మామిడి ధరలు పుల్లన..! | Mangoes Prices Are Increased This Year | Sakshi
Sakshi News home page

మామిడి ధరలు పుల్లన..!

Published Mon, Apr 16 2018 7:35 AM | Last Updated on Tue, Oct 9 2018 4:55 PM

Mangoes Prices Are Increased This Year - Sakshi

మామిడి

విజయనగరం ఫోర్ట్‌ : మామిడి పండ్ల ధరలు పుల్లగా మారాయి. ఈ ఏడాది మామిడి పంటకు వాతావరణం అనుకూలించ లేదు. తెగుళ్లు దాడిచేయడం, పూత ఆలస్యం కావడంతో దిగుబడి అమాం తం తగ్గింది. దీంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత ఏడాది కంటే 8 నుంచి 10 రెట్లు పెరిగాయి. పండ్లవైపు చూసేందుకు సామాన్యులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. హెక్టారుకు గత ఏడాది 10 నుంచి 12 టన్నులు దిగుబడి వస్తే ఈ ఏడాది 4 టన్నులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. జిల్లాలో 46 వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. కొన్ని చెట్లకు పూతే రాలేదు. చెట్లకు అరకొరగా ఉన్న కాయలు ఇటీవల ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షాలకు నేలపాలయ్యాయి. ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు చేరుతున్న పంటకు ధర బాగుండడంతో రైతులు సంతోషపడుతున్నారు. 

పది రెట్లు పెరిగాయ్‌.. 
గత ఏడాది పణుకులు టన్ను ధర రూ.6 వేలు ఉంటే ఈ ఏడాది రూ.60 వేలు పలుకుతోంది. సువర్ణరేఖ రకం గతేడాది రూ.20 వేలు ఉంటే ఈ ఏడాది రూ.80 వేలు, బంగినిబిల్లి రకం రూ.30 వేలు ఉంటే ఈ ఏడాది రూ.90 వేలు, పరియాలు రూ.2 వేలు నుంచి రూ.40 వేలకు, రసాలు గత ఏడాది రూ.30 వేలు ఉంటే ఈ ఏడాది రూ.80 వేలకు చేరింది. పండ్ల ధరలతో పాటు మామిడి తాండ్ర ధరలు సైతం అమాం తం పెరగనున్నాయి. గత ఏడాది కేజీ తాండ్ర రూ.100 నుంచి రూ.120 ఉంది. ఇప్పుడు కేజీ తాండ్ర ధర రూ.600 నుంచి 800 వరకు అయ్యే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. 

బాగా పెరిగాయి... 
గత ఏడాది కంటే ఈ ఏడాది మామిడి ధరలు బాగా పెరిగాయి. దిగుబడి తగ్గడంతోనే ఈ పరిస్థితి. ఇది రైతులకు కాస్త ఊరటగా ఉంది. తెగుళ్లు, పురుగులు, వాతావరణ మార్పుల వల్లే దిగుబడులు తగ్గాయి. 
 – పీఎన్‌వీ లక్ష్మీనారాయణ, డీడీ, ఉద్యానశాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement