లక్నో: ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’కి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రూపంలో మరో భారీ షాక్ తగలనున్నట్టు జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. ఇప్పటికే కూటమి నుంచి బయటకు వచ్చి.. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, పంజాబ్‌లో ఆప్ తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ రోజు మరో కీలకమైన పార్టీ జేడీ(యూ) కూడా కూటమి నుంచి వైదొలగనుందని తెలుస్తోంది.
బిహార్ సీఎం నితీష్ కుమారు దీని కోసం పావులు కదపుతున్నారని సమాచారం. దాని కోసం ఆయన ప్రస్తుత సీఎం పదవి రాజీనామా చేసి.. బీజేపీలో చేరి మళ్లీ 9వ సారి సీఎం ప్రమాణస్వీకారం చేయడానికి కసరత్తులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు.
ప్రతిపక్షాల కూటమిలో ఎవరైనా ప్రధానమంత్రి పదవికి అర్హులేనని తెలిపారు. ఇక.. కూటమిలో ఎవరినైనా ప్రధాని చేయటానికి అవకాశాలు కల్పించబడతాయని పేర్కొన్నారు. అటువంటి స్వేచ్ఛ ప్రతిపక్షాల కూటమిలో ఉంటుందని చెప్పారు. నితీష్ కుమార్ ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’లో ఉంటే ప్రధానమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ లో తాను ఎప్పుడు పాల్గొంటాననే విషయాన్ని సరైన సమయలో వెల్లడిస్తానని అన్నారు.
నితీష్ కుమార్ యూ టర్న్ తీసుకొని బీజేపీతో చేతులు కలుపుతున్నారన్న వార్తలపై అఖిలేష్ యాదవ్ చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటగా నితీష్ కుమార్ చొరవ తీసుకొని మరీ ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఆయన కూటమి నుంచి వైదొలగకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇక ఆయన కూటమిలోనే ఉంటే ప్రధాని అవుతారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment