మీరు భూమి సొత్తా? భూమి మీ సొత్తా?
వివేకం
మీరు పుట్టినప్పుడు, మీ శరీరం ఎంతుండేది? ఇప్పుడెంతైంది? అది పెరగడానికి ఏం చేశారు? ఆహారం ఇచ్చారు.
ఆహారం ఎక్కడి నుండి లభించింది? ఈ నేల నుండి. మీరు తిన్న ప్రతి పండు, కాయ ఈ మట్టితో, నీటితో తయారైనవే కదా! మాంసాహారి అయితే మీరు తినే మేక, కోడి కూడా ఈ మట్టిలో లభించినదాన్నే తిని పెరిగాయి. కనుక ప్రధానంగా ఈ మట్టి వల్లనే మీ శరీరం తయారైంది. అంటే ఈ శరీరానికి మట్టి చేర్చి, చివరకు దాన్ని ‘నేను’ అంటున్నారు.
ఒక పాత్రలో నీరున్నది. అదీ, మీరూ ఒకటేనా? కాదనే అంటారు. ఆ నీటిని తాగేయండి. అది మీ శరీరంలో కలిసిపోగానే, దాన్ని ఏమంటారు? ‘నేను’ అనే కదా!
అంటే ఏదైనా మీ ‘అనుభూతి’లోకి రావడాన్నే ‘మీరు’ అని భావిస్తారు. బయట ఉన్న నీరు, నేల, గాలి, వేడి.. వీటితోనే సృష్టింపబడ్డారని తెలుసా? అవి మీలో ఒక భాగమైన పిమ్మట, వాటిని వేరుచేసి చూడటం వీలు పడదు కాబట్టి, మొత్తం ‘నేను’ అంటున్నారు. అంటే కొంత ఆ మట్టి మీ రూపంలో శ్వాస వదులుతున్నది. ఇంకొంత మట్టి మీ తోటలో ఎత్తుగా ఎదిగిన చెట్టుగా ఉన్నది. మరికాస్త మట్టి మీరు కూర్చున్న కుర్చీగా మారిపోయింది. ఇదే మట్టి కాలచక్రంలో మామిడిచెట్టుగా, వేప చెట్టుగా, గడ్డిగా, పువ్వుగా, వానపాముగా, మనిషిగా పలురకాల అవతారాలను ధరిస్తోంది.
మీ ఆలోచనా విధానాన్ని బట్టి చూసినా అది నిజమే! మీరు ఊదిన బెలూన్‌లో మీ ఊపిరి గాలి దాగి ఉంది. బెలూన్ పగిలి, అది బయటికి పోగానే, మీలోని ఒక భాగం, బయటి గాలిలో కలిసిపోయినట్లే కదా! సూక్ష్మంగా చెప్పాలంటే, ఈ ప్రపంచంలో మీరొక భాగమై ఉన్నట్లే. ఈ ప్రపంచం కూడా మీలో ఒక భాగమేనని అర్థం చేసుకున్నారా? దీన్ని బుర్ర ఉపయోగించి అర్థం చేసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అంతరంగంలో అది స్ఫురిస్తే, అదే ఆధ్యాత్మికం!
అంతేకాని, ఆధ్యాత్మికం అంటే గుళ్లకు వెళ్లి టెంకాయలు కొట్టడం కాదు. కొవ్వొత్తి వెలిగించడమూ కాదు. మోకాళ్ల మీద కూర్చొని ప్రార్థించడమూ కాదు. దీన్ని అర్థం చేసుకుంటే, దేవుడి కోసం ఎదురు చూడకుండా, మీ స్వర్గాన్ని మీరే నిర్మించుకోగలరు.
ఒక యోగి మరణశయ్య మీదున్నాడు. తన శిష్యులకు తాను స్వర్గానికి పోవడానికి నిశ్చయించుకున్నట్లు తెలిపాడు.
‘‘దేవుడి మనసులో ఏముందో నాకు తెలియదు. నా మనసులో ఏముందో నాకు తెలుసు. మిగతావాళ్లు నరకం అనుకునే ప్రదేశానికి నన్ను పంపినా, దాన్ని కూడా స్వర్గంగా భావించడం నాకు తెలుసు,’’ అన్నాడా యోగి.
నిజమే! మీ అంతరంగం దేన్నైనా స్వర్గంగా మార్చవచ్చు. లేదా నరకంగా చేయవచ్చు. అది బాహ్య స్థితి వల్ల కాదు. మీరూ మీ పక్కనున్నదీ ఒకటే అని తెలుసుకోగలిగారంటే- తర్వాత ఎవరి మీద ఈర్ష్యపడతారు! అసూయ పడతారు! ఎవరితో కొట్లాడుతారు? ఎవరితో పోటీ చేస్తారు? ఎవరితో శత్రుత్వం పెంచుకుంటారు?
ఆ అనుభవం వచ్చిన పిమ్మట, బయట పరిస్థితులెలా ఉన్నా అంతరంగంలో మీకు ఎప్పుడూ స్వర్గమే!
సమస్య - పరిష్కారం
ఇలా అడుగుతున్నందుకు క్షమించండి. ఈ మధ్య అనేక మంది గురువుల గురించిన వార్తలు విన్న తరువాత ఇలా అడగాలని అనిపిస్తోంది. మీరు దేవుడిని చూశారా?
- రామాంజనేయులు, నల్గొండ
సద్గురు: ‘నేను దేవుడిని చూశానా?’ అని మీరు అడుగుతున్నారంటే, అది భూతకాలాన్ని సూచిస్తోంది. నేనెప్పుడూ దేవుడిని చూస్తూనే ఉన్నాను. నాకు దేవుడు తప్ప మరేమీ కనిపించడం లేదు. నేను దేవుడినే చూస్తున్నాను.
మీరు దేవుడని అనేది సృష్టికి మూలమైనది. అవును కదూ? మీరు ఒక జీవిని చూడదలచుకుంటే అందుకు ఎన్నో మార్గాలున్నాయి.
మీ శరీరాన్ని చూడవచ్చు. మీ మాటల ద్వారా మీ మనసుని చూడవచ్చు లేక మీలో సృష్టికి మూలంగా ఉన్న మౌలికమైనదాన్ని చూడవచ్చు.
ఈ రోజు ఉదయం మీరు దోశలు తిన్నారు. సాయంత్రం అయ్యేసరికి అది కాస్తా మనిషి శరీరంగా మారిపోయింది. అంటే సృష్టి మీలోనే పనిచేస్తోందన్న మాట. అంటే, సృష్టికి మూలం, అంటే మీరు చెప్పే సృష్టికర్త లేక మీరు చెప్పే దేవుడు మీలో నుంచే పని చేస్తున్నాడన్నమాట. దాన్ని మీరు చూడగలరా, చూడలేరా అన్నదే ఇక్కడ ప్రశ్న.
జీవితంలోని ప్రతిక్షణం, దానిని నేను నాలోనే చూడగలుగుతున్నాను. చుట్టుపక్కల ఉన్న ప్రతిదానిలోనూ చూడగలుగుతున్నాను. నేను దేవుడిని చూశానా? ఇది ఓ ప్రశ్నే కాదు. నేను ఎప్పుడూ దేవుడిని చూస్తూనే ఉన్నాను.