
మామిడి రేటు పుల్లన!
పండ్ల రారాజు మామిడి సామాన్యుడికి అందనంటోంది. వేసవి ఎప్పుడొస్తుందా అని ఆత్రుతగా ఎదురు చూసిన మామిడి ప్రియులకు ఈ సీజన్‌లో మాత్రం ఊరిస్తోంది
* కొన్ని ప్రాంతాల్లో 70% తగ్గిన పంట
* పండ్ల ధర ఇంకాస్త పెరిగే అవకాశం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పండ్ల రారాజు మామిడి సామాన్యుడికి అందనంటోంది. వేసవి ఎప్పుడొస్తుందా అని ఆత్రుతగా ఎదురు చూసిన మామిడి ప్రియులకు ఈ సీజన్‌లో మాత్రం ఊరిస్తోంది. మేలు రకాలకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రస్తుతం ధర పలుకుతోంది. వివిధ దేశాల నుంచి డిమాండ్ పెరగడం కూడా దీనికి తోడైంది. దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత మామిడి అధికంగా పండేది ఆంధ్రప్రదేశ్‌లోనే. రాష్ట్రంలో ఇటీవల కొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులతో పంట దెబ్బతింది. దీంతో మామిడి రైతులకు కన్నీళ్లను తెప్పించడమేకాదు అటు సామాన్యుడికి ధరలు షాక్‌కొడుతున్నాయి.
నిషేధం ఉన్నా..
యూరోపియన్ యూనియన్ భారత్ నుంచి మామిడి పండ్ల దిగుమతిపై నిషేధం విధించింది. దీంతో మామిడి ధర అనూహ్యంగా తగ్గుతుందని అందరూ భావించారు. వాస్తవానికి ఈయూ దేశాలకు 4 వేల టన్నుల దాకా మాత్రమే ఎగుమతి అవుతోంది. మరోవైపు పంట గణనీయంగా పడిపోవడం వల్లే ధర తగ్గడం లేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. అల్ఫోన్సో మేలు రకం గతేడాది ఎగుమతి మార్కెట్లో కిలోకు రూ.150 ఉంటే, ఈ ఏడాది రూ.375 దాకా వెళ్లింది. ప్రస్తుతం ముంబై మార్కెట్లో రూ.200 దాకా ఉంది. బంగినపల్లి మేలైన ఎగుమతి రకం గతేడాది కిలోకు రూ.50 ఉంటే, నేడు రూ.150 దాకా చేరడాన్నిబట్టి చూస్తే పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకోవచ్చని హైదరాబాద్ మ్యాంగో గ్రోయర్స్ అసోసియేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్ సబీర్ పటేల్ అంటున్నారు.
నాణ్యతా తగ్గింది..
ఆంధ్రప్రదేశ్‌లో 6 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించాయని ఉద్యాన శాఖ అధికారులు అంటున్నారు. అయితే గత సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది మామిడి పంట రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో 70% దాకా తగ్గింది. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో 30% పంట తగ్గింద ని యునెటైడ్ మ్యాంగో గ్రోయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆనంద నాయుడు తెలిపారు. చిత్తూరులో అత్యధికంగా 70% పడిపోయిందని అన్నారు. మామిడి నాణ్యత కూడా పడిపోయిందని పేర్కొన్నారు. నూజివీడు ప్రాంతంలో 80% పంట తగ్గిందని తెలుస్తోంది. 50 ఎకరాల పంటకు గతేడాది రూ.25 లక్షలు తీసుకున్న ఓ రైతుకు ఈ ఏడాది దక్కింది కేవలం రూ.2 లక్షలే. మేలైన రకాలు దాదాపుగా ఎగుమతి అవుతున్నాయని, రిటైల్ మార్కెట్లో ద్వితీయ, తృతీయ శ్రేణి రకాలు లభ్యమవుతున్నాయని ఒక వ్యాపారి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ తొలి స్థానం..
2012-13లో దేశవ్యాప్తంగా 18 మిలియన్ టన్నుల మామిడి పండింది. 20% వాటాతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఉత్పాదకతలోనూ ఆంధ్రప్రదేశ్‌దే ప్రథమ స్థానం. ఇక్కడ సుమారు 2 వేల టన్నుల ఆల్ఫోన్సో పండుతోంది. ప్రపంచవ్యాప్తంగా 1,300పైగా మామిడి రకాలున్నాయి. ఇందులో భారత్‌లో 1,000 పైగా రకాలు పండుతున్నాయి. అగ్రికల్చరల్, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ(అపెడా) గణాంకాల ప్రకారం 2012-13లో భారత్ నుంచి రూ.265 కోట్ల విలువైన 55,585 టన్నుల మామిడి యూఏఈ, యూకే, బంగ్లాదేశ్, నేపాల్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ తదితర 50కిపైగా దేశాలకు ఎగుమతి అయింది. ఈయూ దిగుమతి నిషేధం నేపథ్యంలో కొత్త మార్కెట్లపై వ్యాపారులు దృష్టి పెట్టారు.
కింగ్ ఆఫ్ మ్యాంగో... సబీర్
మామిడి పండ్లలో ఆంధ్రప్రదేశ్‌లో పండేవి ఎక్కువ రుచిగా ఉంటాయని అంటున్నారు హైదరాబాద్ మ్యాంగో గ్రోయర్స్ అసోసియేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్ సబీర్ పటేల్. దిగుమతిదారులు ఎక్కువ చెల్లించైనా సరుకు తీసుకుంటారని ఆయన అంటున్నారు. ప్రభుత్వం తక్కువ వడ్డీకే రుణం ఇస్తే రైతులకు మేలు జరుగుతుందని చెబుతున్నారు. 400 పైగా మామిడి క్షేత్రాలను నిర్వహిస్తున్న సబీర్‌కు కింగ్ ఆఫ్ మ్యాంగో అనే పేరు కూడా ఉంది. మామిడి పంట వృద్ధికి కృషి చేస్తున్నందుకుగాను ఎన్నో అవార్డులు ఆయన సొంతమయ్యాయి.
నెహ్రూ, ఇందిరా గాంధీ మొదలుకుని దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వరకు ఈయన చేతుల మీదుగా మామిడి పండ్లను అందుకున్నవారే. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్, భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సోనియా గాంధీ వంటి ప్రముఖులు వీరిలో ఉన్నారు. అరుదైన మామిడి రకాలు పరసపల్ల దూదియా, ఆజముస్సమర్ వంటివి దేశంలో ఈయన మాత్రమే పండిస్తున్నారు. వీటి ధర కిలోకు రూ.500 పైమాటే. ఒకే చెట్టుకు 25కుపైగా రకాల మామిడి పండ్లను పండించడమూ ఆయనకు తెలుసు. మ్యాంగో ఇన్ ఇండియా పేరుతో ఉర్దూలో ఒక పుస్తకాన్ని సైతం రాశారు. మ్యాంగో ఫెస్టివల్స్‌ను నిర్వహిస్తూ మామిడికి ప్రాచుర్యం కల్పిస్తున్నారు.