కాటేసిన కరెంట్..
కాటేసిన కరెంట్..
Published Wed, Aug 30 2017 11:11 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
విద్యుదాఘాతంతో కౌలురైతు మృతి
– మరో ఇద్దరు కూలీలకు గాయాలు
– పరిస్ధితి విషమం
- అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమంటున్న రైతులు
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఓ విద్యుత్ స్తంభం కూలి పొలంలో తీగలు అడ్డంగా పడ్డాయి. దీనిపై రైతులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చినా వారు వాటిని సరిచేయడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో ఓ రైతు కూలీలతో కలసి విద్యుత్ తీగలను తొలగిస్తుండగా ప్రమాదం జరిగింది.
చిన్నబోధనం(చాగలమర్రి): చిన్నబోధనంలో విద్యుదాఘాతంతో ఓ కౌలు రైతు మృతి చెందాడు. మరో ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాయ్యాయి. బాధితుల కథనం మేరకు.. పెద్దబోధనం గ్రామానికి చెందిన రైతు నారాయణ((35) అదే గ్రామానికి చెందిన పద్మనాభశెట్టి అనే రైతు వద్ద 10 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని పంటలు సాగు చేసేవాడు. బుధవారం ఉదయం పెద్దబోధనం గ్రామానికి చెందిన కూలీలు ఏసన్న, చాకలి సంజీవతో కలసి చిన్నబోధనంలోని కౌలు పొలంలో సేద్యపు పనులు చేసేందుకు వెళ్లారు. అయితే పొలంలో విద్యుత్ తీగలు తెగిపడి ఉండడంతో ట్రాన్స్‌ఫార్మర్ ఫీజులు వాటిని చుట్ట చేసి పక్కన పెట్టేందుకు యత్నించారు.
ఈక్రమంలో విద్యుత్ స్తంభంపై ఉన్న మరోలైన్‌కు వీరు పట్టుకున్న తీగ తగిలింది. ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో కౌలు రైతు నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఏసన్న, చాకలి సంజీవలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని పక్క పొలంలోని రైతులు 108 కు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి తరలించారు. సంజీవ పరిస్థితి విషమించడంతో కర్నూలుకు తరలించారు. కౌలు రైతు నారాయణకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యమే కారణం..
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. పది రోజుల కిందట వర్షాలకు విద్యుత్ స్తంభం నేలకొరగడంతో విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చామని, కేవలం ఒక విద్యుత్‌లైన్‌ను తొలగించారని, స్తంభాన్ని పునరుద్ధరించడంగాని, పొలాల్లో అడ్డంగా పడి ఉన్న విద్యుత్ తీగలను తొలగించడం గాని చేయలేదన్నారు. దీంతో రైతు పంట సాగుకు అడ్డుగా ఉండడంతో వాటిని తొలగించే క్రమంలో ప్రమాదానికి గురయ్యాడని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Advertisement
Advertisement