
మామిడిచెట్టుకు పెళ్లి
తూప్రాన్: పురుషునితో మహిళకు పెళ్లి జరుగుతుందని అందరికీ తెలుసు. కానీ, మెదక్ జిల్లా తూ ప్రాన్ మండలం వెంకటాపూర్‌లో మామిడి చెట్టు.. మరో మామిడి మొక్క వివాహ బంధంతో బుధవారం ఒక్కటయ్యాయి. మామిడితోట నాటి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని యజమాని ఈ తంతు నిర్వహించారు. పెళ్లికి కుటుంబసభ్యులతో పాటు బంధుమిత్రులనూ ఆహ్వానించాడు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతు బుచ్చిరెడ్డిగారి శ్రీకాంత్‌రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉపాధి హామీ పథకం కింద 2007-08లో 350 మామిడి మొక్కలను తన నాలుగు ఎకరాల పొలంలో నాటాడు. ప్రస్తుతం అవి మంచి దిగుబడిని ఇస్తున్నాయి. దీంతో ఆ రైతు తోట నాటి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మామిడితోటలో రెండు మామిడి చెట్లకు బ్రాహ్మణోత్తములతో వేదమంత్రాలు. బాజాభజంత్రీల మధ్య వైభవంగా వివాహం జరిపించాడు. పెద్ద మామిడిచెట్టుకు చిన్న మామిడి మొక్కనిచ్చి పెళ్లి జరిపించిన విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది.