
ఉమ్మడిగా కొత్త శిఖరాలు
భారత్, చైనాలు పేదరికాన్ని రూపుమాపితే ప్రపంచానికి మేలు: మోదీ
షాంఘైలో గాంధేయ, భారతీయ అధ్యయన కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని
ఉగ్రవాదం, భూతాపం సవాళ్లకు గాంధీ బోధనల్లో పరిష్కారాలు ఉన్నాయి
ఏడాదిగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నా
ఏటా ఐదుగురు చైనీయులు భారత్‌లో పర్యటించేలా భారతీయులు చూడాలి
షాంఘైలో భారతీయులతో సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ పిలుపు
చైనాలో ముగిసిన మోదీ పర్యటన.. మంగోలియాలో పర్యటన షురూ
షాంఘై: చైనా, భారత్‌లు పేదరికాన్ని తొలగించేందుకు ఉమ్మడిగా కొత్త అభివృద్ధి శిఖరాలను అందుకోవాలని.. ప్రపంచంలోని మూడో వంతు జనాభా ఈ రెండు దేశాల్లోనే ఉన్నందున.. ఇది ప్రపంచానికి ప్రయోజనం కలిగిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాంక్షించారు. షాంఘైలోని ఫుదాన్ విశ్వవిద్యాలయంలో గాంధేయ, భారతీయ అధ్యయన కేంద్రాన్ని మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ఆయన హిందీలో ప్రసంగించారు.
భారత్, చైనాలకు చారిత్రక, నాగరిక సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచం ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు.. ఉగ్రవాదం, భూతాపం (గ్లోబల్ వార్మింగ్) సమస్యలకు పరిష్కారాలు మహాత్మా గాంధీ బోధనల్లో ఉన్నాయన్నారు. భారత్, చైనాలు ఉమ్మడిగా బుద్ధుని సిద్ధాంతాన్ని, మహాత్మా గాంధీ పరిశోధనలను మేళవించి కొత్త అభివృద్ధి శిఖరాలకు చేరటం ద్వారా.. మానవజాతి సంక్షేమానికి కట్టుబడి ఉండే ఒక వ్యవస్థను ప్రపంచానికి అందించవచ్చని పేర్కొన్నారు. అన్ని వైపుల నుంచి జ్ఞానం రావాలన్నది భారతదేశపు ప్రాథమిక సిద్ధాంతమని మోదీ చెప్పారు.
‘‘జ్ఞానానికి తూర్పు, పడమర లేవు. అది ప్రపంచవ్యాప్తం. ఎటువంటి జ్ఞానమైనా మానవజాతికి ప్రయోజనం కలిగిస్తుంది. ఫలితాల గురించి ఆలోచించకుండా పనిచేస్తూ ఉండాలని భగవద్గీత చెప్తుంది’’ అని ఆయన ఉటంకించారు. చైనా యాత్రికుడు హ్యూయన్సాంగ్ భారత పర్యటనను ప్రస్తావిస్తూ.. రెండు దేశాల చరిత్రను చూస్తే భారత్, చైనాలు రెండూ జ్ఞానం సముపార్జించాలన్న తపన ఉన్న దేశాలేనన్నారు. ఆర్థిక వ్యవస్థ ప్రాతిపదికన సంబంధాలు ప్రస్తుత పరిస్థితులకు ప్రయోజనం కలిగిస్తే.. జ్ఞానం ప్రాతిపదికన సంబంధాలు యుగాల తరబడి ప్రయోజనాన్ని ఇస్తాయని చెప్పారు.
అలుపెరుగకుండా పనిచేస్తున్నందుకే విమర్శలు:
అలుపెరుగకుండా కృషి చేస్తున్నందుకే తనపై విమర్శలు చేస్తున్నారని.. అలా పనిచేయటం నేరమైతే దానిని తాను కొనసాగిస్తానని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. తాను తరచుగా విదేశీ పర్యటనలు చేయటంపై ప్రతిపక్షాల విమర్శల పట్ల ఆయన పై విధంగా స్పందించారు. శనివారం షాంఘైలో భారతీయుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘‘మోదీ ఎన్నో దేశాలకు ఎందుకు ప్రయాణిస్తున్నారని జనం అడుగుతున్నారు... మనం తక్కువ పని చేస్తే విమర్శలు సాధారణం.. మనం నిద్రపోతుంటే విమర్శలు సాధారణం.. కానీ.. నా దురదృష్టమేమిటంటే, నేను ఎక్కువ పని చేస్తున్నందుకు విమర్శిస్తున్నారు’’ అని అన్నారు.
‘‘సరిగ్గా నిరుడు ఇదే రోజున (మే 16వ తేదీన) లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఆ రోజు నేను మూడు హామీలు ఇచ్చాను. అలుపెరుగకుండా పనిచేస్తానని, అనుభవం లేనందున నేర్చుకుంటానని, దురుద్దేశంతో ఏ పొరపాటూ చేయనని చెప్పాను. ఆ మూడు హామీలనూ నేను నెరవేర్చాను. గత ఏడాదిగా నేను ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. పగలూ, రాత్రీ పనిచేశాను. నేను ఏదైనా సెలవుపై వెళ్లానా?’’ అని వ్యాఖ్యానిస్తూ.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇటీవల 56 రోజుల పాటు‘సెలవు’పై వెళ్లటాన్ని పరోక్షం గా ఎద్దేవా చేశారు. గత 30 ఏళ్లలో జరిగిన పనినంతటినీ తన తొలి ఏడాదిలోనే చేయటం ప్రారంభింనం దున ప్రపంచం తనను ఎక్కువగా నమ్ముతోందని పేర్కొన్నారు.
చైనాలో తన మూడు రోజుల పర్యటన రానున్న కాలంలో ప్రయోజనాలు కల్పించేందుకు పునాదులు వేసిందన్నారు. చైనా అధ్యక్షుడు బీజింగ్ వెలుపల ఎవరైనా విదేశీ నేతను ఆహ్వానించటం ఇదే తొలిసారి అని మోదీ పేర్కొన్నారు. ఇది 125 కోట్ల మంది భారతీయులకు లభించిన ఆహ్వానమని అభివర్ణించారు. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో తన స్నేహం ‘ప్లస్ వన్’ అని అభివర్ణించారు. ఆయనతో తనకు సన్నిహిత స్నేహం ఉందన్నారు. చైనా, భారత్‌లు భుజం భుజం కలిపి నడవాలన్నారు. చైనా ప్రజలకు భారత్ పట్ల ఆసక్తి ఉందంటూ.. చైనాలో నివసిస్తున్న భారతీయులు ప్రతియేటా ఐదుగురు చైనీయులు భారత్‌ను సందర్శించేలా ఒప్పించాలని సూచించారు. ఇది భారత్‌ను చైనా అర్థం చేసుకునేందుకు.. భారత్‌లో పర్యాటక రంగం అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుందని చెప్పారు.
షాంఘైలో మోదీకి శాకాహార విందు
షాంఘైలో పాలక కమ్యూనిస్టు పార్టీ చీఫ్ హాన్ ఝెంగ్ శనివారం ప్రధాని మోదీకి మధ్యాహ్న విందు ఇచ్చారు. ఈ విందులో షాంఘైలో ప్రత్యేకమైన శాకాహార వంటకాలు, అన్నం వడ్డించినట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వికాస్‌స్వరూప్ ట్విటర్ ద్వారా తెలిపారు.
మంగోలియా చేరుకున్న మోదీ
ప్రధాని మోదీ చైనాలో మూడు రోజుల పర్యటన శనివారం ముగిసింది. ఆయన షాంఘై నుంచి నేరుగా మంగోలియా రాజధాని ఉలాన్ బటోర్ చేరుకున్నారు. ఈ దేశంలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా చరిత్ర సృష్టించారు. ఈ దేశంలో రెండు రోజులు మోదీ పర్యటించనున్నారు.