ముంబై: గురువారం ముంబైలో జరిగిన ఓ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన అజిత్ పవార్ సీఎం ఏక్‌నాథ్ షిండే కోసం కేటాయించిన సీటులో కూర్చోవడంతో ఆయన నెక్స్ట్ టార్గెట్ అదేనంటూ సోషల్ మీడియాలో పుకార్లు చెలరేగాయి. ఈ వీడియో వైరల్ కావడంతో అజిత్ మనసులోని మాటను ఈ విధంగానైనా బయట పెట్టారంటున్నారు నెటిజనులు.
మహారాష్ట్రలో ఎన్సీపీ తిరుగుబాటు చేసిన నాటినుండి మహారాష్ట్ర రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రతి సీను క్లైమాక్సును తలపిస్తూ సాగుతున్న అక్కడి రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న కుతూహలంతో ఎదురు చూస్తున్నారు రాజకీయ ఔత్సాహికులు. ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ పార్టీలో అధమస్థాయి ప్రాధాన్యతను తట్టుకోలేక తిరుగుబాటు పర్వానికి శ్రీకారం చుట్టి బీజేపీ- శివసేన సర్కారుకు జైకొట్టి అజిత్ పవార్ ఎలాగోలా డిప్యూటీ సీఎం కుర్చీ వరకు చేరుకోగలిగారు. తర్వాతి మెట్టు కోసం అజిత్ పవార్‌లో కోరిక లేకపోయినప్పటికీ ఆయన చేతల్లో మాత్రం ఆ కుతూహలం బయటపడుతుంటే రాజకీయ వర్గాల్లో కొత్త అనుమానాలు మొదలవుతున్నాయి.
ప్రస్తుతం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో అజిత్ పవార్ అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అసలు ఆయన మనసులో ఏముందో గానీ ఆయన ఏమి చేసినా కూడా అది అధికారం కోసమే అన్నట్టుగా బయటకు కనిపిస్తూ ఉండడడం విశేషం. తాజాగా ఎమ్మెల్యే నివాసాల పునర్నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ఆయన నేరుగా వెళ్లి సీఎం ఏక్‌నాథ్ షిండే కోసం కేటాయించిన కుర్చీలో కూర్చున్నారు.
అజిత్ రాకను గమనించి స్పీకర్ నర్వేకర్ కుర్చీకి అంటించి ఉన్న సీఎం పేరున్న స్టిక్కరును తొలగించారు. మొదట అజిత్ వేరే కుర్చీలో కూర్చున్నప్పటికీ సీఎం ఆ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో ఖాళీగా ఉన్న ఆ కుర్చీలో కూర్చోమని పక్కనున్నవారు అజిత్ ను ఆహ్వానించారు. ఇదే వేదికపై ఉన్న మరో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలోనే ఈ సన్నివేశం జరగడం విశేషం. ఈ వీడియో దృశ్యాలు ఇంటర్నెట్లో మహాజోరుగా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నెటిజన్లు ఎన్సీపీ వర్గాలు అజిత్ పవార్ నెక్స్ట్ టార్గెట్ అదేనంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇది కూడా చదవండి: అమిత్ షా వ్యాఖ్యలను సమర్ధించిన మమతా
Comments
Please login to add a commentAdd a comment