సుశీల్ కుమార్ మోదీ
పట్నా: ఎన్‌డీఏతో తెగదెంపులు చేసుకున్న బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు వెన్నుపోటు రాజకీయాలు అలవాటేనని బీజేపీ ఆరోపించింది. ఆర్‌జేడీతో తాజాగా పొత్తు పెట్టుకోవడం ద్వారా బిహార్‌ను అశాంతి, అవినీతి అగాథంలోకి నితీశ్ నెట్టివేస్తున్నారని విమర్శించింది. వేగంగా మారిన సమీకరణాల నేపథ్యంలో మంగళవారం పట్నాలో బీజేపీ కోర్‌కమిటీ సమావేశమైంది.
నితీశ్ నిర్ణయాలను నిరసిస్తూ బుధవారం అన్ని జిల్లాల్లో మహాధర్నాలు చేపడతామని, బుధవారం బ్లాక్ స్థాయిలో నిరసనలకు దిగుతామని అనంతరం ఒక ప్రకటనలో తెలిపింది. నితీశ్‌కు తెలియకుండానే ఆర్‌సీపీ సింగ్‌కు కేంద్రం కేబినెట్‌లోకి తీసుకుందంటూ నితీశ్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ ట్వీట్ చేశారు. 2024లో బీజేపీ తిరుగులేని మెజారిటీ సాధించి అధికారంలోకి వస్తుందన్నారు.
నితీశ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
కనౌజ్: బిహార్‌లో బీజేపీతో బంధాన్ని తెంచుకున్నట్లు ప్రకటించిన నితీశ్ కుమార్‌ను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అభినందించారు. ‘నితీశ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. జరగబోయే మంచికి ఇది శుభసూచకం’ అని అఖిలేశ్ అన్నారు. ‘ఆనాడు స్వాతంత్య్ర సమరయోధులు ఆగస్ట్ 9న క్విట్ ఇండియా నినాదం వినిపించారు. అదే తేదీన నితీశ్ బీజేపీ భాగో( బీజేపీ నుంచి దూరంగా వెళ్దాం) అంటూ నినదించారు. బిహార్‌లో మాదిరే మిగతా రాష్ట్రాల్లోనూ రాజకీయ పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా నిలబడాలి’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment