సాక్షి, హైదరాబాద్: వేసవి కాలం వచ్చిందంటే మామిడి ప్రియులకు నోరూరిపోతుంది. తమకు ఇష్టమైన మామిడి రుచి చూసేందుకు ఉవ్విళ్లూరిపోతారు. ఈ ఏడాది మామిడి మహా ప్రియం కానుంది. సీజన్ లేట్‌గా ప్రారంభమైంది. పంట ఆలస్యం కావడం.. తక్కువ దిగుబడి రావడమే కారణం. దీంతో మామిడి ప్రియుల జేబులు ఖాళీ కానున్నాయి. ఎందుకంటే హోల్‌సేల్ మార్కెట్‌లోనే మామిడి పండ్ల ధరలు కేజీ రూ.80 నుంచి రూ.100 వరకు పలుకుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో బేనిషాన్ రకం ధర కిలో రూ.150 నుంచి రూ.180 వరకు పలుకుతోంది. దిగుబడి తగ్గడం.. పంట ఆలస్యం కావడంతో ఈ ఏడాది మామిడి ధరలు కాస్త ఎక్కువగానే ఉండొచ్చని వ్యాపారులు చెపుతున్నారు.
పుంజుకోని సీజన్..: గత ఏడాది ఫిబ్రవరి రెండో వారం నుంచే మామిడి సీజన్ ప్రారంభమై మార్చి మూడో వారానికి పుంజుకుంది. గత ఏడాది మార్చి మూడో వారం నాటికి రోజూ దాదాపు 2.5 వేల టన్నుల మామిడి గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు దిగుమతి అయింది. కానీ ఈ సీజన్‌లో రోజూ 25 టన్నులు కూడా దాటలేదు. గతంలో ప్రతి రోజు 2.5 వేల టన్నుల మామిడి వచ్చేది. ప్రస్తుతం అది 32 టన్నులకే పరిమితమైంది. రాష్ట్రంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌గా పేరొందిన గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు శుక్రవారం కేవలం 32 టన్నుల మామిడి దిగుమతి అయ్యింది. గతంలో మార్కెట్‌కు వందల సంఖ్యలో మామిడి లారీలు వచ్చేవి. అలాగే ఈ సీజన్‌లో ఇంకా మార్కెట్‌కు రకరకాల మామిడి పండ్లు రావడం లేదు.
తగ్గిన దిగుబడి.. : గత ఏడాదితో పోలిస్తే ఈసారి మామిడి దిగుబడి దారుణంగా పడిపోయింది. సకాలంలో వర్షాలు పడకపోవడం.. భూగర్భజలాలు ఇంకిపోయి బోర్లలో నీరు సరిగా రాకపోవడంతో సరైన సమయంలో కాపు రాలేదని రైతులు, మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. మామిడి పూత కూడా ఆలస్యం కావడంతో పంట చేతికి రావటానికి ఇంకా 10–15 రోజులు పట్టే అవకాశం ఉంది.
నగరానికి దిగుమతి.. ఎగుమతులు ఇవే..
బేనిషాన్, తోతాపూరి, సన్నరసాలు, పెద్ద రసాలు, హిమాయత్, చెరుకురసాలు, దసేరీ తదితర రకాల మామిడి పండ్లు గడ్డిఅన్నారం మార్కెట్‌లో లభిస్తాయి. బంగినపల్లి, తోతాç పురి మాత్రం మార్కెట్‌కు రోజూ వేల టన్నులు వస్తాయి. చిన్నరసాలు, పెద్దరసాలు, దసేరీ, హిమాయత్ రోజుకు 3 నుంచి 4 టన్నుల వరకు వస్తాయి. గడ్డి అన్నారం మార్కెట్‌కు కృష్ణా జిల్లా నూజివీడు, విజయవాడ, గుడివాడ, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, తెలంగాణలోని రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కొల్లాపూర్, నల్లగొండ, సూర్యాపేట్‌తో పాటు నగర పరిసరాల నుంచి రోజుకు వేల టన్నుల మామిడి దిగుమతి అవుతుంది. ఇక్కడి నుంచి ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు.
పూత ఆలస్యం వల్లే సీజన్ లేట్
రాష్ట్రంలో సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో మామిడి సీజన్ నెలా పదిహేను రోజులు ఆలస్యమైంది. దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగాయి. మార్చి చివరి నుంచి దిగుమతి పెరగనుంది. మార్కెట్‌లో కార్బైడ్ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నాం.
– ఈ.వెంకటేశం, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment