వడగళ్ల బీభత్సం
జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులు, వడగళ్లతోకూడిన భారీ వర్షం కురిసింది. రేగోడ్, కంగ్టి, మనూరు, అల్లాదుర్గం మండలాల్లో పెను బీభత్సం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఉదయం తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. దీంతో వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. వరి, మొక్కజొన్న, వేరుశనగ, ఉల్లి, కూరగయాల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వడగళ్ల ధాటికి రేగోడ్‌లో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
పంటలన్నీ వర్షార్పణం
అల్లాదుర్గం రూరల్: మండలంలో శనివారం అర్ధరాత్రి వడగళ్ల వాన కురిసింది. ఉల్లి, మొక్కజొన్న, జొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మండలంలోని గొల్లకుంట తండాలో విఠ్యానాయక్‌కు చెందిన లేగదూడ వడగళ్ల వానకు మృతి చెందింది. మండలంలోని వెంకట్రావుపేట, రెడ్డిపల్లి, అల్లాదుర్గం, గొల్లకుంట తండా తదితర గ్రామాలలో భారీగా వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులకు స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉన్న మరుగుదొడ్ల పైకప్పు రేకులు అల్లంతదూరంలో ఎగిరిపడ్డాయి. హాస్టల్ గదులలోకి నీరు వచ్చి చేరింది. రాత్రంతా విద్యార్థులు చీకట్లో జాగారం చేయాల్సి వచ్చింది. అదే గ్రామానికి చెందిన లక్ష్మి ఇంటి పైకప్పు రేకులు వడగళ్ల దెబ్బకు పూర్తిగా పగిలి పోయాయి. కాగా అకాల వర్షానికి పంటలు నష్టపోయిన రైతులను జిల్లా అధికారులు గుర్తించి ఆదుకోవాలని మండల రేణుకా ఎల్లమ్మ రైతు సంఘం అధ్యక్షుడు రమేష్ డిమాండ్ చేశారు.
నిండా ముంచిన వాన
రేగోడ్, న్యూస్‌లైన్: మండలంలో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. వందలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. వెంకటాపురంలో కురిసిన భారీ వడగళ్ల వానతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రోడ్డుపై భారీ వృక్షం కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వ్యవసాయ క్షేత్రాల్లో నాలుగు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. స్థానిక నర్సయ్య ఇంటిపై ఉన్న రేకులు ఎగిరిపడ్డాయి. ఇంట్లో ఉన్న వంట సామగ్రి, వరిధాన్యం, సిమెంటు బస్తాలు, ఎరువుల బస్తాలు తడిసిపోయాయి. రూ.లక్ష నష్టం జరిగినట్లు బాధితుడు నర్సయ్య తెలిపారు. 10 ఎకరాల్లో టమాటా పంట నీట మునిగింది. జొన్న 25, మొక్క జొన్న 70, వరి 25 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు. మామిడి కాయలు, చింతపండు చెట్ల నుంచి రాలిపడి తీవ్రంగా నష్టం జరిగిందన్నారు. రైతు నాగిరెడ్డికి చెందిన మూడున్నర ఎకరాల్లో మామిడి చెట్లనుంచి మామిడి కాయలు కింద రాలిపడ్డాయి. మరో నాలుగెకరాల్లో చెరకు నేలకొరిగింది. దీం తో రెండు లక్షల రూపాయలు నష్టం జరిగిందని తెలిపారు. కొండాపురంలో సైతం వడగళ్ల వర్షం కురిసింది. రైతాంగం అతలాకుతలమయ్యింది. మం డలంలో సుమారు 15 ఇళ్లు కూలిపోయాయని బాధితులు తెలిపారు. బురాన్‌వాడి తండా, రేగోడ్, మర్పల్లి, చౌదర్‌పల్లి, పోచారం, ప్యారారం, టి.లింగంపల్లి, సిందోల్, ఆర్.ఇటిక్యాల తదితర గ్రామాల్లో ఉల్లి, మొక్కజొన్న, జొన్న, కూరగాయలు, వరి పంటలు దెబ్బతిన్నాయి. రాయిలొంక తండాలో రేకులు పడి కేలీబాయి అనే మహిళ గాయపడింది. కాగా మండలంలో 48.2 వర్షపాతం నమోదు అయినట్లు ఎంఆర్‌ఐ మర్రిప్రదీప్ తెలిపారు.
అంతా అస్తవ్యస్తం
మనూరు, న్యూస్‌లైన్: మండలంలోని ఆయా గ్రామాల్లో శనివారం రాత్రి కురిసిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. మనూరులో 42.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా గ్రామాల్లోని విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పలు వృక్షాలు నేలవాలాయి. గ్రామాల్లోని ఇండ్లపై ఉన్న రేకులు ఎగిరిపడ్డాయి. గ్రామాల శివారులో గొర్రెల మందలు కలిగిన రైతులు ఆందోళనకు గురయ్యారు. పొట్‌పల్లిలో పండరికి చెందిన రెండు గొర్రెలు మృ త్యువాత పడ్డాయి. డోవూరులోని నర్సుగొండకు చెందిన రెండెకరాల చెరకు పూర్తిగా నేలకొరిగింది. ఇదే గ్రామంలో నీర్ సంగయ్యకు చెంది న ఇల్లు ధ్వంసమైంది. మనూరు ఎస్సీ వాడలోని బి.విఠల్ ఇంటిపై విద్యుత్ స్తంభం విరిగిపడింది. చేతికొచ్చిన ఉల్లిపంట వర్షం కారణంగా పూర్తిగా కుళ్లిపోయిందని రైతులు ఆవేదనతో తెలిపారు.
ఎటు చూసినా జలమయమే
కంగ్టి, న్యూస్‌లైన్: ‘మూలిగే నక్కపై తాటి పండు పడిన ’ చందంలా కురిసిన అకాల వర్షం రైతులను మరింత కుంగదీసింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో బీభత్సం సృష్టించింది. ఎక్కడ చూసినా వరద నీటితో జలమయమైంది. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. వారం నుంచి అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. మండల పరిధిలోని భీంరా, దెగుల్‌వాడి, తుర్కవడ్‌గాం, బోర్గి, చౌకాన్‌పల్లి, వాసర్, రాంతీర్థ్, సుక్కల్‌తీర్థ్, గాజుల పాడ్, ఎన్కెమూరీ, నాగూర్, సిద్ధంహంగిర్గ గ్రామా ల్లో భారీ వర్షం కురిసింది. రాంతీర్థ్, వాసర్ ఊరవాగు, వంగ్దాల్ వాగుల్లో వరద నీరు ఉధృతమై పొంగి పొర్లాయి. చేతికొచ్చిన కంది పంటను రైతులు వారం కితం కోసి చేనులో ఉంచారు. కంది పంట బాగా తడిసి ముద్దయ్యింది. పంట రాశులు చేయకముందే గింజలు ఉబ్బి మొలకెత్తుతున్నాయి. దీంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. శనగ పంట, తెల్ల కుసుమ పంటల పరిస్థితి మరి దయనీయంగా మారింది. కోసి ఉంచిన శనగపంట కుప్పలు నలుపు రంగులోకి మారి కుళ్లిపోయాయి. టమాటా, మిరప తదితర కూరగాయల పంటలు నెలకొరిగి బాగా దెబ్బతిన్నాయి. కంగ్టి పరిసర ప్రాంతాల్లో 44.06 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు మండల సహాయ గణాంకాధికారి రుస్తుం జలీల్, కంగ్టి వీఆర్‌ఓ సీహెచ్.అంజయ్య ఆదివారం తెలిపారు.మార్చి నెలలో సాధారణ వర్షపాతం కేవలం 13.0 మిల్లీమీటర్లు కాగా ఈనెల 7వ తేదీ వరకే 107 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.