆహ్వానం అందిందని ప్రఫుల్ పటేల్ తెలిపారు.
జులై 17 నుంచి ఆగస్టు 4వ తేదీల నడుమ మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈసారి సమావేశాలు ఎన్సీపీ సంక్షోభంపైనా హీటెక్కే అవకాశం లేకపోలేదు. అంచేత సమావేశాల కంటే ముందే కేబినెట్ విస్తరణ కోసం ప్రయత్నాలు నడుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment